Tuesday, April 25, 2023

తెలంగాణా రాష్ట్ర గ్రామీణ ప్రాంతంలో ఏం జరుగుతోంది

తెలంగాణా రాష్ట్ర  గ్రామీణ ప్రాంతంలో ఏం జరుగుతోంది  - 1 

Courtesy by :
కన్నెగంటి రవి ,
రైతు స్వరాజ్య వేదిక , 
ఫోన్: 9912928422 
-----------------------------------------------
రాష్ట్ర ప్రభుత్వ అంచనా ప్రకారం 2021 నాటికి తెలంగాణ రాష్ట్ర జనాభా ( 3 కోట్ల 80 లక్షలు ) లో 60 శాతం జనాభా  గ్రామీణ ప్రాంతంలోనే ఉన్నారు. గ్రామీణ ప్రాంతం నుండీ పట్టణాలకు, నగరాలకు వలసలు కొనసాగుతున్నా , రాబోయే కాలంలో కూడా కనీసం సగం జనాభా గ్రామీణ ప్రాంతంలోనే ఉండబోతున్నది. ఇప్పటి వరకూ గ్రామీణ ప్రాంతంలో వయసుల వారీ జనాభా అంచనా మాత్రమే ఉంది . 2011 నాటి  SC, ST కులాల జనాభా వివరాలు అందుబాటులో ఉన్నాయి కానీ,  మిగిలిన కులాల వారీ జనాభా సంఖ్య,ఇతర వివరాలు  అందుబాటులో లేవు .గ్రామీణ ప్రజలు ఎక్కువగా పంటల సాగు , కూలీ పని, పశు పోషణ, గృహ పరిశ్రమలు, చిన్నవ్యాపారాలు , ఇతర వృత్తులపై ఆధారపడి ఉన్నారు. ఆయా వృత్తులపై ఆధారపడిన వారి వివరాలు సమగ్రంగా అందుబాటులో లేవు. 
గ్రామీణ సహజ వనరులంటే సాగు భూమి, చెరువులు ,అడవి , కొండలు, గుట్టలు, ఉమ్మడి భూములు,ఖనిజ సంపద. ఈ సహజ వనరులపై స్థానికులకు హక్కులు ఉండాలి.  కానీ ఈ సహజ వనరులపై స్థానిక ప్రజలలో ఎక్కువ మందికి ఇప్పటికీ చట్టబద్ధ హక్కులు లేవు. ప్రభుత్వాలు గత 7 దశాబ్ధాలుగా అనేక అభివృద్ధి  ప్రణాళికలు వేసినా, స్థానిక ప్రజలకు వనరులపై హక్కులు దక్కక పోగా, వారికి ఉన్న కొద్దిపాటి హక్కులు కూడా వివిధ కారణాల వల్ల వారి చేతుల్లో మిగలడం  లేదు. మరీ ముఖ్యంగా గత మూడు దశాబ్ధాలుగా సహజ వనరులు, ముఖ్యంగా భూమి జీవనోపాధి వనరుగా కాకుండా, ఆస్తిగా, మార్కెట్ సరుకుగా మారిపోతున్నది . ఒక్క గ్రామీణ వ్యవసాయ దారులు తప్ప, సమాజంలో ఆస్తి పర వర్గాలు, ఇతర ఆదాయ వనరులు ఉన్న వాళ్ళు  సాగు భూములను పెద్ద ఎత్తున కొనుగోలు  చేస్తున్నారు. వ్యవసాయాన్ని వృత్తిగా కొనసాగిద్దమని భావించే గ్రామీణ పేదలు ,తమకున్న కొద్దిపాటి ఆదాయంతో ఎప్పటికీ  సాగు భూములు  కొనుక్కోగలిగిన  పరిస్థితి లేదు. 
గ్రామీణ ప్రాంతాలలో లక్షలాదిమందికి ఉపాధి కల్పించే బీడీ, చేనేత లాంటి గృహ పరిశ్రమలున్నాయి. కానీ ఈ రంగాల కార్మికులకు ఆదాయాలు అతి తక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు, వ్యాపారాలు , స్వయం ఉపాధి ద్వారా కూడా కొంత మందికి ఉపాధి లభిస్తున్నది. గ్రామానికి దగ్గరలో ఉన్న నగరాలు, పట్టణాలలో అసంఘటిత కార్మిక రంగంలో జీవనోపాధి అవకాశాలు పొందడానికి ప్రజలు ప్రయత్నిస్తున్నారు. కానీ భవన నిర్మాణ రంగంలో వేగంగా పెరుగుతున్న యాంత్రీకరణ ఈ ఉపాధి అవకాశాలను కూడా తగ్గిస్తు న్నది. 
రైతులను అన్నదాతలుగా కీర్తించే పాలకులు , తాము రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశ పెడుతున్నామని చెప్పుకునే ప్రభుత్వ పెద్దలు, ప్రైవేట్ సంభాషణల్లో  ఇప్పుడు కోనసాగుతున్న అభివృద్ధి  నమూనాలో గ్రామాల ఆర్ధిక వ్యవస్థను అభివృద్ధి  చేయడం సాధ్యం కాదనీ,  అవసరం కూడా లేదనీ, గ్రామాల ప్రజలు, గ్రామాలను వదిలి, పట్టణాలకు,నగరాలకు వలస వెళ్లాలనీ , పారిశ్రామిక, సేవా రంగాలలో పనులు వెతుక్కోవాలనీ, అప్పుడే వారి సమస్యలు పరిష్కారమై ,ఆదాయలు,  జీవన ప్రమాణాలు మెరుగై, గ్రామీణ సంక్షోభం సమసి పోతుందనీ ప్రకటిస్తుంటారు. నిజానికి తమ ఆచరణతో, ప్రభుత్వాలు ,అధికార గణం,కొన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు ఈ భావాలను నిజం చేస్తున్నాయి.  
ఈ ధోరణికి మూలాలు భారత దేశంలో 1991 నుండీ ప్రభుత్వాలు అమలు చేసిన  ప్రపంచ బ్యాంక్ అజెండా లో ఉన్నాయి. 2015 నాటికి 40 శాతం ప్రజలు  మాత్రమే గ్రామాలలో ఉండాలనీ, మిగిలిన వాళ్ళు ఇతర రంగాలలోకి ,పట్టణీకరణ చెందాలనీ ఈ అభివృద్ధి  నమూనా సూచించింది. ప్రపంచబ్యాంకు అజెండా కు దేశంలో, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో వచ్చిన ప్రతిఘటన ఈ పరిణామాన్ని ఆలస్యం చేసింది. 
గ్రామీణ ప్రాంత భూమి సంబంధాలలో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతంలో స్వంత భూమి లేని కుటుంబాల సంఖ్య ఎక్కువగానే ఉన్నది. సన్న, చిన్నకారు రైతుల చేతుల్లో ఉన్న  భూమి కూడా వివిధ కారణాల వల్ల  మరింత చిన్న కమతాలుగా మారుతున్నదీ. లేదా వారి చేతుల్లోంచి క్రమంగా జారిపోతున్నది. ఫలితంగా జీవనపాధి కోసం వ్యవసాయం  చేసే కౌలు రైతుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. మరో వైపు భూ గరిష్ట పరిమితి  చట్టంతో సంబంధం లేకుండా వందల ఎకరాల భూములను కొద్ది మంది వ్యక్తులు,చట్టంలో ఉన్న మినహాయింపులను వాడుకుని వివిధ పేర్లతో కొనుగోలు చేస్తున్నారు . 
ఒక వైపు క్షేత్ర స్థాయిలో వ్యవసాయ భూములు ,వ్యవసాయేతర అవసరాలకు , ముఖ్యంగా రియల్ ఎస్టేట్ పేరుతో పెద్ద ఎత్తున  మళ్లించబడుతున్నాయి. ఈ ధోరణి అన్ని జిల్లాలలో మండల కేంద్రాలు , జిల్లా కేంద్రాల చుట్టూ ఎక్కువగా కనపడుతున్నది. ఫలితంగా రాష్ట్రంలో భూముల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మనుషుల, మొత్తంగా సమాజ సుస్థిర అభివృద్ధికి ఏ మాత్రమూ తోడ్పడని స్పెక్యులేటివ్  మార్కెట్ ధోరణి ఇది. 
మరో వైపు  ప్రభుత్వ వ్యవసాయ శాఖ నివేదికల ప్రకారం రైతు బంధు సహాయం  అందుకుంటున్న వ్యవసాయ భూముల విస్తీర్ణం ప్రతి సంవత్సరం పెరిగిపోతూ సుమారు  1,55,00,000 ఎకరాలకు చేరుకున్నది. ఇది నిజంగా ఈ ప్రభుత్వం చేస్తున్న మిరాకిల్ మాత్రమే. ఏ దేశం లోనూ ,రాష్ట్రం లోనూ కనపడని విచిత్రమిది. 
2011 జనాభా లెక్కల ప్రకారం 31,00,000 మంది సాగుదారులు ఉండగా, ఇప్పుడు రైతు బంధు లబ్ధిదారుల  గణాంకాల  ప్రకారమే 63,00,000 మంది రైతులుగా నమోదై   రైతు బంధు సహాయం పొందుతున్నారు. ధరణి పోర్టల్ సమస్యల వల్లా (పార్ట్ బి ) ,  సాదా బైనామా డాక్యుమెంట్లు రెగ్యులరైజ్ కాకపోవడం వల్లా ఇంకా లక్షలాది ఎకరాల భూమి సాగు భూమిగా రికార్డులలో నమోదు కాలేదు. ఈ భూములన్నీ రెగ్యులరైజ్ అయితే, రాష్ట్రంలో సాగు భూముల విస్తీర్ణం మరింత పెరుగుతుంది. రైతుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. 
మామూలుగా అభివృద్ధి చెందిన దేశాలలో , పారిశ్రామిక, సేవా రంగాలు విస్తరించిన కొద్దీ, వ్యవసాయం పై ఆధారపడే వాళ్ళ సంఖ్య తగ్గిపోవడం సర్వ సాధారణం. కానీ మన రాష్ట్రంలో భిన్నంగా జరుగుతూ, రైతుల సంఖ్య పెరుగుతున్నది. పట్టా భూమి పై ఆధారపడి ప్రభుత్వాలు వ్యవసాయ రంగ పథకాలు రూపొందిస్తున్నందున భూ యజమానులు కుటుంబంలో ఉన్న కొద్ది పాటి భూమిని , ఇతర కుటుంబ సభ్యుల పేరుకు మార్చడం రైతుల సంఖ్య పెరగడానికి ఒక కారణమైతే,  వ్యవసాయంతో రోజు వారీ సంబంధం లేని వ్యవసాయేతర వృత్తుల వారు చిన్న, చిన్నరియల్ ఎస్టేట్  ప్లాట్లుగా వ్యవసాయ భూములు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తూ, రైతులుగా నమోదవడం మరో కారణం. 
ప్రభుత్వ రంగంలో ఉద్యోగ ఖాళీలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు భర్తీ  చేయడం లేదు. ఖాళీల సంఖ్య ప్రతి నెలా పెరగిపోతుంటుంది. కానీ సకాలంలో నోటిఫికేషన్ లు వెలువడవు. జాబ్ క్యాలండర్ కూడా లేదు. ఒక వేళ ఆన్ని పోస్టులనూ నింపినా, చదువుకున్న అందరికీ ప్రభుత్వ రంగంలోనే ఉద్యోగాలు లభించడం కష్టం. ఇంటికో ప్రభుత్వం ఉద్యోగం అని ఏ పార్టీ హామీ ఇచ్చినా అది మోసం చేయడమే.  E సేవ, మీ సేవ లాంటి ఫీజు చెల్లింపు ఆధారిత సర్వీస్ సెంటర్ లతో ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల పనులను ప్రైవేట్ పరం చేసిన విషయాన్ని కూడా మనం గమనంలో ఉంచుకోవాలి. నిజంగా మరిన్ని ఉపాధి అవకాశాలకు ఆస్కారం ఉన్న రంగాలను (విద్య, వైద్యం, వ్యవసాయం) అభివృద్ధి చేయడానికి ఈ ప్రభుత్వానికి ఆసక్తి లేదు.  
ఇవాల్టి పరిస్థితులలో పారిశ్రామిక ,సేవా రంగాలలో ఉపాధి కల్పనకు  కొన్ని పరిమితులు ఉన్నాయి. భారీ యాంత్రీకరణ , కృత్రిమ మేధో సంపత్తి ( AI ) ఆధారంగా కంప్యూటరీకరణ ,ఉపాధి అవకాశాలను తగ్గించేస్తున్నాయి. రాష్ట్రంలో ఏర్పడుతున్న ప్రైవేట్ సంస్థల, పరిశ్రమల  యజమానులు అతి తక్కువ కూలీ  రేట్లకు పనిచేసే , ఏ హక్కులూ అడగని కార్మికులనే పనిలోకి తీసుకుంటున్నారు. ఏ జిల్లాలో ఏ సంస్థా , పరిశ్రమా వచ్చినా, స్థానికులకు కాక, ఇతర రాష్ట్రాల నుండీ వలస వచ్చిన వారికి యజమానులు ఉపాధి కల్పించడానికి ఇదే కారణం.

No comments:

Post a Comment