*జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే.... ఓ రాజకీయ పార్టీకీ ఎలాంటి అర్హతలు ఉండాలి...?*
న్యూఢిల్లీ: సీపీఐ, ఎన్సీపీ, టీఎంసీలకు జాతీయ పార్టీల గుర్తింపును ఎన్నికల సంఘం రద్దు చేసిన విషయం తెలిసిందే. కొత్తగా అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి ఈసీ జాతీయ హోదా ఇచ్చింది.అయితే ఓ రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే.. ఎలాంటి అర్హతలు ఉండాలి? ఎన్ని ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు గెలవాలి? ఎన్ని రాష్ట్రాల్లో ఉనికి ఉండాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కనీసం నాలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ గుర్తింపు పొంది ఉండాలి. అసెంబ్లీ లేదా సార్వత్రిక ఎన్నికల్లో(లోక్‌సభ) నాలుగు రాష్ట్రాల్లో కనీసం 6శాతం ఓట్లు పొంది ఉండాలి. లేదా నాలుగు ఎంపీ సీట్లైనా గెలవాలి. లేదా లోక్‌సభలో రెండు శాతం సీట్లు కలిగిఉండాలి. కనీసం మూడు రాష్ట్రాల నుంచి ఆ పార్టీ ఎంపీలు ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి ఉండాలి. వీటిలో ఏ అర్హత ఉన్నా ఎన్నికల సంఘం ఓ రాజకీయ పార్టీని జాతీయ పార్టీగా గుర్తిస్తుంది.
*ప్రస్తుతం దేశంలో 6 జాతీయ పార్టీలు*
ప్రస్తుతం దేశంలో ఆరు పార్టీలకు జాతీయ హోదా ఉంది. బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ), నేషనల్ పీపుల్స్ పార్టీ,ఆమ్ ఆద్మీ పార్టీ ఈ జాబితాలో ఉన్నాయి. కొత్తగా జాతీయ హోదా పొందిన ఆప్‌ను అరవింద్ కేజ్రీవాల్ 2012లో స్థాపించారు. 2015, 2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో, 2022లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజ యం సాధించింది.
1925లో ఏర్పాటైన సీపీఐ 1989లో జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతినడం, దేశవ్యాప్తంగా కూడా తగిన సంఖ్యలో లోక్‌సభ సీట్లను సాధించలేకపోవడంతో జాతీయ హోదాను కోల్పోయింది.
జాతీయ హోదా కోల్పోయిన టీఎంసీని 1998లో మమతా బెనర్జీ స్థాపించారు. టీఎంసీ 2004లో రాష్ట్ర పార్టీ హోదా పొందింది. తర్వాత అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపురకూ విస్తరించగా.. 2016లో జాతీయ పార్టీ హోదా వచ్చింది. కానీ తర్వాత పెద్దగా ప్రభావం చూపకపోవడంతో హోదా కోల్పోవాల్సి వచ్చింది.
శరద్‌పవార్ 1999 లో కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి ఎన్సీపీని స్థాపించారు. వివిధ ఎన్నికల్లో విజయం సాధించడంతో 2000 సంవత్స రంలో జాతీయ హోదా లభించింది.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment