Thursday, September 15, 2022

పేరు పెట్టడం ఓకే.... దళిత ముఖ్యమంత్రి హామీ ఏమైంది... RS ప్రవీణ్ కుమార్

*పేరు పెట్టడం ఓకే.... దళిత ముఖ్యమంత్రి హామీ ఏమైంది... RS ప్రవీణ్ కుమార్*

తెలంగాణ సెక్రటేరియెట్ కు అంబేడ్కర్ పేరు పెట్టడం మంచిదే అని బీఎస్పీ స్టేట్ ఛీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కానీ భవనాలకు, రోడ్లకు, పేరు పెట్టి, పెద్ద విగ్రహాలను నిర్మించి, ఆ మహనీయుల ఆశయాలను తెలివిగా తుంగలో తొక్కే ప్రయత్నం అనాదిగా జరుగుతున్నదే అని గుర్తు చేశారు.అధికారం కోసం ఏమైనా చేస్తారు..మీకు చిత్తశుద్ది ఉంటే మీ అక్రమ ఆస్తులను పేదలకు పంచి సామాజిక అసమానతలను తగ్గించాలని డిమాండ్ చేశాడు. 2014కు ముందు దళితుడిని సీఎం చేస్తానని మాట తప్పారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుర్తు చేశారు. బహుజనుల ఓట్ల కోసం ఆధిపత్య వర్గాలు ఏమైనా చేస్తారని దుయ్యబట్టారు. బహుజనుల లక్ష్యం కుర్చీ తప్ప మరొటి కాదని మాన్యవర్ కాన్సిరాం గారు ఏనాడో చెప్పారని తెలిపారు.

ఫాం హౌస్‌లను పేదలకు రాసివ్వండి..అంబేడ్కర్ పై అభిమానం ఉంటే ముందు మీ ఫాం హౌస్‌లను పేదలకు రాసివ్వండని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా మీ బినామీ కంపెనీలను పేదలకు పంచి, ఇన్ని రోజులు తెలంగాణల చేసిన దోపిడీకి ట్యాంక్ బండ్ దగ్గర క్షమాపణ చెప్పాలన్నారు.

అధికారమే బహుజనుల లక్ష్యం..

మనం అడగకపోయినా సచివాలయానికి బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టాడు. కానీ ఆయన వెయ్యి సార్లు ప్రతిజ్ఞ చేసి చెప్పిన దళిత ముఖ్యమంత్రి పదవి మాత్రం ఇవ్వడని చెప్పారు. తన తర్వాత కూడా కొడుకునే ముఖ్యమంత్రి చేసే పనిలో ఉన్నాడని వివరించారు. "బహుజనులారా సచివాలయానికి బాబాసాహెబ్ పేరు చూసి సంకలు గుద్దుకుందామా? బహుజనులను ముఖ్యమంత్రి పీఠం ఎక్కించే కాన్సిరాం బాటలో నడుద్దామా?" ప్రజలే నిర్ణయించుకోవాలని కోరారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

No comments:

Post a Comment