Friday, September 30, 2022

న్యాయ వాది ఆత్మహత్య.... హైకోర్టుకు నిప్పు

*న్యాయ వాది ఆత్మహత్య.... హైకోర్టుకు నిప్పు*

*మధ్యప్రదేశ్‌లో లాయర్ల నిరసన....!*

జబల్‌పుర్‌: మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని జబల్‌పుర్‌లో హైకోర్టు న్యాయవాది ఆత్మహత్య పెను విధ్వంసానికి కారణమైంది.అనురాగ్‌ సాహూ అనే న్యాయవాది బలవన్మరణానికి పాల్పడగా.. ఆయన తోటి న్యాయవాదులు శుక్రవారం తీవ్రస్థాయిలో నిరసనలు చేపట్టారు. హైకోర్టు ప్రాంగణంలో విధ్వంసానికి దిగి, న్యాయస్థానానికి నిప్పు పెట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాయర్లపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు.

జబల్‌పుర్‌ హైకోర్టులో న్యాయవాది అయిన అనురాగ్‌ సాహూ ఓ అత్యాచారం కేసులో బాధితుల పక్షాన వాదించారు. ఈ కేసులో నిందితుడి బెయిల్‌ పిటిషనుపై శుక్రవారం జస్టిస్‌ సంజయ్‌ ద్వివేది ధర్మాసనం ఎదుట విచారణ జరిగింది. ఆ సమయంలో.. అనురాగ్‌ సాహూకు, నిందితుడి తరఫు న్యాయవాదికి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకొంది.

చివరకు ఇద్దరూ వ్యక్తిగత దూషణల స్థాయికి వెళ్లారు. ఈ నేపథ్యంలో అనురాగ్‌ సాహూ కోర్టు నుంచి హడావుడిగా ఇంటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే తోటి న్యాయవాదులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు.

అనురాగ్‌ మృతదేహంతో నేరుగా హైకోర్టు ప్రాంగణానికి చేరుకొని మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు డిమాండ్‌ చేస్తూ నిరసనకు దిగారు. ఈ నిరసన కాసేపటికి హింసాత్మకంగా మారింది. లాయర్లు కోర్టు లోపలకు ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారు. అక్కడి వస్తువులకు నిప్పంటించారు.

పోలీసులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకోగా.. లాయర్లు వారిని అడ్డుకున్నారు. మంటలు ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బందినీ చాలాసేపు లోపలకు రానివ్వలేదు. చివరకు.. న్యాయవాదులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment