Friday, September 9, 2022

కలలు కనడం....వాటిని సాకారం చేసుకోవడం తెలంగాణకు తెలుసు... KTR

కలలు కనడం....వాటిని సాకారం చేసుకోవడం తెలంగాణకు తెలుసు... KTR*

హైదరాబాద్‌: తెలంగాణ ప్రగతి చక్రానికి కేంద్రం కొన్ని ఆటంకాలు కలిగించవచ్చు కానీ అభివృద్ధి దిశగా రాష్ట్ర పయనాన్ని మాత్రం అడ్డుకోలేరని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.ఈ మేరకు ట్విటర్‌ వేదికగా కేంద్ర ప్రభుత్వ తీరుపై కేటీఆర్‌ మండిపడ్డారు. ఐటీఐఆర్ రద్దు చేసినప్పటికీ తెలంగాణ ఐటీ రంగం గత 8 ఏళ్లలో 3.2 రెట్లు వృద్ధి చెందిందన్నారు. నిరుడు దేశంలో మూడు ఐటీ ఉద్యోగాల్లో ఒకటి హైదరాబాద్‌లోనే వచ్చిందని పేర్కొన్నారు. సకాలంలో నిధులు ఇవ్వకపోయినా, ఎఫ్ఆర్‌బీఎం ఆంక్షలు విధించినప్పటికీ దేశంలో 2.5 శాతం జనాభా ఉన్న తెలంగాణ వాటా జీడీపీలో 5 శాతంగా ఉందని చెప్పారు. ఎనిమిదేళ్లలో తెలంగాణ తలసరి ఆదాయం దాదాపుగా రెట్టింపు అయిందన్నారు.

''పారిశ్రామిక కారిడార్లు తిరస్కరించినప్పటికీ రాష్ట్రంలో అద్భుతమైన వృద్ధి నమోదైంది. 20వేల పారిశ్రామిక యూనిట్ల మంజూరుతో పాటు 16 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు లభించాయి. తెలంగాణకు బల్క్ డ్రగ్ పార్కు ఇవ్వకపోయినా ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీ నిర్మించాం. మిషన్ కాకతీయకు తోడ్పాటు ఇవ్వకపోయినా 20వేల చెరువులు పునరుద్ధరించాం. కేంద్ర ప్రభుత్వ అమృత్ సరోవర్ పథకానికి మిషన్ కాకతీయ ఆదర్శంగా నిలిచింది. కేంద్రం ఒక్క వైద్య కళాశాల ఇవ్వకపోయినా జిల్లాకు ఒకటి చొప్పున 33 వైద్యకళాశాలలు నిర్మిస్తున్నాం. జాతీయ హోదా ఇవ్వకపోయినా ప్రపంచంలోనే పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్రం సొంతంగా నిర్మించింది. కేంద్రం మద్దతు ఉన్నా, లేకపోయినా పెండింగ్‌లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతాం. మిషన్ భగీరథకు సాయం చేసేందుకు నిరాకరించినా ప్రతి ఇంటికీ నల్లా నీరు ఇస్తున్న మొదటి రాష్ట్రంగా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాం. ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో.. ఎలా పోరాడాలో మాకు తెలుసు. కలలు కనడం.. వాటిని సాకారం చేసుకోవడం తెలంగాణకు బాగా తెలుసు'' అని కేటీఆర్ వెల్లడించారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

No comments:

Post a Comment