*నమ్మిన సిద్ధాంతాన్ని వదలను.... చావుకు భయపడను.... MLA ఈటల....!*
హైదరాబాద్: స్పీకర్‌ను ఉద్దేశించి 'మరమనిషి' అంటే సీఎం కేసీఆర్‌కు అంత కోపం ఎందుకని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు.కేసీఆర్ అనేక మాటలు అన్నారని.. వాటి సంగతేంటని నిలదీశారు. ఆయన తిట్లే తెలంగాణలో మాట్లాడే భాషనా? అని ప్రశ్నించారు. కేసీఆర్ చెప్పే ప్రతి మాటా అబద్ధమేనని ఈటల వ్యాఖ్యానించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
''బీఏసీ సమావేశానికి భాజపా ఎమ్మెల్యేలను పిలవలేదు. ఆ విషయంపై ఎమ్మెల్యే రఘునందన్ అడిగితే సభాపతి సమాధానం చెప్పలేదు. భాజపా సభ్యుల హక్కులను సభాపతి కాలరాశారు. ప్రజల సమస్యలపై సభలో ఎవరూ మాట్లాడకూడదా? బీఏసీలో సీఎం ఇచ్చిన అజెండానే సభలో అమలు చేశారు. శాసనసభలో ప్రజా సమస్యలు ప్రస్తావించే అవకాశం ఇవ్వాలని కోరా. ఈ ప్రభుత్వం రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదు. రైతుల సమస్యలపై తెరాస, కాంగ్రెస్, ఎంఐఎం సభలో చర్చించలేదు. నిరుద్యోగ సమస్యపై సభలో ఒక్కరూ మాట్లాడలేదు. గొల్లకురుమలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అన్ని పార్టీలు, సభ్యుల హక్కులను సభాపతి కాపాడాలి. సభలో తప్పు ఎవరిదో ప్రజలందరికీ తెలుసు.
గతంలో రెక్కీ నిర్వహించి నన్ను చంపుతానని బెదిరించినప్పుడే నేను భయపడలేదు. నాకు, నా కుటుంబసభ్యులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్ వహించాల్సిందే. నాపై దాడి జరిగితే అది యావత్ తెలంగాణపై జరిగిన దాడిగా భావిస్తాం. 24 గంటలూ స్వేచ్ఛగా, ఒంటరిగా తిరగగలిగే శక్తి ఉన్నవాడిని నేను. చావుకు భయపడేది లేదు. ఎన్ని బెదిరింపులు వచ్చినా.. ఎంత ఒత్తిడి చేసినా.. నమ్మిన సిద్ధాంతాన్ని వదలకుండా సాగుతున్నాను'' అని ఈటల అన్నారు.
*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం
No comments:
Post a Comment