Thursday, September 22, 2022

పోస్టల్ బ్యాలెట్ పై ఎన్నికల సంఘం కీలక సిఫార్సు.....!

*పోస్టల్ బ్యాలెట్ పై ఎన్నికల సంఘం కీలక సిఫార్సు.....!*


దిల్లీ: ఎన్నికల సమయంలో పోస్టల్‌ బ్యాలెట్లు  అవకాశం ఉందని భావిస్తోన్న కేంద్ర ఎన్నికల సంఘం కీలక మార్పులకు సిద్ధమైంది. పోలింగ్‌ విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌కు బదులుగా అదే కేంద్రంలో తమ బ్యాలెట్‌ను సమర్పించే వెసులుబాటును కల్పించాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని సిఫార్సు చేస్తూ ఎన్నికల సంఘం తాజాగా కేంద్ర న్యాయశాఖకు లేఖ రాసింది.

పోలింగ్‌ విధులు నిర్వర్తించే సిబ్బంది తమకు ఇచ్చిన పోస్టల్‌ బ్యాలెట్లను వినియోగించుకోకుండా తమవెంటే పెట్టుకున్నట్లు గతంలో జరిగిన ఎన్నికల్లో గుర్తించాం. నిబంధనల ప్రకారం కౌంటింగ్‌ తేదీన ఉదయం 8 గంటల వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ అందజేయవచ్చనే ఆలోచనతో వాటిని సిబ్బంది తమతోనే ఉంచుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల సమయంలో విధులు ముగిసిన తర్వాత పోస్టల్‌ బాలెట్లను సిబ్బంది తమతోపాటే ఇంటికి తీసుకెళ్లడంపైనా ఈసీ ఆందోళన వ్యక్తం చేసింది. 1951 నాటి ప్రజాప్రతినిధ్య చట్టం, 1961 ఎన్నికల నిర్వహణ నిబంధనల్లోని రూల్‌ 18 ప్రకారం కౌంటింగ్‌ తేదీన ఉదయం వరకు పోస్టల్‌ బ్యాలెట్లను అనుమతిస్తారు. ఇలా గత రెండేళ్లలో గోవా, కేరళ, మణిపూర్‌లలో జరిగిన ఎన్నికల్లో దాదాపు 50శాతానికి పైగా పోస్టల్‌ బ్యాలెట్లు వచ్చినట్లు వెల్లడైంది.

ఈ నేపథ్యంలో ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌కు బదులుగా ఆ కేంద్రంలోనే ఓటును వినియోగించుకోవడంపై సెప్టెంబర్‌ 16న జరిగిన సమావేశంలో భారత ఎన్నికల ప్రధాన అధికారి (CEC) రాజీవ్‌ కుమార్‌, ఎన్నికల కమిషనర్‌ అనూప్‌ చంద్రపాండేలు నిర్ణయించినట్లు సమాచారం. ఇదే విషయాన్ని తెలియజేస్తూ కేంద్ర న్యాయశాఖకు ఎన్నికల సంఘం లేఖలో సిఫార్సు చేసింది.

ఇప్పటి వరకు ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది శిక్షణ సమయంలోనే ఆయా రిటర్నింగ్‌ అధికారిని సంప్రదించి పోస్టల్‌ బ్యాలెట్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అనంతరం వారికి పోలింగ్‌ స్టేషన్‌ కేటాయించే ముందే వారికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే కేంద్రాల్లో పోస్టల్‌ బ్యాలెట్లను అందజేస్తారు. ఈ క్రమంలోనే పోస్టల్‌ బ్యాలెట్లు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని గుర్తించిన ఎన్నికల సంఘం ఈ విధానంలో మార్పులు తెచ్చేందుకు సిద్ధమైంది.

*సుజీవన్ వావిలాల*🖋️

No comments:

Post a Comment