Monday, September 2, 2024

*వరద బాధితులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు భరోసా*

గత మూడు రోజులుగా భారీ వర్షాలతో అతలాకుతలమైన ప్రాంతాలను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా పరిశీలించారు. పలు ప్రాంతాల్లో బాధితులతో స్వయంగా మాట్లాడారు. ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సహాయక చర్యల్లో నిర్లక్ష్యం వహించొద్దని అధికారులను ఆదేశించారు. సహాయ కార్యక్రమాల ఖర్చులకు వెనుకాడేది లేదన్నారు. పేదలను ఆదుకోవడంలో ఎక్కడా రాజీ పడబోమని స్పష్టం చేశారు.

* భారీ వర్షాలపై నిరంతరంగా సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి గారు ఉదయం హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్నతస్థాయి సమావేశంలో పలు ఆదేశాలు జారీ చేసి ఆ వెంటనే బయలుదేరి ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని నష్టపోయిన ప్రాంతాల్లో సహచర మంత్రులతో కలిసి పర్యటించారు.

* వరద వల్ల జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా చూసిన తర్వాత సహాయక చర్యలపై యంత్రాంగానికి అవసరమైన ఆదేశాలు ఇచ్చారు.

* ఆ తర్వాత ఖమ్మం కలెక్టరేట్ లో ఉపముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలతో పాటు ప్రజా ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

* చేపట్టాల్సిన పనులపై ముఖ్యమంత్రిగారు అధికారులకు మార్గనిర్ధేశం చేశారు. స్వయంగా రెండు రోజులుగా ప్రజలను రక్షించే పని చేసినప్పటికీ దురదృష్టవశాత్తు 16 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వేల కోట్ల ఆస్తులు, లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. నిరంతరాయంగా పనిచేయడం వల్లే ప్రాణ, ఆస్తినష్టం సాధ్యమైనంత మేరకు నివారించగలిగామని చెప్పారు.

* తాజా పరిస్థితులను ప్రధాని, కేంద్ర హోం మంత్రికి వివరించామని, తక్షణమే నష్ట నివారణకు సహకరించాలని అడిగిన విషయాన్ని ప్రజలకు వివరించారు. తాత్కాలిక ఉపశమనంగా ప్రాథమిక అంచనా ప్రకారం కేంద్రాన్ని రూ.5,438 కోట్ల రూపాయాలు ఇవ్వాలని కోరాం. జరిగిన నష్టాన్ని ప్రధాని స్వయంగా పరిశీలించాలని కోరినట్టు చెప్పారు.

* జరిగిన నష్టంలో ప్రజలకు ఎంత చేసినా తక్కువే. ప్రజలు సర్వం కోల్పోయారు. కట్టుబట్టలతో మిగిలారు. ఇండ్లలో బురద మిగిలింది. వాళ్లను ఆదుకోడానికి ఖమ్మంలో 34 క్యాంపులు 2,119 కుటుంబాల్లో 7,467 మందికి రాష్ట్ర ప్రభుత్వం వసతి ఏర్పాటు చేసింది. ప్రభుత్వం మంచి పనులకు సహకరించడానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు 5 లక్షలు సీఎం సహాయనిధికి ఇచ్చారంటూ అభినందనలు తెలిపారు.

* రెస్క్యూ, రిపేర్, రిస్టోర్, రిపోర్టుతో జిల్లా యంత్రాంగం రాబోయే 5 రోజులూ కష్టపడి పనిచేయాలని, ప్రతి క్షణం  అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యల్లో నిర్లక్ష్యం వహించొద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. భారీ నష్టం జరిగిన సమయంలో ప్రజలు కోపంలో, బాధలో ఉంటారని, వారు బాధల్లో ఉన్నప్పుడే మనం వెళ్లాలి. రాత్రి ఇక్కడే బస చేస్తా. ప్రజల్లోనే ఉంటానంటూ ప్రజలకు ముఖ్యమంత్రి గారు భరోసానిచ్చారు. #Floods 

Courtesy / Source by : https://x.com/TelanganaCMO/status/1830639010840011050?t=7EqZPZ9HAoILcKCJpaT4dA&s=19

No comments:

Post a Comment