*_సంతాపదినాలు అపహాస్యం.!_*
_★ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినా పట్టిచుకోని వినోద భారతం.!_
_★ మహానేతకు ఇచ్చే నివాళి ఇదేనా..?_
_★ 8 వేల ప్రైవేటు వినోద ఛానళ్ళకు సంతాప ఆదేశాలు పట్టవా..?_
_★ దేశవ్యాప్తంగా 'ఒక్కక్షణం' ఆగని సినిమా ప్రసారాలు.!_
_★ నేటి అంత్యక్రియల సందర్భంలోనూ...నిరాఘాటంగా ఎంటర్ టైన్ మెంట్.!_
_★ ప్రభుత్వ ఛానళ్ళకు మాత్రమేనే...!_
_★ నూతన సంవత్సర వేడుకల మాట ఏమిటి.?_
_★ కాంగ్రెస్ మాత్రమే పాటించాలా.?_
_★ చట్టానికి సవరణలు అవసరం.!_
_★ 'తెలంగాణ వాచ్' ప్రత్యేక సంచలన పరిశోధన కథనం._
Courtesy / source by :
_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఈ దశాబ్ది ఉత్తమ పరిశోధన పాత్రికేయ అవార్డు గ్రహీత, 9440000009)_
*_మహనీయులు మన్మోహన్ సింగ్ తిరిగి రాని లోకాలకు తరలి పోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన 7 రోజుల 'సంతాపదినాల'కు అర్థం మారిపోయింది. గత పాతికేళ్ళక్రితం ఉన్న 'సంతాపదినాల'కు.. సాంకేతిక పరిజ్ఞానంతో వినోదం చాటున, మాటున వెలసిన ఛానళ్ళ ప్రభంజనంతో నేడు కొనసాగుతున్న 'సంతాపదినాల'కు ఎంతో వ్యత్యాసం ఉంది. కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్న దాచలేని నగ్న నిజం. 'చట్టాల చట్రం' కొన్ని విషయాలకే పరిమితం అయిపోయింది. మానవతా విలువలు పడిపోతున్నాయని నిగూఢ నిట్టూర్పులు ఒకవైపు. దేశంలో పాతబడిన చట్టాలకు మరమ్మతులు ఆసన్నమైన తరుణం మరోవైపు. ఒకప్పటి సంప్రదాయాలను, సాంకేతిక, ఆధునీకతల పేరిట తుడిచిపెట్టే ప్రయత్నం నేడు కరతాళ నృత్యం చేస్తోంది. నవ భారతంలో ఇవి సంతాప దినాలా.? నిజంగా మనం దేశభక్తి గల పౌరులుగా ఆ,యా దేశాధి నేతలకు అంజలి ఘటిస్తున్నామా..? జనవరి 1వ తేదీన జరుగనున్న నూతన సంవత్సర వేడుకల మాట ఏమిటి.? ప్రశ్నించాల్సిన 'ఫోర్త్ ఎస్టేట్' మాటున చల్లగా 'సంతాపదినాలు' అపహాస్యం పాలవుతున్న 'వింత బహిరంగ వైనం' ఇది._*
రాజకీయ ఆర్థిక వైతాళికుడు, దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మృతి సూచికంగా దేశ వ్యాప్తంగా సంతాప దినాలు డిసెంబర్ 27 నుంచి జనవరి 2 వరకు కొనసాగుతున్నాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించకూడదని ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్కడా ఎలాంటి 'అధికారిక కార్యక్రమాలు' చేయకూడదు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కేంద్ర హోంశాఖ సంతాప దినాలను ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. సంతాపదినాలు కేంద్రం ప్రకటించింది ఎందుకంటే మృతి చెందిన వ్యక్తి చేసిన జాతీయ సేవలను స్మరించుకోవడానికే. ఈ ఏర్పాట్లను ప్రభుత్వం చేపడుతుంది. ఘనంగా ప్రతి భారతీయుడి తరఫున ఘన నివాళులు అర్పిస్తుంది.
*_ప్రవేటు ఛానళ్లుకు పట్టవా...?_*
దేశవ్యాప్తంగా కేంద్ర సమాచారశాఖ నిబంధనల మేరకు అనుమతి పొందిన ప్రైవేటు ఛానళ్ళు 2023 నాటికి సుమారు 26 వందలకు పైగా ఉన్నాయి. రెండేళ్ళలో పాత లైసెన్స్ ల పేరిట మరో 870 శాటిలైట్ ఛానళ్ళు రంగప్రవేశం చేశాయి. దీనికి తోడు దేశంలోని 718 జిల్లాలలో 5 వేల పైచిలుకు కేంద్రాలలో స్థానిక, వెబ్ ఛానళ్ళు కలిపి సుమారుగా తొమ్మిది వేల ఛానళ్ళు ధనార్జనే ధ్యేయంగా ప్రజలకు 'వినోదం' అందిస్తున్నాయి. మన్మోహన్ జీ విషయంలో ప్రభుత్వ ఛానళ్ళు మినహా మిగిలిన వినోదాత్మక ఛానళ్ళు కనీసం నిమిషం కూడా 'మౌనం' పాటించలేక పోయాయి. ఇందులో 242 హెచ్.డి ఛానళ్ళు కూడా ఏంచెక్కా ఇమిడిపోయాయి. మరి ఈ ఛానళ్ళు కనీసం ఓ వారంపాటు 'వినోదం' పక్కనపెట్టలేక పోవడం అవాంఛనీయ దురదృష్ఠకరం. కేంద్ర ప్రభుత్వ సమాచారశాఖ ఆధ్వర్యంలో కొనసాగే 34 దూరదర్శన్ ఛానళ్ళు మాత్రం 'సంతాపదినాల సంస్కృతి'ని కాపాడుతున్నాయి.
*_కొత్త సంవత్సరం వేడుకల పరిస్థితి_*
కొత్త సంవత్సరం వేడుకలను ప్రభుత్వం ఆపగలదా.? ఆప లేకపోతే మరి కేంద్ర హోం, రాష్ట్రాలు ప్రకటించిన ఈ సంతాప దినాలకు అర్థం ఉంటుందా.? కింకర్తవ్యం ఏమిటి.?
*_ఇప్పుడేం చేయాలి..?:_*
జాతీయ గౌరవచిహ్నాల పరిరక్షణ (అవమాన నిరోధక) చట్టం -1971లోని నిబంధనల ప్రకారం జాతీయజెండాను, జాతీయగీతాన్ని, జాతీయ గౌరవ చిహ్మాలను, స్వాతంత్ర్యయోధులను గౌరవించడం పౌరుల ప్రాధమిక విధి. దేశానికి చెందిన ప్రముఖ నాయకులు, ఉన్నత పదవులలో విధులు నిర్వహించే వ్యక్తులలో ఎవ్వరైనా మృతి చెందితే వారి మృతికి గౌరవంగా సంతాపం తెలుపడానికి పతాకాన్ని అవనతం చేయాలి. ఇది ప్రభుత్వం ప్రకటించిన సంతాప దినాల వరకే. అధికారిక ప్రకటన ప్రకారం అధికారిక వినోదం, అధికారిక విందులు, ఇతర కార్యకలాపాలు ఉండవు. అందుకే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన ఏ అనుబంధ సంస్థలు అయినా 'సంతాపదినాలు' పాటించే ప్రక్రియ కేంద్రం ప్రారంభించాలి. లేకపోతే... రెండు సార్లు ప్రధాని అయిన నిస్వార్థంగా నిరాడంబరుడు మన్మోహన్ సింగ్ స్మృతి పేరిటన ప్రకటించిన 'సంతాపదినాలు' ఈ విధంగా ఉంటే.. నేటి ని'స్వార్థ' రాజకీయ ప్రముఖులు(?) స్వర్గస్థులయితే.. వారి 'చితిమంటలు' ఆరకముందే ప్రజలు మరిచిపోతారు. కాదంటారా...?
*_చివరిగా..:_*
శనివారం మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు అధికారలాంఛనాలతో దిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో శనివారం ఉదయం 11.45గంటలకు ఆయన అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. కనీసం ఆ గంటపాటు అయినా యావత్ భారత్ సంతాపం పాటిస్తుందా.? ఇది మరీ అత్యాశ ఏమో.!
*_అంకితం:_*
దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన ఓ మన్మోహనుడా.. ఓ భారతీయ పౌరుడిగా, దేశ భక్తుడిగా, ఓ పాత్రికేయుడిగా ఇదే నా ఘన అంకిత నివాళి. క్షమించవా మహానుభావా.!
బాక్స్:
*_కాంగ్రెస్ మాత్రమేనా..?_*
డిసెంబర్ 28న జరగాల్సిన కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవంతో సహా ఏడు రోజుల పాటు అన్ని పార్టీ కార్యక్రమాలను కూడా కాంగ్రెస్ రద్దు చేసింది. ఇతర రాజకీయ పార్టీల పరిస్థితి వేరేలా ఉండటం గమనార్హం.
No comments:
Post a Comment