Wednesday, December 11, 2024

*_శ్రీహరికోట ఎంత భద్రం.?_*

_అభద్రతలో అంతరిక్ష పరిశోధన కేంద్రం_
*_శ్రీహరికోట ఎంత భద్రం.?_*
_# కానరాని సమన్వయ కమిటీ సూచనలు_
_# పోలీసుల తనిఖీలు అంతంతే_

Courtesy / Source by :
_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ప్రముఖ పరిశోధన పాత్రికేయులు, 9440000009)_

*_'తెలంగాణ వాచ్' సంచలన పరిశోధన కథనం_*

*_దేశ భద్రత దృష్ట్యా కొన్ని చేదు వాస్తవాలను బహిరంగ పర్చాల్సి ఉంటుంది. అలాంటి అరుదైన, అవాంఛనీయ కథనం ఇది. శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం భద్రత పరంగా అత్యంత సున్నితమైంది. అయితే ఈ విషయంలో నీలినీడలు అలుముకుంటున్నాయి. నిఘావర్గాలు హెచ్చరించినా లోపాలు కనిపిస్తున్నాయి. కేంద్ర పారిశ్రామిక భద్రత దళాలు, పోలీసుల మధ్య సమన్వయం సైతం లోపించింది. ఏడాది కిందట భద్రతపై సమన్వయ కమిటీ చేసిన సూచనలు అమలు కావడం లేదు._*

*_సమన్వయ కమిటీ సమావేశం_*
శ్రీహరికోట భద్రతకు సంబంధించి గతేడాది నవంబరు 8న సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. షార్‌ నియంత్రణ, విజిలెన్సు అధికారి శ్రీనివాసులురెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తమిళనాడు, ఆంధ్ర పోలీసు అధికారులు, కోస్ట్‌గార్డు, కేంద్ర, రాష్ట్ర నిఘా అధికారులు, సీఐఎస్‌ఎఫ్‌ దళాల అధిపతులు పాల్గొన్నారు. ఎవరు వస్తున్నారో..? వెళ్తున్నారో..? అర్థం కావడం లేదని, పరిసర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, నిరంతరం తనిఖీలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

*_చక్కర్లు కొట్టని బోటు_*
తీరంలో నిరంతరం బోటు ద్వారా పెట్రోలింగ్‌ చేయాలని కోస్ట్‌గార్డు అధికారులు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని రాష్ట్రాలకు సరఫరా చేసిన బోట్లు చక్కగా వినియోగంలో ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఉపయోగించడం లేదని ఆ విభాగం అధికారులు చెబుతున్నారు. 

*_అరకొరగానే.._*
కంచెతోపాటు సీసీ కెమెరాలు అరకొరగానే ఏర్పాటు చేశారు. దీవుల్లో తనిఖీలు మరిచారు. సీఐఎస్‌ఎఫ్, పోలీసుల మధ్య సమన్వయం లేదు. ఉద్యోగుల కాలనీలు, పులికాట్‌ నగర్‌లో చోరీలు జరుగుతున్నాయి. ఇటీవల బెల్జియంకు చెందిన ఉపగ్రహం రాగా పోలీసులు బందోబస్తు విస్మరించారు. 

*_దృష్టిసారిస్తాం.._* _-శ్రీనివాసులురెడ్డి, నియంత్రణ, విజిలిన్స్‌ అధికారి_
షార్‌ శ్రీహరికోట భద్రతపై దృష్టి పెడతాం. దీవుల్లో తనిఖీలు ఉండేలా సంబంధిత అధికారులతో మాట్లాడతాం. అన్ని విషయాలపై మరోసారి అధికారులతో చర్చిస్తాం.

*_చివరిగా.._*
భారత దేశ భద్రత దృష్ట్యా భారతీయ పౌరుడిగా ఎంతో సమాచారం ఉన్నప్పటికీ.. కొంత మేరకే సమాచారం బయటకు విడుదల చేస్తున్నాం. 'షార్' అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి వెంటనే కేంద్ర, రాష్ట్ర బలగాలతో రక్షణ కల్పించాల్సిన తక్షణ బాధ్యత ప్రభుత్వాలది. 

*_అంకితం_*
ఈ కథనం భారతరత్న అబ్దుల్ కలాంకు అంకితం

బాక్స్:

1970 వరకూ అంతరిక్ష పరిశోధనలకు కేరళ లోని తిరువనంతపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న తుంబా అంతరిక్ష కేంద్రాన్ని ఉపయోగించేవారు. కానీ దీని చుట్టూ జనసంచారం ఎక్కువగా ఉండేది. పైగా ఆ కేంద్రం మినీ రాకెట్ ప్రయోగాలకే పరిమితం. భవిష్యత్తులో చేయబోయే భారీ రాకెట్ ప్రయోగాల దృష్ట్యా భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం మరోచోట రాకెట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ నేతృత్వంలో అనువైన రాకెట్ ప్రయోగ కేంద్ర స్థలం కోసం అన్వేషణలో భాగంగా దేశంలో అన్ని ప్రాంతాలనూ పరిశీలిస్తూ రాగా ఈ దీవి కంటపడింది. భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ఈ దీవి రాకెట్ ప్రయోగాలకు అత్యంత అనువైనదిగా భావించిన సారాభాయ్ బృందం ఆ విషయాన్ని ఇస్రోకు తెలిపింది. శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగ కేంద్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులివ్వగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేల ఎకరాల స్థలాన్ని ఉచితంగా ఇచ్చింది.

No comments:

Post a Comment