Friday, December 27, 2024

_# ఆర్థిక సంస్కరణల రూపశిల్పి.!_

*_మన్మోహన్ జీ మళ్ళీ రావా.?_*
_# అవిశ్రాంత యోధుడు_
_# ఆర్థిక సంస్కరణల రూపశిల్పి.!_
_# సంతాపం సూచికంగా 'తెలంగాణ వాచ్' బ్యానర్ కిందకు..._

Courtesy / Source by :
_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఈ దశాబ్ది ఉత్తమ పరిశోధన పాత్రికేయ అవార్డు గ్రహీత, 9440000009)_

*_ఏ తెలివితేటలు లేని కొందరు నీతి లేని రాజకీయ దౌర్భాగ్యులను వదిలేద్దాం. మన దేశం కోసం మా కోసం మళ్ళీ రావా..? మన్మోహన్ సింగ్ జీ..._*

భారత మాజీ ప్రధాని, పద్మవిభూషణ్ మన్మోహన్‌ సింగ్‌ (92) ఇక లేరు. తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చేరిన ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మృదు స్వభావి అయిన మన్మోహన్ సింగ్.. ఉన్నత విద్యావంతుడు, ప్రఖ్యాత ఆర్థికవేత్త. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని గట్టెక్కించి అభివృద్ధిపథంలో పరుగులు పెట్టేలా చేసి ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా ప్రసిద్ధిగాంచారు. పార్లమెంటు సభ్యుడిగా దాదాపు 33 ఏళ్ల పాటు కొనసాగారు. ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లోనూ కీలక సమయాల్లో ఓపిగ్గా సభకు వచ్చి అందరిలోనూ స్ఫూర్తి నింపారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి, ప్రజా జీవితం నుంచి నిశ్శబ్దంగానే వైదొలగినప్పటికీ దేశ ఆర్థిక రంగానికి వేసిన బలమైన పునాదులు ఆయనను ఎన్నటికీ గుర్తు చేస్తూనే ఉంటాయి. ఆర్థిక మంత్రిగా ఎల్‌పీజీ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. 

దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు నేతృత్వంలో ఆర్థిక సంస్కరణలను పట్టాలెక్కించిన మన్మోహన్‌ సింగ్‌.. ఆ తర్వాత కాలంలో పదేళ్ల పాటు(2004-2014) ప్రధాన మంత్రి పదవిలో కొనసాగారు. 1991 అక్టోబరు 1న అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికై.. 2019 జూన్‌ 14 వరకు ఎగువ సభలో ఆ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారు. 2019 ఆగస్టు 20న రాజస్థాన్‌ నుంచి మళ్లీ రాజ్యసభకు ఎన్నికై ఈ ఏడాది ఏప్రిల్‌ 3 వరకు కొనసాగారు. రాజకీయాల్లోకి రాకముందు పంజాబ్‌ యూనివర్సిటీలో, దిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో అధ్యాపకుడిగా విద్యార్థులకు ఆర్థిక పాఠాలు బోధించారు. 1971లో కేంద్ర వాణిజ్యశాఖకు ఆర్థిక సలహాదారుగా నియమితులై అనతి కాలంలోనే ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రధాన సలహాదారు అయ్యారు. ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్‌గా, ఆర్బీఐ గవర్నర్‌గా, ప్రధాన మంత్రికి సలహాదారుగా, యూజీసీ ఛైర్మన్‌గా బహుముఖమైన సేవలందించారు.

ప్రధానిగా మన్మోహన్‌ సింగ్‌ రోజూ 18గంటల పాటు అవిశ్రాంతంగా పనిచేసేవారు. భారత విత్త వ్యవస్థను అత్యంత శక్తిమంతగా తీర్చిదిద్దారు. దశాబ్ద పాలనలో చిరస్మరణీయ విజయాలను అందుకున్నారు. 2005లో సమాచార హక్కు చట్టం, ఉపాధిహామీ పథకం వంటివి తీసుకొచ్చారు. ఆయన హయాంలో అత్యధిక జీడీపీ (10.8శాతం) వృద్ధిరేటు నమోదైంది. మన్మోహన్‌ హయాంలోనే వెనుకబడిన వర్గాలకు 27శాతం సీట్లు కేటాయించారు. ప్రధాని పీఠాన్ని అధిష్టించిన తొలి హిందూయేతర వ్యక్తిగానూ రికార్డు సాధించారు.

*_చివరిగా మళ్ళీ..._*
ఏం తెలివితేటలు లేని కొందరు నీతి లేని రాజకీయ దౌర్భాగ్యులను వదిలేద్దాం. మన దేశం కోసం మా కోసం మళ్ళీ రావా.. మన్మోహన్ సింగ్.

బాక్స్:
*_మన్మోహన్ సింగ్ పవర్‌ఫుల్ కోట్స్_*

వేలాది సమాధానాల కంటే నా మౌనమే గొప్పది.

డబ్బు సంపాదించాలంటే కష్టపడాలి.. కష్టపడకపోతే డబ్బు రాదు.

రాజకీయాలు చేసేటప్పుడు మనం ప్రజల గురించి ఆలోచించాలి, కానీ అందుకు మన నిర్ణయాలు తప్పు అయ్యేలా  చేయకూడదు.

జీవితంలో ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని రోజులు బాగుంటాయి, మరికొన్ని రోజులు చెడుగా ఉంటాయి.

ఓడిపోయిన వాడు తన కలలను వదులుకున్న వాడితో సమానం.

విద్య అనేది తెలివితేటలు పెంచేది మాత్రమే కాదు జీవితాన్ని కూడా నేర్పిస్తుంది
-మన్మోహన్‌ సింగ్

No comments:

Post a Comment