*బీజేపీ లోకీ BRS MLA. మూడు రోజుల్లో చేరిక...?*
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. మరోవైపు టికెట్ దక్కని ఆశావహులు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ఊహాగానాలు వినవస్తున్నాయి.తాజాగా.. ఉప్పల్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి బీజేపీలోకి చేరతారనే ప్రచారం ఊపందుకుంది.
ఉప్పల్ నియోజకవర్గం బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా బండారి లక్ష్మారెడ్డిని అధిష్టానం ఎంచుకుంది. ఆ సమయంలో.. భేతి సుభాష్‌రెడ్డి బహిరంగంగానే తన అసంతృప్తిని వెల్లగక్కారు. ఉద్యమకారుడిని పార్టీ కోసం తొలి నుంచి పని చేస్తున్న తనకు.. అవమానకర రీతిలో టికెట్ కేటాయించకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. అయితే ఎమ్మెల్సీ కవిత హామీతో ఆయన కాస్త చల్లబడ్డారనే అంతా భావించారు. ఆ తర్వాత ఆయన ఎందుకనో అధికారిక కార్యక్రమాల్లో ఆయన పెద్దగా కనిపించలేదు. ఈ లోపు కొందరు అసంతృప్తులకు నామినేటెడ్ పదవులు దక్కగా.. భేతికి మాత్రం మొండి చెయ్యే దక్కింది. ఈ తరుణంలో..
భేతి ఇప్పుడు బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీ చేరతారనే ప్రచారం నడుస్తోంది ఇప్పుడు. బీజేపీ అగ్రనేతల నిర్ణయంతో.. భేతితో కమలం నేతల సంప్రదింపులు జరిగాయని తెలుస్తోంది. అంతేకాదు.. భేతిపై సర్వేలు చేయించిన తర్వాతే ఆయన్ని బీజేపీలోకి తీసుకోవాలని బీజేపీ భావిస్తోందని.. ఉప్పల్ బీజేపీ అభ్యర్థిగా ఆయన్నే నిలబెట్టాలని నిర్ణయించిందని సమాచారం. మరో మూడు రోజుల్లో ఆయన లాంఛనంగా బీజేపీలో చేరతారనే మాట బలంగా వినిపిస్తోంది ఇప్పుడు.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment