*మహిళా బిల్లుపై భాజపా ముందుకొస్తే అన్ని పార్టీలు మద్దతిస్తాయి.... కవిత*
దిల్లీ: రాజకీయాల్లోనూ మహిళలకు సముచిత స్థానం దక్కాలని భారత్ జాగృతి అధ్యక్షురాలు, భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.మహిళా రిజర్వేషన్ బిల్లు చాలాకాలంగా పెండింగ్‌లో ఉందని.. దాన్ని ఆమోదించి చట్టంగా తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలో కవిత మాట్లాడారు. ధరణిలో సగం.. ఆకాశంలో సగం.. అవకాశంలోనూ సగం కావాలంటూ ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు.
''భారత సంస్కృతిలో మహిళకు పెద్ద పీట వేశారు. అమ్మానాన్న అంటాం.. అందులో అమ్మ శబ్దమే ముందు ఉంటుంది. రాజకీయాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు చాలా రోజులుగా పెండింగ్‌లో ఉంది. 1996లో అప్పటి ప్రధాని దేవెగౌడ హయాంలో బిల్లు పెట్టినా అది ఇంకా చట్టం కాలేదు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉంది. ఈ బిల్లు విషయంలో భాజపా ముందుకొస్తే అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయి. మహిళా రిజర్వేషన్ సాధించేవరకు విశ్రమించేది లేదు'' అని కవిత అన్నారు.
దీక్షకు వివిధ రాజకీయపక్షాల నేతలు మద్దతు తెలిపారు. దీక్షకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, భారాసకు చెందిన మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, వెంకటేశ్ నేత, ఎమ్మెల్యే పద్మాదేవందర్‌రెడ్డితో పాటు పెద్ద ఎత్తున మహిళా నేతలు హాజరై సంఘీభావం తెలిపారుఈ సందర్భంగా సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. మహిళా బిల్లుపై 30 ఏళ్లుగా చర్చ జరుగుతోందని చెప్పారు. మహిళలకు భాగస్వామ్యం లేకపోతే ఎలాంటి వ్యవస్థా మనుగడ సాగించలేదన్నారు. ''ఒకసారి బిల్లు తీసుకొచ్చాం.. కానీ అది సగంలోనే నిలిచిపోయింది. సోమవారం నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు తీసుకురావాలి. పంచాయతీల్లో రిజర్వేషన్ అమలు చేస్తున్నప్పుడు.. చట్ట సభల్లో ఎందుకు అమలులోకి తీసుకు రావడం లేదు? కవిత దీక్ష, ఉద్యమానికి పూర్తి మద్దతుగా నిలుస్తాం'' అని సీతారాం ఏచూరి అన్నారు.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment