Friday, March 3, 2023

తెలంగాణలో....అమిత్ షా.... మే తర్వాత ఇక్కడే మకాం.....!

*తెలంగాణలో  బీజేపీ గెలుపే లక్షంగా....అమిత్ షా చేతికి బాధ్యతలు.... మే తర్వాత ఇక్కడే మకాం.....!*

ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా జాతీయ నేతలు , కేంద్ర మంత్రులు తెలంగాణకు క్యూకట్టనున్నారు.ఈ క్రమంలో పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 12న తెలంగాణకు రానున్నారు. సంగారెడ్డిలో జరగనున్న బీజేపీ మేధావుల సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. అంతేకాదు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలను స్వయంగా తీసుకున్నారు. అలాగే రాష్ట్ర నేతల మధ్య సమన్వయంపై దృష్టి పెట్టారు. ఇకపై రెగ్యులర్‌గా ఎవరో ఒక నేత ఇంట్లో సమావేశం కావాలని పార్టీ నేతలను ఆదేశించారు అమిత్ షా. మరోవైపు చేరికల సమన్వయ బాధ్యతలను రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జి సునీల్ బన్సల్‌కు అప్పగించారు. కర్ణాటక ఎన్నికలు ముగియగానే తెలంగాణలోనే మకాం వేయాలని అమిత్ షా నిర్ణయించారు.అలాగే ఈ నెలలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, ఇతర ముఖ్యనేతలు తెలంగాణకు రానున్నారు. ఏప్రియల్‌లో పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి, ఏప్రియల్‌లో బీజేపీ నేతలు విస్త్రతంగా ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు అమిత్ షా. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి సానుకూల పరిస్ధితులు వున్నా.. ప్రజల్లో కేసీఆర్ సర్కార్‌పై వ్యతిరేకత వున్నప్పటికీ, రాష్ట్ర బీజేపీ నేతలు దానిని పూర్తిగా వాడుకోవడం లేదనే అభిప్రాయం జాతీయ నేతల్లో వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన మినీ కోర్ కమిటీ భేటీలోనూ ఈ విషయంపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment