Thursday, March 23, 2023

ఖమ్మంలో పర్యటించిన సీఎం కేసీఆర్

*ఖమ్మంలో పర్యటించిన సీఎం కేసీఆర్....పంట నష్టపోయిన రైతులకు... ఎకరాకు రూ.10వేలు....!*

ఖమ్మం: సీఎం కేసీఆర్ ఖమ్మంలో పర్యటించారు. బోనకల్‌ మండలంలోని రామపురంలో అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.అనంతంర సమావేశం నిర్వహించి మాట్లాడారు. రైతులు నిరాశకు గురికావొద్దని భరోసా ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేలు ఇస్తామని ప్రకటించారు. కౌలు రైతులను కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కేసీఆర్‌తో పాటు సీపీఎం, సీపీఐ నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రైతుల సమావేశంలో ప్రసింగిస్తూ.. దేశంలో ఇప్పుడు డ్రామా జరుగుతోందని కేంద్రంలోని బీజేపీని టార్గెట్‌ చేస్తూ కేసీఆర్ విమర్శలు గుప్పించారు. కేంద్రానికి చెప్పినా గోడకు చెప్పినా ఒకటే అని ఎద్దేవా చేశారు. దేశంలో వ్యవసాయానికి లాభం చేకూర్చే పాలసీలు లేవని పేర్కొన్నారు. వ్యవసాయం దండగనే మూర్ఖులు ఉన్నట్లు విమర్శలు గుప్పించారు. కేంద్ర బృందం వచ్చి పరిశీలించినా రూపాయి కూడా రాదన్నారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం కానివ్వమని స్పష్టం చేశారు. రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరు నిరాశకు గురికావద్దని సూచించారు.

'కేంద్రానికి రాజకీయాలు తప్పితే రైతుల మీద ప్రేమ లేదు. కేంద్రానికి ఏం చెప్పినా దున్నపోతు మీద వర్షం పడినట్టే. పంట నష్టపరిహారంపై కేంద్రానికి నివేదికలు పంపవలసిన అవసరం లేదు. గతంలో పంపిన పరిహారమే ఇంతవరకు రాలేదు. ఇప్పుడు పంపాల్సిన అవసరమే లేదు.' అని కేసీఆర్ ఫైర్ అయ్యారు.

అనంతరం రామపురం నుంచి మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంట బయల్దేరారు సీఎం. అక్కడ పరిస్థితిని పరిశీలిస్తారు. రైతులకు భరోసా కల్పిస్తారు. తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు ఇస్తారు.

ఆ తర్వాత రెడ్డికుంట నుంచి వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపురానికి, అక్కడి నుంచి కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపురం వెళ్లి పంటల నష్టం వివరాలు తెలుకుంటారు. రైతులతో మాట్లాడతారు. ఈ పర్యటనలో మంత్రులు, శాసనసభ్యులు, అధికార యంత్రాంగం పాల్గొంటారు. కాగా.. ఇటీవల కురిసిన వడగంట్ల వానల కారణంగా నాలుగు జిల్లాల్లోని పంటలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈ ప్రాంతాలను స్వయంగా పరిశీలిస్తున్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment