Saturday, March 4, 2023

ప్రయివేట్ ఫీజు... సెప రేటు, ఇంటర్ కళాశాలల్లో.... సరికొత్త దందా.....!

*ప్రయివేట్ ఫీజు... సెప రేటు, ఇంటర్ కళాశాలల్లో.... సరికొత్త దందా.....!*

*ల్యాబ్‌, అటెండెన్స్‌ పేరుతో అదనంగా వసూళ్లు...!*

హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ పరీక్షలకు ముందు మహానగరం పరిధిలోని కొన్ని ప్రైవేటు కళాశాలలు సరికొత్త దందాకు తెరతీశాయి. వివిధ రకాల ఫీజుల పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ.వేలల్లో అక్రమంగా వసూలు చేస్తున్నాయి. విద్యార్థుల అటెండెన్సు సరిపోవడం లేదంటూ కొన్ని కళాశాలలు భారీ వసూళ్లకు పాల్పడుతుంటే.. మరికొన్ని ల్యాబ్‌ ఫీజు పేరుతో ఇదే దారిలో నడుస్తున్నాయి. ఈ ఫీజులన్నీ చెల్లించకపోతే హాల్‌ టిక్కెట్లు ఇవ్వమంటూ హెచ్చరిస్తున్నాయి. ఈ దోపిడీపై ఫిర్యాదులు అందుతున్నా ఇంటర్మీడియట్‌ బోర్డు కఠిన చర్యలు తీసుకోకపోవడంపై పెద్దఎత్తున విమర్శలు రేగుతున్నాయి.అంతా అక్రమమే.. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో దాదాపు 4.10 లక్షలమంది ఇంటర్‌ విద్యార్థులు మొదటి, రెండో సంవత్సరం పరీక్షలు ఈ నెలలో రాయనున్నారు. వీరిలో ఎక్కువ మంది ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్నారు. ఇదే అదనుగా కొన్ని కాలేజీల యజమాన్యాలు పరీక్ష ఫీజుకు అదనంగా రూ.500 నుంచి రూ.1200 వరకు వసూలు చేశాయి. అంతేగాక ప్రాక్టికల్‌ పరీక్షలకు అదనంగా తీసుకుంటున్నారు. ఉదాహరణకు మాదాపూర్‌ కావూరి హిల్స్‌లో పేరొందిన ప్రైవేటు కాలేజీలో దాదాపు 150 మంది ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్నారు. వారం కిందట సంబంధిత ప్రిన్సిపల్‌ విద్యార్థులందరినీ పిలిచి ల్యాబ్‌ ఫీజు కట్టాలని ఆదేశించారు. కొందరు తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో విద్యార్థుల వల్ల ల్యాబ్‌లో కొన్ని పరికరాలు పగిలిపోయాయంటూ ఆరోపించి, ల్యాబ్‌ డ్యామేజీ ఫీజు కింద ఒక్కో విద్యార్థి రూ.800 చొప్పున కట్టాలని హుకుం జారీ చేశారు. ఇలా మొత్తం రూ.1.20 లక్షలు వసూలు చేశారు. కొండాపూర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కూకట్‌పల్లి ప్రాంతాల్లోని కొన్ని కాలేజీలు కూడా సరికొత్త రీతిలో వసూళ్లకు పాల్పడుతున్నాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. సాధారణంగా 75 శాతం, ఆపైన హాజరు ఉంటే పరీక్ష రాయడానికి విద్యార్థులు అర్హులు. కానీ కొన్ని కాలేజీ యజమాన్యాలు విద్యార్థుల హాజరును తక్కువ చూపిస్తూ..ఒక్కొక్కరి నుంచి రూ.2 వేలు అదనంగా వసూలు చేస్తున్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️

No comments:

Post a Comment