*పండగ వేళ విషాదం...ఆలయంలో మెట్ల బావిలో పడి 8 మంది మృతి....!*
ఇందౌర్: మధ్యప్రదేశ్ లో శ్రీ రామనవమి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఓ ఆలయంలో మెట్లబావి పైకప్పు కూలి..అందులో భక్తులు పడిపోయారు. ఇందౌర్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు.
పటేల్ నగర్ ప్రాంతంలోని మహదేవ్ జులేలాల్ ఆలయంలో రామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. స్థలాభావం కారణంగా కొందరు ఆలయ ప్రాంగణంలో ఉన్న మెట్లబావి (well) పైనున్న ఫ్లోరింగ్‌పై కూర్చున్నారు. అయితే, బరువు ఆపలేక ఆ ప్రాంతం ఒక్కసారిగా కుంగిపోయి ఫ్లోరింగ్ కూలిపోయింది. దీంతో దాదాపు 30 మంది భక్తులు అందులో పడిపోయారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. నిచ్చెన సాయంతో కొందరు భక్తులను బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు ఇందౌర్ పోలీసులు వెల్లడించారు. మరో 17 మందిని రక్షించారు. వారికి గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బావి లోతు 50 అడుగుల పైనే ఉన్నట్లు తెలుస్తోంది.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment