Tuesday, March 21, 2023

శంషాబాద్ విమానాశ్రయానికి 15 వసంతాలు....!

*శంషాబాద్ విమానాశ్రయానికి 15 వసంతాలు....!*

*ఏటా 2.15 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు*

హైదరాబాద్‌,  శంషాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం పదిహేను వసంతాలు పూర్తి చేసుకుంది.మార్చి 23, 2008న ప్రారంభమైన ఈ విమానాశ్రయం అంచెలంచెలుగా ఎదిగింది. దక్షిణ భారతదేశానికి కేంద్రంగా మారింది. తొలుత దీన్ని ఏటా 1.2 కోట్ల మంది ప్రయాణికుల అవసరాల కోసం రూపొందించారు. ఐదున్నరేళ్లకే రద్దీ పెరిగింది. పదిహేనేళ్లకు దాదాపు రెట్టింపు ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తుండటంతో ఏటా 3.4 కోట్ల మంది రాకపోకలకు అనుగుణంగా విస్తరిస్తున్నారు.
*80కి పైగా గమ్యస్థానాలు.. :*
ఇక్కడి నుంచి గతేడాది మే నెలలో గరిష్ఠంగా 17.5 లక్షల మంది రాకపోకలు కొనసాగించగా... ఫిబ్రవరి, 2023లో 18.2 లక్షల మంది ప్రయాణించారు. ప్రస్తుతం 80 కంటే ఎక్కువ దేశీయ, అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమాన సర్వీసులున్నాయి. ఇటీవలే హైదరాబాద్‌-సింగపూర్‌ హైదరాబాద్‌-ఢాకా, బాగ్దాద్‌, డాన్‌ముయాంగ్‌ విమానాశ్రయం, న్యూ గోవాకు నేరుగా సర్వీసులు ప్రారంభించారు.

*ఈ-బోర్డింగ్‌తో గుర్తింపు:*
:అత్యాధునిక సమాచార సాంకేతికతతో ఈ-బోర్డింగ్‌ సౌకర్యాన్ని దేశంలోనే తొలిసారిగా ఇక్కడ ప్రవేశపెట్టారు. వందశాతం స్టాంపింగ్‌ రహిత ప్రయాణాన్ని అందిస్తోంది. చేతి సంచులతో మాత్రమే ప్రయాణించేవారి కోసం ప్రత్యేకంగా ఎక్స్‌ప్రెస్‌ సెక్యూరిటీ చెక్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. 2019 నుంచి దేశంలోనే తొలిసారిగా ముఖ గుర్తింపు(ఫేషియల్‌రికగ్నిషన్‌)ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

*తొలి గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం..*విమానాల రాకపోకల సమయంలో గ్రౌండ్‌ సర్వీస్‌ ఎక్విప్‌మెంట్‌(జీఎస్‌ఈ) వాహనాలు చుట్టూ తిరిగి వెళ్లకుండా సొరంగాన్ని నిర్మించారు. తద్వారా ఏటా ఏడు వేల టన్నుల కర్బన ఉద్గారాలు వాతావరణంలోకి వెళ్లకుండా నియంత్రిస్తున్నారు. మూడేళ్ల నుంచి విమానాశ్రయంలో 'సింగిల్‌ యూజ్‌' ప్లాస్టిక్‌ వాడకుండా చర్యలు చేపట్టారు. 10 మెగావాట్ల సౌరవిద్యుత్తును ఉపయోగిస్తున్నారు. 'నేషనల్‌ ఎనర్జీ లీడర్‌', 'ఎక్సలెంట్‌ ఎనర్జీ ఎఫిషియెంట్‌ యూనిట్‌' వంటి పలు అవార్డులు లభించాయి.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment