కళాశాలలో కుప్ప కూలిన విద్యార్థి!
*గుండె పోటు కారణమని వైద్యుల వెల్లడి ....!*
మేడ్చల్: గుండెపోటుతో టీనేజీ యువకులు కూడా చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల జిమ్ చేస్తూ కానిస్టేబుల్, వివాహ వేడుకలో నృత్యం చేస్తూ యువకుడు గుండె పోటుతో కుప్పకూలిన ఘటనలు మరువక ముందే..తాజాగా బీటెక్ విద్యార్థి ఒకరు గుండె పోటుతో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధి కండ్లకోయ సీఎంఆర్ ఈసీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్న సచిన్ (18) అనే విద్యార్థి రోజు మాదిరిగానే కళాశాలకు వచ్చాడు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తరగతులకు హాజరయ్యాడు. 3గంటల సమయంలో కళాశాల వరండాలో నడుచుకుంటూ వెళ్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు.
తోటి విద్యార్థులు గమనించి.. వెంటనే సీఎంఆర్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సచిన్ మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. విద్యార్థి కుటుంబం వృత్తిరీత్యా రాజస్థాన్ నుంచి వచ్చి హైదరాబాద్ సుచిత్రలో నివాసం ఉంటున్నారు. విద్యార్థి మృతదేహాన్ని కళాశాల యాజమాన్యం కుటుంబ సభ్యులకు అప్పగించింది.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment