Tuesday, July 26, 2022

అపోలో, బసవ తారకం కేన్సర్ ఆసుపత్రుల్లో.... ఫ్రీ వైద్యం..... అందించాల్సిందే.....టీ సర్కార్

*అపోలో,  బసవ తారకం కేన్సర్ ఆసుపత్రుల్లో.... ఫ్రీ వైద్యం..... అందించాల్సిందే.....టీ సర్కార్*

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని అపోలో, బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రులు.. ఉచిత ఇన్‌ పేషంట్, ఔట్‌ పేషంట్‌ సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవోలో పేర్కొంది.దీనిపై డీఎంహెచ్‌ఓ పర్యవేక్షణ ఉంటుందని వివరించింది. ఈ మేరకు తాజా జీవో ప్రతిని మంగళవారం తెలంగాణ హైకోర్టుకు సమర్పించింది.

రాష్ట్ర సర్కార్‌ నుంచి తక్కువ ధరలకు భూమి తీసుకున్న టైంలో.. జరిగిన ఎంవోయూల మేరకు ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఆస్పత్రులు పేదలకు ఉచిత వైద్యం అందజేయాలని, కనీసం కరోనా కష్టకాలంలోనైనా దీన్ని అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఓమిమ్‌ మానెక్షా డెబారా, తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ సూరేపల్లి నందా ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది.ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు. 'ఎంఓయూల ప్రకారం రెండు ఆస్పత్రులు పేదలకు ఉచితంగా పడకలను కేటాయించి వైద్యం చేయకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్‌ కింద జిల్లా కలెక్టర్‌ చర్యలు తీసుకుంటారు. జరిమానా విధింపు అవకాశం కూడా ఉంది. అపోలోకు భూమి ఇచ్చినప్పుడు 15% బెడ్స్‌ పేదలకు ఉచిత కేటాయించేలా ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం మేరకు 1981లో జీవో 517 జారీ అయ్యింది.

ఇక బసవతారకం ఆస్పత్రికి 7.35 ఎకరాలను 1989లో ప్రభుత్వం ఏడాదికి రూ.50 వేలకు లీజుకు ఇచ్చినందుకు గాను 25% పడకలు, రోజూ 40% ఔట్‌పేషంట్లకు ఉచిత వైద్యం చేసేలా 1989లో జీవో 437 జారీ అయ్యింది. ఇవి అమలు చేసే విధానాన్ని వివరిస్తూ ఈ నెల 16న రాష్ట్ర సర్కార్‌ మరో జీవో 80 జారీ చేసింది'అని ఏజీ వివరించారు. అనంతరం విచారణను ఆగస్టు 8న వాయిదా వేసింది.

*జీవో 80లోని ముఖ్యాంశాలు....*
♦ అపోలో, నందమూరి బసవతారకం మెమోరియల్‌ కేన్సర్‌ ఆస్పత్రులు వరుసగా 15%, 25% పడకలను పేదల కోసం కేటాయించాలి.
♦ ఇది దాతృత్వం కాదు.. ఇది వారి కర్తవ్యం.
♦ ఎందుకంటే హైదరాబాద్‌ నగరంలో అత్యంత విలువైన భూములను ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం ఈ ఆస్పత్రుల ఏర్పాటు కోసం తక్కువ ధరకు ఇచ్చింది.
♦ ప్రధాన మంత్రి జీవన్‌ ఆరోగ్య యోజన, ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందించాలి.
♦ బసవతారకం ఆస్పత్రి 40% పేదలకు తప్పకుండా ఓపీ సేవలు ఉచితంగా అందించాలి.
♦ ఇవన్నీ సరిగా అమలవుతున్నాయా.. లేదా.. అన్నది డీఎంహెచ్‌ఓ అప్పుడప్పుడు పరిశీలించి ధ్రువీకరించాలి.
♦ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆహార భద్రత కార్డుదారులు ఉచిత ఓపీకి అర్హులు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

No comments:

Post a Comment