Thursday, July 28, 2022

1946లో ఆవిష్కరించిన త్రివర్ణ పతాకం ప్రదర్శన!

1946లో ఆవిష్కరించిన త్రివర్ణ పతాకం ప్రదర్శన!*

పుణె: పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ 1946 నవంబరులో ఆవిష్కరించిన ఖద్దరు త్రివర్ణ పతాకను అమృతోత్సవంలో భాగంగా మహారాష్ట్రలో ప్రదర్శించారు.పుణె సమీపం పిప్రి చించ్వాడ్‌లోని ఒక కళాశాలలో ఈ నెల 24 నుంచి 26 వరకు ఈ జెండాను ప్రదర్శనకు ఉంచగా.. దాదాపు 5 వేల మంది వీక్షించారు. వీరిలో విద్యార్థులే అధిక సంఖ్యలో ఉండటం విశేషం. సుభాష్‌ చంద్ర బోస్‌ నాయకత్వంలో బ్రిటిష్‌ వారిపై పోరాడిన భారత జాతీయ సైన్యం (ఐఎన్‌ఏ) మూడో డివిజన్‌కు నాయకత్వం వహించిన మేజర్‌ జనరల్‌ గణపత్‌ రామ్‌ నాగర్‌ కుటుంబం వద్ద ఈ జెండా ఇంతకాలం పదిలంగా ఉంది.

స్వాతంత్య్రానికి పూర్వం 1946 నవంబరు 24న మేరఠ్‌లోని విక్టోరియా పార్కులో జరిగిన కాంగ్రెస్‌ మహాసభలో ఈ జెండాను ఆవిష్కరించారు. ఆ సభా నిర్వహణ బాధ్యతను తన తాతగారైన మేజర్‌ జనరల్‌ నాగర్‌కు అప్పగించారని మేరఠ్‌లోని ఓ కళాశాల ప్రిన్సిపల్‌గా పని చేస్తున్న దేవ్‌ నాగర్‌ వివరించారు. మహాసభ చివరి రోజున పతాకాన్ని అవనతం చేసిన నెహ్రూ, ఐఎన్‌ఏ జనరల్‌ షానవాజ్‌ ఖాన్‌లు ఆ జెండాపై సంతకాలు చేసి తాతగారికి అప్పగించారని చెప్పారు. మధ్యలో రాట్నం గుర్తుతో ఉన్న ఈ మువ్వన్నెల జెండా కిందనే స్వాతంత్య్రం కోసం పోరాడామని తెలిపారు.

స్వతంత్ర భారతానికి ఇదే జాతీయ పతాక అవుతుందని నెహ్రూ పేర్కొన్నారని గుర్తు చేసుకున్నారు. స్వాతంత్య్రం అనంతరం త్రివర్ణ పతాకలోని రాట్నం బదులు అశోక చక్రాన్ని ముద్రించారు. మధ్యలో రాట్నం గుర్తు ఉన్న పాత త్రివర్ణ పతాకను ఇంతకుముందు సుభాష్‌ చంద్ర బోస్‌ 125వ జయంతి నాడు, బంగ్లాదేశ్‌ యుద్ధం ముగిసి 50 ఏళ్లయిన సందర్భంలోనూ ప్రదర్శించారు. ఆజాదీ కా అమృతోత్సవ్‌ సందర్భంగా మళ్లీ ప్రజల ముందుకు తెచ్చారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

No comments:

Post a Comment