Wednesday, July 6, 2022

మూసీ ఆక్రమణలు.... దాదాపు 9వేలు

*మూసీ ఆక్రమణలు.... దాదాపు 9వేలు*

*జియాగూడ, ముసారాంబాగ్‌, గోల్నాకలో కబ్జాలు*

*నది ప్రవాహ మార్గంలో కుప్పలుగా పోసిన నిర్మాణ వ్యర్థాలు*
ముందు భూమి ఖాళీ ఉందో లేదో చూసుకుంటారు.. గుట్టుచప్పుడు కాకుండా భవన నిర్మాణ వ్యర్థాలు, మట్టి కుప్పలతో నింపేసి చదును చేస్తారు. ఇక అసలు కథ మొదలవుతుంది. రాత్రికిరాత్రే రేకుల షెడ్డు వెలుస్తుంది. ఎవరూ పట్టించుకోకపోతే అదను చూసి శాశ్వత నిర్మాణాలు మొదలెడతారు. నగరంలో మూసీ నది వెంట భూముల్ని ఆక్రమించేందుకు కబ్జాదారుల పంథా ఇది. జియాగూడ, గోల్నాక, మూసారాంబాగ్‌ తదితర ప్రాంతాల్లో ఈనాడు పరిశీలనలో వందల సంఖ్యలో ఆక్రమణలు కనిపించాయి.
*ఎఫ్‌టీఎల్‌లోకి చొచ్చుకెళ్లి.....*
నిబంధనల ప్రకారం మూసీ నది ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలో ఎలాంటి నిర్మాణాలకు వీల్లేదు. వాస్తవ పరిస్థితి ఇందుకు పూర్తిగా విరుద్ధం. ముసారాంబాగ్‌, గోల్నాక, జియాగూడ రింగురోడ్డుకు ఆనుకుని ఉన్న మూసీ ప్రవాహ మార్గంలోకి చొచ్చుకెళ్లి కొందరు ఆక్రమిస్తున్నారు. నదీ గర్భంలో ప్రవాహానికి ఆటంకం కలిగేలా కనీసం 30 అడుగుల పొడవు.. 20 అడుగుల ఎత్తులో నిర్మాణ వ్యర్థాల్ని గుట్టలుగా పోస్తున్నారు. ఒకేసారి నిర్మాణాలు చేపడితే అనుమానం వస్తుందన్న ఉద్దేశంతో ముందు ఆ ప్రాంతాన్ని మట్టి కుప్పలతో రోడ్డుకు సమాంతరంగా ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పనులన్నీ రాత్రి సమయంలోనే జరుగుతున్నాయి. జియాగూడ రింగురోడ్డు ప్రాంతంలో ప్రస్తుతం వందల సంఖ్యలో నిర్మాణాలు కనిపిస్తున్నాయి.
*గుర్తించినవి 9 వేలు....*
మూసీ సుందరీకరణ పనుల్లో భాగంగా రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి బఫర్‌ జోన్‌లో 9 వేలకుపైగా ఆక్రమణలున్నట్లు గుర్తించారు. అక్రమ నిర్మాణాలపై స్పందించాలని 4 క్రితం గడువు ఇచ్చారు. దాదాపు 160 మంది మాత్రమే అభ్యంతరాలు వచ్చాయి. ఈ ఆరునెలల వ్యవధిలోనే వందల సంఖ్యలో నిర్మాణాలు వెలిశాయి. నిర్మాణ వ్యర్థాలు, చెత్త ఇష్టారీతిన వేయడంతో నది ప్రవాహ మార్గం కుంచించుకుపోతోంది.

link Media ప్రజల పక్షం🖋️ 

No comments:

Post a Comment