సారు.. వ్యూహం అదేనా..?
విషయం చెబితే సోది.. ప్రత్యర్థిపై విషం కక్కితే రాజకీయవాది.. అందులో ఉన్నదంతా పదవుల వ్యాధి.. ప్రస్తుత రాజకీయాలకు ఈ మూడు ముక్కలు కరెక్ట్ గా యాప్ట్ అవుతాయేమో. ప్రెస్ మీట్లు పెట్టడం సోది చెప్పడం.. ఒకరినొకరు తిట్టుకోవడం.. పదవుల కోసం పాకులాడడం.. అందుకే అంటారు రాజకీయం అందరికీ చేతకాదని. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు మాయ చేయగలగాలి. అప్పుడే నెట్టుకొస్తారు. లేకపోతే అంతే. ప్రస్తుతం సీఎం కేసీఆర్ చేస్తున్నది కూడా అదే. హుజూరాబాద్ లో ఘోర ఓటమి చవిచూశారు. కానీ.. బీజేపీకి గానీ, ఈటలకు గానీ.. ఆ సంతోషాన్ని కొద్దిరోజులు కూడా లేకుండా చేయగలిగారు కేసీఆర్. అసలు హుజూరాబాద్ ఫలితాలు వచ్చాయనే విషయాన్ని కూడా జనానికి గుర్తు లేకుండా చేశారు.
!! తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో !!
ఇన్నేళ్లలో కేసీఆర్ ఎప్పుడైనా.. రెండు రోజులు వరుసగా ప్రెస్ మీట్ పెట్టడం చూశారా..? అది కూడా గతంలో యూటర్న్ తిరిగిన వ్యవసాయ చట్టాల గురించి. ఇది చాలదన్నట్లు బీజేపీపై యుద్ధం చేస్తామని ప్రకటన. వ్యక్తిగత కామెంట్లు.. బీజేపీ నేతలేమో వరి కొనుగోళ్లు అంటుంటే.. కేసీఆరేమో రైతు చట్టాలని అంటున్నారు.. పైగా ఈ హడావుడిలోనే తెరపైకి ఈటల రాజేందర్ పాత కేసులు.. ఇవన్నీ చూస్తుంటే ఏదో తేడాగా అనిపించకుండా ఉండదు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓటమిని.. ఈటల గెలుపుని జనాల్లో సైలెంట్ చేసే ప్లాన్ లో భాగంగానే కేసీఆర్ ప్రెస్ మీట్ల రాజకీయం చేస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు. ఈ వ్యూహంలో ఆయన సక్సెస్ అయ్యారని కూడా చెబుతున్నారు.
ఎందుకంటే.. రెండు రోజులుగా ఎక్కడా హుజూరాబాద్ ప్రస్తావన లేదు. కేసీఆర్ విమర్శలు.. బీజేపీ, కాంగ్రెస్ నేతల కౌంటర్లు.. వీటిపైనే రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రెండే రెండు ప్రెస్ మీట్లతో అంతా గప్ చుప్. కానీ.. ఇది ఎక్కువకాలం వర్కవుట్ అవ్వదని అంటున్నారు విశ్లేషకులు. తెలంగాణ ప్రజల్లో ఎంతో చైతన్యం వచ్చిందని కేసీఆర్ జిమ్మిక్కులకు కాలం చెల్లిందని చెబుతున్నారు. దీనికి కొన్ని ఉదాహరణలను కూడా గుర్తు చేస్తున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన తీరు.. కేసీఆర్ చెప్పిన లాజిక్ లేని రీజన్స్ కొంతమేరకు ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేశాయని విశ్లేషిస్తున్నారు. రెండోసారి గెలిచినా.. జరిగిన అభివృద్ధి ఏమీ లేదని జనం గ్రహించినట్లు చెబుతున్నారు. అందుకే దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ లో వ్యతిరేక పవనాలు వీచాయని గుర్తు చేస్తున్నారు.
మరోవైపు ఈటల లాంటి పోరాట స్ఫూర్తి ఉన్న నాయకులు టీఆర్ఎస్ ను వీడడం.. కేసీఆర్ ది నియంత పాలన అంటూ విమర్శలు చేయడం.. పైగా నీళ్లు, నిధులు, నియామకాల గురించి జనాల్లోకి బలంగా తీసుకెళ్లడంతో కేసీఆర్ పై తీవ్ర వ్యతిరేకత పెరిగిందని అంటున్నారు విశ్లేషకులు. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం హామీలో యూటర్న్.. తర్వాత ఇంటికో ఉద్యోగం అన్నారు.. అదికూడా జరగలేదు. వీటన్నింటినీ జనానికి వివరించడంలో ప్రతిపక్షాలు సఫలం అవుతున్నాయని చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా కేసీఆర్ తీరులో మార్పు రాకుండా మాయ మాటలు చెప్పి పార్టీని నెట్టుకొద్దామనే ధోరణిలో ఉంటే మాత్రం గట్టి దెబ్బే తగులుతుందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికి ప్రెస్ మీట్లతో హుజూరాబాద్ ఇష్యూని సైలెంట్ చేసినా.. రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవని అంటున్నారు విశ్లేషకులు.
No comments:
Post a Comment