Thursday, November 18, 2021

యుద్ధం కాదు కేసీఆర్ పతనం ఆరంభమైంది.... ఈటల ......!

*యుద్ధం కాదు   కేసీఆర్ పతనం  ఆరంభమైంది.... ఈటల ......!*

హైదరాబాద్‌: యుద్ధం కాదు.. కేసీఆర్‌ పతనం ఆరంభమైందని మాజీ మంత్రి, హుజూరాబాద్‌ భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. రైతులు కన్నీళ్లు పెడుతుంటే..నిమ్మకు నీరెత్తినట్టుగా కేసీఆర్‌ ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తోందని ఆరోపించారు. కేసీఆర్‌ అనాలోచిత విధానాల వల్లే రాష్ట్రం అస్తవ్యస్తమైందన్న ఆయన.. అన్నీ తనకే తెలుసునని అహంకారపూరితంగా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడుతూ.. 40 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. కొనుగోలులో జాప్యం వల్ల ధాన్యం రంగు మారుతోందని, వర్షాలకు తడిసి మొలక వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పరిస్థితికి పూర్తి బాధ్యత కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు.
''నాకే అన్నీ తెలుసు.. నేనే అన్నీ చేయగలననే అహంకార ధోరణితో సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారు. కేసీఆర్‌ నిర్వాకం వల్ల తెలంగాణ రైతాంగమంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి కేసీఆరే పూర్తి బాధ్యత వహించాలి. గతంలో విపక్షాలతో చర్చించి సమస్యలు పరిష్కరించే ప్రభుత్వాలు ఉండేవి. రాష్ట్రంలో ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఈ దేశంలో ఏరాష్ట్రం కూడా కొనలేని వరి ధన్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసిందని అసెంబ్లీలో సీఎం గొప్పలు చెప్పారు. కానీ, అప్పుడు కేంద్రమే ధాన్యం కొనుగోలు చేస్తుందని, సహకరిస్తుందని అసెంబ్లీలో ఎక్కడా ప్రస్తావించలేదు. ప్రతి గింజా నేనే కొంటున్నానని సీఎం ఫోజు కొట్టారు. కానీ, ఈరోజు ప్రజలకు అర్థమైంది.. ఈ వడ్లు కొంటున్నది కేసీఆర్‌ కాదని, ధాన్యం, గన్నీ బ్యాగ్‌లు, హమాలీ ఛార్జీలు, ఐకేపీ కేంద్రాల కమీషన్‌, రైసు మిల్లుల ఛార్జీలు, రవాణా ఛార్జీలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం అని స్పష్టమైంది. కేసీఆర్‌ తన కీర్తి కోసం తప్ప ప్రజల కోసం పనిచేయడం లేదు. ఒకసారి వరి వేయొద్దన్నారు, ఒకసారి పత్తి వేయొద్దన్నారు, ఒకసారి సన్న వడ్లు వేయొద్దన్నారు. ఇలా.. ఇష్టమొచ్చినట్టు కేసీఆర్‌ చెబుతున్నారు. బాయిల్డ్‌ రైస్‌ కొనటాన్ని కేంద్రం ఎప్పుడైనా నిలిపివేస్తుందని గతంలో మిల్లర్లు సీఎంకు చెప్పారు. రైతు సంఘాలు, మిల్లర్ల సూచనలు కేసీఆర్‌ పరిగణనలోకి తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాన్ని కేంద్రంపై రుద్దుతున్నారు. కేసీఆర్‌ రైతు బంధు కాదు.. రైతు ద్వేషి. ఒక్క రైతు బంధు ఇచ్చి.. మిగతా ప్రయోజనాలన్నీ ఆపేశారు. హుజూరాబాద్‌ ఎన్నిక కోసం రూ.వేల కోట్లు ఖర్చు పెట్టలేదా? రైతుల కోసం ఆ మాత్రం చేయలేరా? హుజూరాబాద్‌ ఫలితం నుంచి ప్రజల దృష్టి మరల్చాలని ప్రయత్నిస్తున్నారు'' అని ఈటల రాజేందర్‌ ఆరోపించారు.

*link Media ప్రజల పక్షం🖋️*

No comments:

Post a Comment