పోలీసుల దాష్టీకం: గోడ కుర్చీ వేయించి.. మూత్రం తాగించి..
గిరిజన యువకుడిపై పోలీసుల దాష్టీకం
దొంగతనం కేసులో అదుపులోకి తీసుకొని చితకబాదిన వైనం
దెబ్బలకు తాళలేక స్పృహ కోల్పోయిన యువకుడు..
ఇంటికి తీసుకెళ్లాలంటూ కుటుంబసభ్యులకు అర్ధరాత్రి ఫోన్
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు.ఎస్ మండల కేంద్రంలో ఘటన
ఆగ్రహంతో పోలీస్‌స్టేషన్ ముట్టడికి గ్రామస్తుల యత్నం
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు
సూర్యాపేట/ఆత్మకూర్(ఎస్): శీలం రంగయ్య, మరియమ్మ లాకప్‌డెత్ ఘటనలు తీవ్ర సంచలనం రేపాయి. క్షేత్రస్థాయిలోని కొందరు పోలీసుల కర్కశత్వానికి నిలువెత్తు సాక్ష్యాలుగా ఈ ఘటనలు నిలిచాయి. మరియమ్మను గుండె ఆగిపోయేలా కొడతారా అంటూ పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మరుసటి రోజే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చేయని తప్పు ఒప్పుకోవాలంటూ ఓ గిరిజన యువకుడిని పోలీసులు తీవ్రంగా చితకబాదిన ఘటన సూర్యాపేట జిల్లాలో బుధవారం జరిగింది. ఆ యువకుడిని గోడ కుర్చీ వేయించారు.. ఆ యువకుడి మూత్రాన్ని అతడితోనే తాగించి రాక్షసానందం పొందారు. అత్యంత అమానుషంగా ప్రవర్తించిన ఆత్మకూరు(ఎస్) ఠాణా పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గిరిజన యువకుడిపై జరిగిన ఈ దాడి ఇటీవల విడుదలైన జైభీమ్ సినిమాను గుర్తుచేస్తోంది.
దొంగతనం చేశాడంటూ..
గతేడాదిగా ఆత్మకూరు(ఎస్) మండలంలో ఎస్సారెస్పీ కాలువపై రైతులు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ మోటార్లు, వ్యవసాయ పనిముట్లు చోరీకి గురవుతున్నాయి. రామోజీతండా ప్రాథమిక పాఠశాలలోనూ పలుసార్లు దొంగతనాలు జరగగా, పోలీసుల విచారణలో నిందితుల ఆచూకీ తెలియలేదు. ఇటీవల ఏపూరులోని బెల్టుషాపులో చోరీ జరిగింది. సీసీ పుటేజీ ఆధారంగా రామోజీతండాకు చెందిన బానోతు నవీన్‌ను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఈ చోరీల్లో తనతో పాటు మరికొందరు ఉన్నట్లు విచారణలో నవీన్ వెల్లడించాడు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా రామోజీతండాకు చెందిన గుగులోతు వీరశేఖర్‌ను బుధవారం మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకుని మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. రాత్రి 12 గంటల సమయంలో పోలీసులు తండా సర్పంచ్‌కు ఫోన్ చేసి వీరశేఖర్‌ను తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో వీరశేఖర్ సోదరుడు వీరన్న పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సొంతపూచికత్తుపై వీరశేఖర్‌ను తీసుకెళ్లాడు.
ఎస్సై తీసుకురమ్మన్నాడు..
బాధితుడు వీరశేఖర్ గురువారం తెల్లవారుజామున పెద్దగా కేకలు వేశాడు. ఆ తర్వాత నోటి మాట రాకపోవడంతో కుటుంబసభ్యులు స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. గురువారం ఉదయం 7 గంటల సమయంలో ఇద్దరు కానిస్టేబుళ్లు వీరశేఖర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు వచ్చారు. ఇంట్లోకి వెళ్లి బాధితుడి పరిస్థితి గమనించిన కానిస్టేబుళ్లు అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించరు. దీంతో అప్పటికే గుమిగూడి ఉన్న తండావాసులు వారిని చుట్టుముట్టారు. తమకు ఎలాంటి సంబంధం లేదని, ఎస్సై తీసుకురావాలని చెప్పడంతోనే వచ్చామంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెంటనే తండావాసులు వీరశేఖర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఆందోళన చేశారు.
పోలీస్ స్టేషన్ ముట్టడికి యత్నం..
వీరశేఖర్ బంధువులు ఆగ్రహంతో గురువారం ఆత్మకూర్.ఎస్ పోలీస్ స్టేషన్ ముట్టడికి యత్నించారు. నడవలేని స్థితిలో ఉన్న వీరశేఖర్‌ను ట్రాక్టర్‌పై తీసుకొచ్చి ఆందోళన చేశారు. దొంగతనంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా వినకుండా, వీరశేఖర్‌ను రోజంతా గోడకుర్చీ వేయించి కొట్టారని, బాధ్యులైన ఎస్సై, సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా, దొంగతనం కేసులో వీరశేఖర్‌ను పిలిపించి విచారించామని, అతడిని కొట్టలేదని ఎస్సై లింగం చెప్పాడు. వీరశేఖర్‌కు చికిత్స చేయిస్తానంటూ సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే గ్రామస్తులు ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా, బాధితుడికి మెరుగైన చికిత్స అందించడంతో పాటు ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని సూర్యాపేట రూరల్ సీఐ విఠల్‌రెడ్డి సర్దిచెప్పడంతో వారు శాంతించారు.
మూత్రం తాగించి.. నవ్వుకున్నారు: గుగులోతు వీరశేఖర్, బాధితుడు
మిర్చి తోటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లా.. కానిస్టేబుళ్లు వచ్చి తీసుకుపోయారు. ఎస్సై లింగంతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు నన్ను చితకబాదారు. ఆ సమయంలో నా పాయింట్‌లో మూత్రం పడగా.. ఆ మూత్రాన్ని తాగాలని ఎస్సై, కానిస్టేబుళ్లు కాళ్లతో తన్నుతూ చెప్పారు. మూత్రం తాగిస్తూ ఎస్సై, కానిస్టేబుళ్లు నవ్వుకున్నారు. చేయని దొంగతనాన్ని ఒప్పుకొంటే.. వారం పాటు జైలులో ఉండి వెంటనే ఇంటికి వెళ్లిపోవచ్చని కొడుతూ చెప్పారు.
బతిమిలాడినా పంపలేదు: వీరన్న, బాధితుడి సోదరుడు
‘నేను, తమ్ముడు కలసి మిర్చి తోటకు నీళ్లు కడుతున్నం. ముగ్గురు కానిస్టేబుళ్లు వచ్చి మా వాడిని తీసుకెళ్లారు. స్థానిక ఎంపీటీసీ సభ్యుడితో కలసి నేను, మా బావ పోలీసు స్టేషన్‌కు వెళ్లి పోలీసులను బతిమిలాడినా మా తమ్ముడిని ఇంటికి పంపియ్యలేదు. అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసి మా తమ్ముడిని తీసుకుపొమ్మని చెప్పారు. మేం వెళ్లే సరికి మా తమ్ముడు స్పృహలో లేడు.
నా గుండె పగిలింది: గుగులోతు కీరా, బాధితుడి తల్లి
ఎలాంటి తప్పు చేయని నా కొడుకును పోలీసులు చంపేందుకు యత్నించడం బాధగా ఉంది. వీరశేఖర్‌ను కొట్టి గాయపరచడమే కాకుండా మూత్రం తాగించారని చెప్పగానే నా గుండె పగిలిపోయింది. కనికరం లేని పోలీసుల నుంచి నా కొడుకును కాపాడాలి. నా కొడుకును కొట్టిన పోలీసులను వదిలిపెట్టొద్దు.
ఉన్నతాధికారులకు నివేదిస్తాం: ఎస్.మోహన్‌కుమార్, డీఎస్పీ, సూర్యాపేట
గిరిజన యువకుడు గుగులోతు వీరశేఖర్‌ను ఆత్మకూర్.ఎస్ పోలీస్‌స్టేషన్‌లో హింసించారన్న ఘటనపై లోతుగా విచారణ చేస్తున్నాం. ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయి నివేదికను జిల్లా ఎస్పీకి అందజేస్తాం.
No comments:
Post a Comment