Tuesday, November 16, 2021

మానవ హక్కుల వేదిక పత్రికా ప్రకటన *ఆత్మకూర్ పోలీసులను తక్షణమే అరెస్టు చేయాలి*

     మానవ హక్కుల వేదిక పత్రికా ప్రకటన
             సూర్యాపేట,16.11.2021. 

*ఆత్మకూర్ పోలీసులను తక్షణమే అరెస్టు చేయాలి* 

      సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ మండలం రామోజీ  తాండా  గ్రామానికి చెందిన లంబాడా గిరిజన యువకుడు వీర శేఖర్ ను ఆత్మకూర్ (ఎస్) పోలీసులు అక్రమ నిర్బంధంలోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేసిన కేసులో ఈ రోజు మానవ హక్కుల వేదిక నిజనిర్ధారణ బృందం భాదితున్ని మరియు కుటుంబ సభ్యులను సూర్యాపేట లోని ఆసుపత్రిలో కలసి వివరాలు సేకరించింది. మా బృందంలో డాక్టర్ ఎస్ తిరుపతయ్య, బదావత్ రాజు, ఎం హరిందర్, అక్కెనపల్లి వీరస్వామి, ఎన్. సులోచన,  సీ హెచ్ గురువయ్య, టి.హరికృష్ణ, వి.దిలీప్ లు పాల్గొన్నారు. 

     ఈ నెల పదవ తారీఖు ఉదయం పది గంటలకు తమ స్వంత పొలంలో పనిచేసుకుంటున్న రామోజిపేటకి చెందిన, డిగ్రీ చదువుతున్న ఇరవై ఏళ్ల వయస్సు గల వీరశేఖర్ ని ఇద్దరు పోలీసులు కారణం చెప్పకుండా కొంత దూరం బండి పైన, ఆతర్వాత పోలీసు వ్యాన్ లో ఎక్కించుకుని ఆత్మకూర్ (ఎస్) పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళారు. తనను ఎందుకు తీసుకెళ్తున్నారో కూడా చెప్పుమన్నా చెప్పలేదు. పొరుగూరులో ఒక వ్యవసాయ భావి దగ్గర ఉండే విద్యుత్తు వైర్ల దొంగతనం కేసులో నిందితుడైన మరో యువకుడు పోలీసు దెబ్బలకు తట్టుకోలేక దొంగతనంతో సంబంధం లేకపోయినా తనకు తెలిసిన ఇతర చాలా మంది పేర్లను చెప్తూ పోయాడని, ఈ క్రమంలోనే వీరశేఖర్ పేరు వచ్చిందని తరువాత అర్ధం అయ్యింది. 
   వీర శేఖర్ ని అలా తీసుకెళ్లిన పోలీసులు అదేరోజు రాత్రి ఎనిమిదిన్నరకి మొదలు పెట్టి మూడు గంటల పాటు చిత్రహింసలులకు గురి చేశారు. కర్రలతో, బెల్టులతో అరి చేతులు, పాదాలు, పిరుదులపై వాపులు వచ్చేలాగా కొట్టారు. దెబ్బలకు తట్టుకోలేక బట్టల్లో మూత్రం పోసుకుంటే మూత్రాన్ని నోటితో నాకించారు.  పైకి దెబ్బలు కనిపించకుండా గోడ కుర్చీ వేయించారు. కాళ్ళను, చేతులను పట్టుకుని నలుగురు నాలుగు వైపులా లాగారు. చివరకి, స్పృహ కోల్పోయిన తర్వాత స్టేషన్లో చనిపోతే బాగుండదని రామోజిపేట ఉప సర్పంచికి ఫోన్ చేసి, ఇంటికి తీసుకెళ్లండని చెప్పారు. వీరశేఖర్ చావు నుండి బయటపడ్డా, ఈరోజుకీ నడవలేని స్థితిలో ఉన్నాడు. హాస్పిటల్ గదిలో పదడుగుల దూరంలో ఉన్న బాత్రూమ్ కి వెళ్ళటానికి ఆయనకు, ఒకరి మీద దాదాపు ఒరిగిపోయి నడిచినా, పది నిమిషాలు పట్టింది. 
    ఇంత సంచలనమై, సమాజం గగ్గోలు పెట్టిన ఈ కేసులోనూ ఈ రోజు వరకూ పోలీసులపై FIR నమోదు కాలేదు. అసలు బాధితుల నుండి పోలీస్ శాఖకు లిఖిత పూర్వక ఫిర్యాదే అందలేదని చెప్పటానికి, బాధితులను ఫిర్యాదు చేయనీయకుండా పొలీసులు, రాజకీయ నాయకులు కలిసి ఆపుతున్నారు. ఒక మంత్రి స్వయంగా కల్పించుకుని బాధితులను నియంత్రిస్తున్నాడు.
     చట్టబద్దంగా మసులుకోవటం అనేది ఇతరులకే గానీ మాకు వర్తించదని పోలీసు వ్యవస్త అనుకుంటున్నది. మాకు ఏజెంట్లుగా పని చేస్తే చాలు మీరేం చేసినా మిమ్మల్ని మేం కాపాడుకుంటామని ముఖ్యమంత్రి, మంత్రులు పోలీసులకు భరోసా కల్పిస్తున్నారు. దీన్ని ప్రజాస్వామ్యం అనరు. మాఫియా వ్యవహారం అంటారు. 
కాబట్టి పోలీసు శాఖ, పరిపాలకులు ఆ దందాలు ఆపి, ప్రజాస్వామ్యం పట్ల భాద్యతతో పనిచేయాలి.
   తక్షణమే కింది చర్యలు తీసుకోవాలని మేం డిమాండు చేస్తున్నాం.
     1, ప్రభుత్వం వెంటనే ఈ కేసును సిట్టింగ్ జడ్జ్ కి అప్పగించి వారి పర్యవేక్షణ లో దర్యాప్తు (investigate) చేయించాలి. 
2, ఇప్పటికే సంభందిత పోలీసులను సస్పెండ్ చేసి ఉన్నారు కాబట్టి , వాళ్ళు నేరం చేసిన విషయం పోలీసు శాఖకు నిర్ధారణ అయిన విషయమే. దాని ఆధారంగా సూర్యాపేట డిఎస్పి గారు వెంటనే ఈ కేసును సుమోటోగా తీసుకొని పోలీసులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. నిందితులను వెంటనే అరెస్టు చేయాలి.
3, ఈ నేరాల్లో పాల్గొన్న పోలీసులపై అక్రమ నిర్భంద కేసు, హత్య యత్నం కేసులను నమోదు చేయాలి. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక నేరాన్నీ నమోదు చేయాలి.
4, దోషులను వెనకేసుకు వస్తూ, వారిని రక్షించడానికి ప్రయత్నం చేసిన పోలీసు శాఖలోని వారి పైనా, రాజకీయ నాయకుల పైనా సాక్ష్యాలను తారుమారు చేయ ప్రయత్నిస్తున్నందుకు మరియు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలి.
5, బాధితుని చికిత్సకు, పునరావాసానికి అయ్యే ఖర్చులన్నీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం ప్రభుత్వమే భరించాలి. 

   -- *డా. ఎస్ తిరుపతయ్య* 
                ( రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మానవ హక్కుల వేదిక) 

-- *బదావత్ రాజు* 
     (రాష్ట్ర సహాయ కార్యదర్శి) 

--- *ఎన్. హరిందర్* ( ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు) 

--- *ఎ.వీరస్వామి* 
( ప్రధాన కార్యదర్శి, నల్గొండ జిల్లా

No comments:

Post a Comment