హుజురాబాద్ ఉప ఎన్నిక: గులాబీ కోటకు కాషాయ రంగు వేసిన ఈటల రాజేందర్
!! బళ్ళ సతీశ్ బీబీసీ కరస్పాండెంట్ సౌజన్యంతో ట్విట్టర్!!
తెలంగాణలో మరో ప్రతిష్టాత్మక ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ ఓడిపోయింది. మాజీ మంత్రి, ఒకప్పటి టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, తాజా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచారు. దుబ్బాక తరువాత బీజేపీకి ఇది రెండో గెలుపు అయింది.
తెలంగాణ రాష్ట్రానికీ ఉప ఎన్నికలకూ ప్రత్యేక సంబంధం ఉంది. తెలంగాణ ఉద్యమం ఊపందుకుందీ, ఉవ్వెత్తున లేచిందీ ఉప ఎన్నికలతోనే. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎన్నో ఉప ఎన్నికలను ఏరి కోరి తెచ్చి పార్టీ సత్తా చాటారు. ఒకట్రెండు సార్లు దెబ్బతిన్నారు కూడా.
కానీ, తెలంగాణ వచ్చాక జరుగుతోన్న ఉప ఎన్నికలు ప్రత్యేకం. కేసీఆర్ అధికారంలో ఉండగా జరిగే ఎన్నికలు కాబట్టి వాటిపై ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అందునా ఒకప్పుడు ఏ కరీంనగర్ ఉప ఎన్నిక ద్వారా కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించారో, అదే సెగ్మెంట్లో జరిగిన ఉప ఎన్నికలో ఆ పార్టీ ఓడిపోయింది.
నాగార్జున సాగర్, దుబ్బాక ఉప ఎన్నికలు కోరుకుంటే వచ్చినవి కావు. అక్కడ సిట్టింగ్ అభ్యర్థుల మరణం వల్ల వచ్చాయి. ఇక హుజూర్ నగర్ ఎన్నిక ఉత్తమ్ కుమార్ రాజీనామా వల్ల వచ్చింది. వాటిలో హుజూర్ నగర్, నాగార్జున సాగర్ టీఆర్ఎస్ గెలుచుకుంది.
అనూహ్యంగా దుబ్బాక ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. అక్కడ మరణించిన అభ్యర్థి భార్య కాకుండా, బీజేపీ అభ్యర్థి రఘునందన రావు గెలిచారు. ఆ ఎన్నికే బీజేపీకి ఇక్కడ కొత్త ఊపునిచ్చింది.
ఇక హుజూరాబాద్ ఎన్నిక టీఆర్ఎస్ పార్టీ, మరీ ముఖ్యంగా కేసీఆర్ కోరి తెచ్చుకున్నది. ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి తప్పించారు కేసీఆర్.సై అంటే సై అన్న రాజేందర్ ఎమ్మెల్యే పదవి కూడా వదిలేసి బీజేపీలో చేరారు. దీంతో హుజూరాబాద్ ఎన్నిక టీఆర్ఎస్ బీజేపీల మధ్య ఎన్నికలా కాకుండా, ఈటల రాజేందర్, కేసీఆర్ మధ్య ఎన్నికలా సాగింది.
సాధారణ ఎన్నికల్లో చర్చకు వచ్చే అభివృద్ధి, సమస్యల ప్రస్తావన ఈ ఎన్నికల్లో అసలు లేదు. ఇక్కడంతా రాజకీయమే. పదవులిచ్చిన కేసీఆర్ కి రాజేందర్ వెన్నుపోటు పొడిచారని టీఆర్ఎస్ చెప్పుకుంది. రాజేందర్ పార్టీ అయిన బీజేపీ ధరలు పెంచిందంటూ సిలెండర్లు చూపించింది.
బలహీన వర్గానికి చెందిన తనను అన్యాయంగా పార్టీ నుంచి గెంటేశారంటూ తన వాదన చెప్పుకుంటూ సాగారు రాజేందర్.
ఇది రాజేందర్ సొంత బలమా?
ఈ ఎన్నికల్లో మరో ఆసక్తికర అంశం ఏంటంటే, రాజేందర్ ఎక్కడా, బీజేపీ సహజ నినాదాలయిన జై శ్రీరాం, వందేమాతరం, మోదీ నాయకత్వం జిందాబాద్ వంటి నినాదాలు వాడలేదు. కేవలం తనకు అన్యాయం జరిగిందంటూ చెప్పుకుంటూ సాగారు.
రాజీనామా చేసిన వెంటనే రంగంలోకి దిగారు. ప్రజా దీవెన యాత్ర పేరుతో పాదయాత్ర చేశారు. అప్పట్నుంచీ ఏదో రూపంలో ప్రచారం చేస్తూ వచ్చారు. సానుభూతే ప్రధాన అస్త్రంగా, పూర్వ పరిచయాలే బలంగా ఈటల ప్రచారం సాగింది.
ఇక టీఆర్ఎస్ తన అధికార బలాన్ని ఉపయోగించింది. హుజూరాబాద్ లో కనివినీ ఎరిగిన రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది.
''60 ఏళ్ల పాలనలో చూడనన్ని పనులు ఈ ఆరు నెలల్లో అయిపోయాయి'' అని అక్కడి స్థానికులు చెప్పారంటే ప్రభుత్వం హుజూరాబాద్ లో ఏ స్థాయిలో ఖర్చు పెట్టిందో అర్థం చేసుకోవచ్చు. కొత్తగా వచ్చే ఎమ్మెల్యే హుజూరాబాద్ లో చేయడానికి ఏమీ లేదనుకునే పరిస్థితి కనిపించింది.
ఇక మొదట్లో కరీంనగర్ కి చెందిన మంత్రి కమలాకర్ అక్కడ వ్యవహారాలు చూడగా, చివరి దశలో హరీశ్ రావు రంగ ప్రవేశంచేశారు. ఎవరు ఏం చేసినా మెజార్టీ లెక్కలు మారి ఉండొచ్చు, కానీ ఫలితం మారలేదు.
అభివృద్ధి-ఆత్మ గౌరవం అనే రెండు నినాదాల మధ్య ఎన్నికగా అభివర్ణించినా కేసీఆర్ అధికారం, ఈటల ధిక్కారాల మధ్య జరిగిన ఎన్నికగానే దీన్ని పరిశీలకులు చూశారు.
కేసీఆర్ కోరి తెచ్చుకున్న ఎన్నిక
సిట్టింగ్ స్థానం నాగార్జున సాగర్ కాపాడుకోవడం, కాంగ్రెస్ అభ్యర్థి రాజీనామా వల్ల వచ్చిన హుజూర్ నగర్ గెలుచుకోవడం వేరు. అనుకోకుండా సీరియస్‌గా మారిన దుబ్బాకను తృటిలో చేజార్చుకోవడం వేరు.
కానీ, ఏరి కోరి తెచ్చుకున్న హుజూరాబాద్ లో, నిన్నటి వరకూ కుడి భుజం అనుకుని రాత్రికి రాత్రి శత్రువుగా మారిన వ్యక్తిని ఓడించలేకపోవడం వేరు. అది కూడా వేల ఓట్ల తేడాతో.
నిజానికి సమీపంలో అసెంబ్లీ ఎన్నికలు కూడా లేవు. ఒక ఉప ఎన్నిక ఓటమి టీఆర్ఎస్‌కు ఇప్పటికిప్పుడు పెద్ద సమస్య కాదు. నష్టమూ కాదు. కానీ, ఇక్కడ సమస్య గెలిచిన అభ్యర్థే. తాను గెంటేసిన అభ్యర్థే తిరిగి తన ముందు వచ్చి కూర్చునే చిత్రమైన పరిస్థితి ఎదుర్కోబోతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.
రాజేందర్ బీజేపీలో చేరినా, బీజేపీ జాతీయ పార్టీయే అయినా, ఇది రాజేందర్ వ్యక్తిగత విజయం కిందే లెక్క. అలాగే టీఆర్ఎస్ కి ప్రత్యేక అభ్యర్థి ఉన్నా, ఈ పరాజయం ఆ అభ్యర్థిది కాదు. కేసీఆర్ పరాజయం కింద లెక్క. కేసీఆర్ దీన్ని వ్యక్తిగత యుద్ధంగా మార్చారు
‘‘దళిత బంధు అక్కడే ప్రవేశ పెట్టడం, మంత్రులను అక్కడ మొహరించడం, గ్రామ స్థాయి నాయకులు సహా అందర్నీ టీఆర్ఎస్ లో చేర్చే ప్రయత్నం…ఇలా ఆయన ఈటల రాజేందర్‌ను ఓడించడానికి ఇచ్చిన ప్రాధాన్యంతో ఈటల వెర్సస్ కేసీఆర్ అనే స్థాయికి తీసుకువచ్చారు’’ అని సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేశ్ అభిప్రాయపడ్డారు.
దీనిని కేసీఆర్ స్వయంకృతంగా సురేశ్ అభివర్ణించారు.
‘‘కేసీఆర్ ఈ ఎన్నికకు ఇంత హైప్ ఇవ్వకపోయుంటే ఇది రాజేందర్ విజయం, టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ ఓటమి అయ్యుండేది. కానీ, ఎన్నిక ఈ స్థాయికి తేవడానికి కేసీఆరే బాధ్యులు'' అని ఆయన అన్నారు
హుజూరాబాద్‌లో రాత్రికి రాత్రి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఊళ్లను దత్తత తీసుకుంటామని హామీలు ఇచ్చారు. దళితబంధు వంటి అత్యంత భారీ పథకాలు ప్రకటించిన ఊరిలో కూడా ఆ ఫలితం ఓట్ల రూపంలో కనిపించలేదు.
గతంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఈటలపై పోటీ చేసి ఓడిపోయిన వారందర్నీ తిరిగి టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నా ఉపయోగం లేకపోయింది.
ప్రస్తుతం రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ చైర్మన్లిద్దరూ అదే నియోజకవర్గం నుంచి ఉన్నారు. ఎస్సీ కార్పొరేషన్ పదవి తాజాగా ఇచ్చిందే. ఇవేవీ టీఆర్ఎస్‌కు విజయం ఇవ్వలేకపోయాయి.
పోనీ నియోజకవర్గంలో టీఆర్ఎస్‌పై పూర్వం నుంచీ తీవ్రమైన వ్యతిరేకత ఉందా అంటే.. అలాంటిదేమీ లేదని తెలుస్తోంది. వ్యవసాయాధారిత ప్రాంతమైన హుజూరాబాద్‌కు ఎస్సారెస్పీ ద్వారా సుస్థిర నీరు అందింది. అయితే, నీరు ఉన్నా వరి వేయవద్దన్న అలక అయితే అక్కడ కనిపించింది.
దళితబంధు తరహా పథకం మిగతా వారికి లేదా అనే భావన కూడా పెరిగింది. ఆ రెండు మినహా టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుపై తీవ్రమైన వ్యతిరేకత లేదు. కానీ, రాజేందర్ మీద సానుభూతి మాత్రం ఉంది.
ఇక ఆ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ స్థానికుడే అయినా, రాష్ట్ర స్థాయి విద్యార్థి నాయకుడే అయినా ఆ నియోజకవర్గంపై పట్టు తక్కువ. పైగా ఈ ఎన్నికల్లో తెరపై శ్రీనివాస్ కంటే కమలాకర్, తరువాత హరీశ్ రావు లే ఎక్కువ కనిపించారు.
''సాధారణ ఎన్నికలు వేరు, ఉప ఎన్నికలు వేరు. అభివృద్ధి వంటివన్నీ ఉప ఎన్నికల్లో పని చేయవు. ఉప ఎన్నిక ఏ పరిస్థితుల్లో, ఏ అవసరం కోసం వచ్చిందో, దానికి దారి తీసిన పరిస్థితులే ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి. ఆ కారణంగానే ఓట్లు పడతాయి. అభివృద్ధి, ప్రభుత్వాలు చేసిన పనులు వంటివి పరిగణనలోకి రావు'' అన్నారు సురేశ్
No comments:
Post a Comment