Tuesday, June 9, 2020

తెలంగాణ లో ప్రభుత్వభూములు గోల్మాల్

హైదరాబాద్ : 09/06/2020

అక్రమార్కులకు లోపాయికారిగా.. అధికారుల సహకారం
   
జిల్లా రెవెన్యూలో సంరక్షణకులే భక్షకులుగా మారారా..? విలువైన  ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన వారే అన్యాక్రాంతం కావడానికి కారణమవుతున్నారా.. అంటే..?  అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. భూ వివాదాలకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు, దస్ర్తాలను రెవెన్యూ అధికారులే మాయం చేస్తున్నారు. ఆఫీసుల్లో ఉండాల్సిన ఫైళ్లు, డాక్యుమెంట్లు అధికారుల ఇండ్లల్లో దర్శనమిస్తున్నాయి. రిజిస్టర్లు మెయింటెయిన్‌ చేయకుండా అధికారులు మారినప్పుడల్లా పెద్ద డ్రామానే నడుస్తున్నది. ఏసీబీ దాడులు జరిగిన ప్రతీ సారి కీలక ఫైళ్లుఇండ్లలో దొరికినప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇందుకు షేక్‌పేట తహసీల్దార్‌ చింతల సుజాత ఇంట్లో దొరికిన కీలక పత్రాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇప్పటికైనా ఇలాంటి వారిని కట్టడి చేస్తారా.. వత్తాసు పలుకుతారా.? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

హైదరాబాద్  : అవినీతి ఆరోపణల నేపథ్యంలో షేక్‌పేట తహసీల్దార్‌ చింతల సుజాత ఇంట్లో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో షేక్‌పేట మండలంలోని కీలక భూవివాదాలు, ప్రభుత్వ స్థలాలు, ఆస్తులకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెం ట్లు, దస్ర్తాలు దొరకడం గమనార్హం. ఇవన్నీ ఆమె ఇంట్లో ఎందుకున్నాయన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది. అధికారిక ఫైళ్లు, దస్ర్తాలేవైనా ఉంటే కార్యాలయాల్లో మాత్రమే ఉండాలి. ఇంట్లో ఉండటానికి వీలులేదు. కాని కీలక దస్ర్తాలను, ఫైళ్లను మాయంచేసి, భూ వివాదాల్లో సెటిల్‌మెంట్లు చేసుకుని పెద్ద మొత్తంలో లంచాలు పుచ్చుకుని ప్రైవేటు వ్యక్తులకు లోపాయికారిగా సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కీలక ఆధారాలను మాయం చేస్తున్నట్లు తెలుస్తున్నది. విధులు నిర్వహించిన కాలంలో కానీ లేదంటే బదిలీ అయిన తర్వాత ఏమైన విచారణలు ఎదుర్కొంటే దొరికిపోతానేమోనన్న జాగ్రత్తల్లో భాగంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తున్నది.

అంతులేని అలసత్వం..
జిల్లా రెవెన్యూలో భూ వివాదాల పరిష్కారం అటకెక్కుతున్నది. విలువైన ప్రభుత్వ భూములను కాపాడే అంశం క్రమంగా మరుగునపడుతున్నది. రెవెన్యూ అధికారుల అలసత్వం కారణంగా విలువైన స్థలాలు చేజారుతున్నాయి. ఇందుకు కోర్టుల్లో దాఖలు చేసే కౌంటర్లే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. జిల్లాలో మొత్తంగా 1733 కేసులుంటే, ఇప్పటి వరకు 992 వివాదాల్లో కౌంటర్లు దాఖలు చేయకపోవడం గమనార్హం. రాజధాని నగరం కావడం, ప్రభుత్వ భూములు అత్యధికంగా ఉండటంతో ఇక్కడే ఎక్కువగా భూ వివాదాలు, భూ సంబంధ కేసులు ఉన్నట్లుగా ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పుడున్న సమాచారం మేరకు జిల్లాలో 1733 కేసులు పలు కోర్టుల్లో నడుస్తున్నాయి. వీటిలో 646 కేసుల్లో కౌంటర్లు దాఖలు కాగా, 992 కేసుల్లో కౌంటర్లు దాఖలు చేయలేదు. వాస్తవికంగా బాధ్యత గల రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లు, త్వరితగతిన కౌంటర్లు దాఖలుచేసి ఆయా స్థలాలను ప్రభుత్వపరం చేసేందుకు ప్రయత్నించాలి. కాని వీటిని కోర్టుల్లో ఎదుర్కొనే దిశగా అధికారులు అడుగులు వేయడం లేదు. ఈ తంతు వెనుక పెద్ద దందాయే నడుస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి.  

పర్సనల్‌ రిజిస్టర్‌లు ఏవి?
జిల్లా రెవెన్యూలో ఫైళ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా కొనసాగుతున్నది. రికార్డులు, ఫైళ్ల నిర్వహణ అటకెక్కింది. ఏ ఉద్యోగి వద్ద ఎన్ని ఫైళ్లు ఉన్నాయి. కోర్టు కేసులు ఎన్ని, భూవివాదాలకు సంబంధించినవి ఎన్ని అనేది రికార్డు చేసేందుకు ప్రతీ సెక్షన్‌ అసిస్టెంట్‌ పర్సలన్‌ రిజిస్టర్లు నిర్వహించాలి. కాని ఇలా జరుగడం లేదు. సంబంధిత ఉద్యోగి బదిలీ అయితే ఛార్జీలిస్ట్‌ను రూపొందించి ఆయా ఫైళ్లను మరో ఉద్యోగికి అప్పగించి వెళ్లాలి. ఇలాంటి వ్యవహారాలు జిల్లాలో జరుగడం లేదు. అధికారిక ఫైళ్లు, ఆఫీసుకు సంబంధించినవి ఇంటికి పట్టుకెళ్లడానికి వీలులేదు. ఏసీబీ, విజిలెన్స్‌ దాడులు జరిగినప్పుడు కీలక పత్రాలు దొరికినట్లుగా తెలుస్తున్నా ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టిసారించడంలేదు. దీంతో ప్రభుత్వ స్థలాలు క్రమంగా తరిగిపోతున్నాయి. 

గ్రూప్ link Media నమస్తే తెలంగాణ సౌజన్యంతో 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment