Wednesday, June 24, 2020

చెరువులు & మూసీ కాలువ కబ్జాలు

హైదరాబాద్ : 25/06/2020

*చెరువుల ఆక్రమణలపై హైకోర్టు ఆగ్రహం*

ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపముంది

జల వనరులు కలుషితమవుతున్నాయి

హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లో ఏముందో చెప్పాలి

హైదరాబాద్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): చెరువులు, కుంటల ఆక్రమణలపై దాఖలైన బ్యాచ్‌ పిటిషన్ల విచారణ సందర్భంగా ధర్మాసనం ఘాటుగా స్పందించింది. ప్రభుత్వ భూములు సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన శాఖల మధ్య సమన్వయలోపం వల్ల సర్కారు భూములు ఆక్రమణకు గురవుతున్నాయని వ్యాఖ్యానించింది. జలవనరులు కలుషితం కావడం, ఆక్రమణలకు గురవుతుంటే భవిష్యత్తు తరాలకు ఏం మిగులుతుందని ప్రశ్నించింది. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో చెరువుల్లో చేపట్టిన నిర్మాణాలు, నీటి ప్రవాహానికి అడ్డుపడేలా చేపట్టిన నిర్మాణాలకు ఎన్ని నోటీసులు జారీచేశారు?

ఎన్నింటిని కూల్చివేశారు? తదితర వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. అధికారుల నిర్వాకం వల్ల కోర్టుల్లో పెండింగ్‌ కేసులు పెరుగుతున్నాయని, ఇదే తరహా కేసులు వందకు పైగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. ఒక్కో కేసులో ఒక్కో విధంగా అధికారులు చెబుతున్నారని ఎత్తి చూపింది. శాస్ర్తీపురం, టాటానగర్‌ కాలుష్యంపై దాఖలైన వ్యాజ్యాల్లో అవి పారిశ్రామిక వాడలని, క్రమంగా ఇక్కడ ఇళ్ల నిర్మాణం జరిగి కాలనీలు వెలసినట్లు అధికారులు చెప్పారు. పారిశ్రామిక వాడల్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఎలా జారీచేస్తారని కోర్టు నిలదీసింది. పుప్పాలగూడ గ్రామ సర్వే నెం.345లో బ్రాహ్మణకుంట చెరువు ఉందని నీటిపారుదలశాఖ అధికారులు చెబుతుండగా, రెవెన్యూ రికార్డుల ప్రకారం అక్కడ చెరువే లేదని రెవెన్యూ అధికారులు చెప్పడం పట్ల విస్మయం వ్యక్తం చేసింది. నీటి పారుదలశాఖ, రెవెన్యూశాఖ, హెచ్‌ఎండీఏల మధ్య సమన్వయం కొరవడిందని ఆక్షేపించింది. ప్రభుత్వ భూములు రక్షించాల్సిన బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని, వాటిని రక్షించే బాధ్యతలను ప్రభుత్వానికి సమాంతరంగా కోర్టులు స్వీకరించలేవని స్పష్టం చేసింది. అసలు హెచ్‌ఎండీఏ మాస్టర్‌ ప్లాన్‌లో ఏముందో చెప్పాలన్న ధర్మాసనం తదుపరి విచారణను జూలై 15కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. మూసీ ఆక్రమణలు, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా, కుత్బుల్లాపూర్‌ మండలం, సూరారంలోని కట్టమైసమ్మ చెరువు, రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్‌ మండలం, పుప్పాలగూడలోని బ్రాహ్మణ చెరువు ఆక్రమణలపై దాఖలైన వేర్వేరు వ్యాజ్యాలను ధర్మాసనం మరోసారి విచారించింది.

ఈ వ్యాజ్యాల్లో ప్రభుత్వం తరుపున ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ వాదిస్తూ... సూరారం కట్టమైసమ్మ చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో అక్రమ నిర్మాణాలు గుర్తించామని, చర్యలు తీసుకుంటామని తెలిపారు. *ఈ దశలో కల్పించుకున్న సీజే.. 'అక్రమ నిర్మాణాలున్నాయని చెబుతున్న మీరే... చర్యలు తీసుకోడానికి ఎందుకు వెనుకాడుతున్నారు' అని ప్రశ్నించారు*. అక్రమ నిర్మాణాల తొలగింపు చర్యలు మొక్కుబడిగా ఉండరాదని స్పష్టం చేశారు. *చెరువులు, కుంటలు ఆక్రమణలపై పత్రికల్లో వస్తున్న కథనాలకు, అధికారులు చెబుతున్న దానికి పొంతన కుదరడం లేదని వ్యాఖ్యానించారు.*

*ఒకప్పుడు మంచినీటి వనరుగా ఉండే మూసీ మురికి కూపంగా మారిపోయిందని చెప్పారు.మూసీనదిని ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నా అధికారుల్లో సరైన స్పందన లేదని, గూగుల్‌ మ్యాప్‌లు పరిశీలిస్తే మూసీ ఆక్రమణలు సులువుగా గుర్తించే అవకాశం ఉందన్నారు.**

*ప్రజా సంకల్పం మరియు అనుబంధ ప్రజా సంఘాలు ఎప్పటినుంచో చెరువులు & మూసీ కాలువ కబ్జాల మీద పోరాటం చేస్తూనే వున్నాయి అందరికి తెలిసిందే **

ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment