Saturday, September 12, 2026

పాలిటెక్నిక్‌లను ప్రైవేటు పరం చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి_

*ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు విద్యార్థుల ఖాతాల్లోకి డైరెక్టుగా ట్రాన్స్‌ఫర్ అవుతుంది*

*పాలిలిటెక్నిక్ విద్య ప్రైవేటీకరణ జరుగుతుందనే ప్రచారంపై స్పష్టత ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి*

*పాలిటెక్నిక్‌లను ప్రైవేటు పరం చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 12:

విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలు, పాలిటెక్నిక్ విద్యలో తీసుకొచ్చిన మార్పులు, వాటిపై విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు.. వంటి కీలక అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా స్పష్టమైన వివరణ ఇచ్చారు. రాష్ట్ర విద్యా విధానంపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చకు ముఖ్యమంత్రి గారు సుదీర్ఘమైన సమాధానమిచ్చి ఆయా వర్గాల్లో నెలకొన్న అనుమానాలు, అపోహలను నివృతి చేశారు.
పాలిలిటెక్నిక్ విద్య ప్రైవేటీకరణ జరుగుతుందనే ప్రచారంపై స్పష్టత ఇచ్చారు. పాలిటెక్నిక్‌లను ప్రైవేటు పరం చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. విద్యార్థులు ఎవరి చేతుల్లోనో పావులుగా, కీలుబొమ్మలుగా మారొద్దని కోరారు. ముందు యుగం దూతలుగా మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తున్నామని, నిజాయితీగా వివరాలందించిన కాలేజీల రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడతల వారిగా చెల్లిస్తామని చెప్పారు.ప్రజాప్రభుత్వం విద్యా రంగానికి ఎందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందో సభలో వివరించిన ముఖ్యమంత్రి సభ్యులు లేవనెత్తిన అంశాలకు సూటిగా సమాధానమిచ్చారు. 
ముఖ్యంగా పాలిటెక్నిక్ కళాశాలలను విద్యాశాఖ పరిధి నుంచి స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరించారు. ఈ నిర్ణయం విద్యార్థుల భవిష్యత్‌ను దెబ్బతీయడానికి కాదని, వారిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకేనని తెలిపారు.
ఈ విషయంలో ఇప్పటికీ అనుమానాలుంటే సభ్యులు, నిపుణులు ఇచ్చే సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన మార్పులు, చర్యలు చేపట్టి సరిదిద్దుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.

*“విద్య ఒక్కటే మన జీవితాల్లో వెలుగును తీసుకొస్తుంది” అనే సంపూర్ణ విశ్వాసంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.*

సామాజిక వెనుకబాటుతనానికి ఆస్తులు, అంతస్తులు కాకుండా విద్య లేకపోవడమే ప్రధాన కారణమని ప్రభుత్వం నిర్వహించిన సీపెక్ సర్వేలో తేలిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
“తెలంగాణకు నూతన విద్యా విధానాన్ని రూపొందించేందుకు విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశాం. కమిషన్ సమర్పించిన నివేదికను పరిశీలించేందుకు కే కేశవరావు గారి నేతృత్వంలో కమిటీని నియమించాం. సభ్యులు, విద్యా రంగ నిపుణులు ఎవరైనా తమ సూచనలు, సలహాలను కమిటీకి అందిస్తే వాటిని స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
విద్యాశాఖను ముఖ్యమంత్రి స్వయంగా నిర్వహించడం ఆ శాఖకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం.  తాను విద్యాశాఖపై ఒక తపనతో పనిచేస్తున్నా. ముఖ్యమంత్రి హోదాలో విద్యాశాఖను సమీక్షిస్తే మొత్తం వ్యవస్థపై సమగ్ర సమీక్ష జరుగుతుంది.2023-24లో గత ప్రభుత్వం విద్యాశాఖకు రూ.19,093 కోట్లు కేటాయించగా, తమ ప్రభుత్వం 2024-25లో రూ.21,292 కోట్లు కేటాయించాం. 2025-26లో రూ.23,108 కోట్లకు, 2026-27లో రూ.26,647 కోట్లకు పెంచాం.  కేవలం మూడేళ్లలోనే విద్యాశాఖ బడ్జెట్‌ను రూ.7,554 కోట్ల మేర పెంచాం” అని ముఖ్యమంత్రి గారు సభ ముందు వివరించారు.

*“తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే కేవలం 55 రోజుల్లో 10,006 మంది ఉపాధ్యాయుల ఉద్యోగాలను భర్తీ చేశాం.*

ఎలాంటి ఆరోపణలకు తావులేకుండా ఈ నియామక ప్రక్రియను పూర్తి చేశాం. గత ప్రభుత్వం పదేళ్లలో కేవలం 7,857 మంది ఉపాధ్యాయులను మాత్రమే నియమించింది” అని పేర్కొన్నారు.“జెన్ జీ ఒక్కటే కాదు. రానున్న జెన్ ఆల్ఫా, జెన్ బీటా తరాలను దృష్టిలో ఉంచుకుని నూతన విద్యా విధానాన్ని రూపొందిస్తున్నాం. “దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది.. తలరాతలను మార్చేది విద్య” అనే నమ్మకంతోనే విద్యాశాఖను తన వద్ద ఉంచుకున్నా. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా విధానాలను, బెస్ట్ ప్రాక్టీసెస్‌ను తెలంగాణకు తీసుకొచ్చేందుకు, దేశానికి తెలంగాణను ఒక రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాం” అని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలపై పెరుగుతున్న ఆదరణ
“విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 86 వేల మేర పెరిగిందని సీఎం తెలిపారు. ఇది తన పనితీరుకు నిదర్శనమన్నారు.
ప్రైవేటు పాఠశాలల్లో రెండున్నరేళ్లకే పిల్లలను చేర్చుకుంటుండగా, ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఐదేళ్ల వయసు వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. నర్సరీ, ఎల్‌కేజీతో పాటు ఇంగ్లిష్ మీడియం కోసం తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు వెళ్తున్నారు.
అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో తొలిసారిగా ప్రీ-ప్రైమరీ విధానాన్ని ప్రారంభించాం. ఈ ఏడాది 64 వేల మంది విద్యార్థులకు ప్రీ-ప్రైమరీ విద్య అందిస్తున్నాం. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు కూడా మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. సెంట్రలైజ్డ్ కిచెన్ల ద్వారా నాణ్యమైన, పరిశుభ్రమైన బ్రేక్‌ఫాస్ట్, భోజనం అందిస్తున్నాం. విద్యార్థులకు పోషకాహారం అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాం” అని వివరించారు.

**పాలిటెక్నిక్‌లపై అపోహలు వద్దు**

“పాలిటెక్నిక్ కళాశాలలకు సంబంధించిన జీఓ ఎంఎస్ నెం.97పై కొన్ని వివాదాలు తలెత్తాయని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. పాలిటెక్నిక్ కళాశాలలను ప్రైవేటు పరం చేస్తారనే ప్రచారాన్ని తోసిపుచ్చారు. “పాలిటెక్నిక్ కళాశాలల ప్రైవేటీకరణ అనే ప్రసక్తే లేదు” అని సభలో స్పష్టం చేశారు.ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలు ఇకపై కూడా ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగుతాయి.  కేవలం సాంకేతిక విద్యా వ్యవస్థను స్కిల్స్ యూనివర్సిటీ పరిధితో అనుసంధానం చేస్తున్నాం.
ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి టాటా సంస్థ సహకారంతో నైపుణ్య శిక్షణ అందిస్తున్నాం. అంతమాత్రాన ఐటీఐలను ప్రైవేటు పరం చేసినట్లు కాదు. ఏటీసీల్లో చదివే విద్యార్థులకు నెలకు రూ.2 వేల స్కాలర్‌షిప్ అందించాలని నిర్ణయించాం” అని చెప్పారు.పాలిటెక్నిక్‌ల విషయంలో భూములు అమ్ముకుంటారని, ఉద్యోగాలు పోతాయని కొందరు విద్యార్థుల్లో అపోహలు కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి ప్రభుత్వం అదనంగా 282 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏటీసీలకు బదలాయించిందని, ఒక్కో ఏటీసీపై సుమారు రూ.46 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.

**పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా... **

సాంకేతిక విద్యను పరిశ్రమల అవసరాలకు అనుసంధానించడమే పాలిటెక్నిక్‌లను స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడం వెనుక ప్రధాన ఉద్దేశమని ముఖ్యమంత్రి గారు వివరించారు. రాష్ట్రంలోని 59 పాలిటెక్నిక్ లను టాటా టెక్నాలజీ సంస్థ సహకారంతో రూ. 4 వేల కోట్లతో ఆధునీకరిస్తున్నట్టు తెలిపారు.
విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, అప్రెంటిస్‌షిప్‌లు, ప్రాక్టికల్ ట్రైనింగ్ అవకాశాలను పెంచడమే లక్ష్యమన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలకు అనుగుణంగా టాటా టెక్నాలజీస్ సంస్థ సహకారంతో కోర్సులను ఆధునీకరిస్తామని చెప్పారు.
సాంకేతిక విద్య–నైపుణ్యాభివృద్ధి విభాగాల అనుసంధానంతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో మౌలిక వసతులు, ల్యాబ్‌లు, అధ్యాపకుల నైపుణ్యాభివృద్ధిని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. విద్యార్థుల్లో నెలకొన్న అపోహలను తొలగిస్తామని, జీఓలో సవరణలు అవసరమైతే వాటిని కూడా చేస్తామని హామీ ఇచ్చారు. స్కిల్స్ యూనివర్సిటీకి ఏఐసీటీఈ అనుమతి తీసుకొస్తామని స్పష్టం చేశారు.
పేద విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వబోమని అన్నారు. వారి భవిష్యత్తును మెరుగుపరచాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థుల్లో అపోహలు సృష్టించే ప్రయత్నాలను అడ్డుకోవాలని సభ్యులను కోరారు.

**ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లెక్కలు...**

ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపైనా ముఖ్యమంత్రి సభలో స్పష్టత ఇచ్చారు. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.5,435 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వదిలివెళ్లిందని తెలిపారు. అందులో గత ప్రభుత్వం పెట్టిన బకాయిల నుంచి రూ.1,410 కోట్లు తమ ప్రభుత్వం ఇప్పటికే చెల్లించిందన్నారు.అదేవిధంగా ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రూ.1,465 కోట్లను చెల్లించామని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం చెల్లించిన వాటితో కలిపి మొత్తంగా 32 నెలల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ.3,488 కోట్లు చెల్లించినట్లు సభలో వెల్లడించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు విద్యార్థుల ఖాతాల్లోకి డైరెక్ట్ ట్రాన్స్‌ఫర్ విధానం అమలు చేస్తున్నామన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల కోసం అడ్వాన్స్‌గా గ్రీన్ చానెల్‌లో డబ్బు చెల్లిస్తున్నామని చెప్పారు. బకాయిల విషయంలో విజిలెన్స్ నివేదికను పరిశీలించిన తర్వాత నిజాయితీగా ఉన్న వాటన్నింటినీ బకాయిలు చెల్లిస్తామని స్పష్టం చేశారు.విద్యను కేవలం ఒక శాఖగా కాకుండా రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే సాధనంగా భావిస్తున్నామని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి  విద్య, నైపుణ్యం, ఉద్యోగం, ఉపాధిని అనుసంధానించేలా సంస్కరణలు చేపట్టామని తెలిపారు

కుల ఆధారిత దూషణలు, మహిళా పోలీసు సిబ్బంది పట్ల అనుచిత ప్రవర్తనపై తెలంగాణ డీజీపీకి సమగ్ర నివేదికలు సమర్పించాలని TGHRC ఆదేశం_

*ప్రెస్ రిలీజ్*

*తెలంగాణ మానవ హక్కుల కమిషన్*

*కుల ఆధారిత దూషణలు, మహిళా పోలీసు సిబ్బంది పట్ల అనుచిత ప్రవర్తనపై తెలంగాణ డీజీపీకి సమగ్ర నివేదికలు సమర్పించాలని TGHRC ఆదేశం*

బాపట్ల కృష్ణమోహన్, సెప్టెంబర్ 11:

తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) గౌరవ చైర్‌పర్సన్ డా. జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో, 07.09.2026న జరిగినట్లు ఆరోపించబడిన రెండు సంఘటనలకు సంబంధించి దాఖలైన ఫిర్యాదులపై ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు ఫిర్యాదులపై తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్ నివేదికలు సమర్పించాలని ఆదేశించింది.
S.R. No.3678 of 2026లో జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిళ్లి సుధాకర్ మరియు ఇతరులు చేసిన ఫిర్యాదులో, BRS MLC తాటా మధుసూదన్, దళిత సామాజిక వర్గానికి చెందిన తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ను మీడియా సమక్షంలో అసభ్య పదజాలంతో దూషించినట్లు ఆరోపించారు. అలాగే, దళితులు మాజీ ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావుకు చెందిన ఎర్రవెల్లి, సిద్ధిపేట జిల్లా ఫామ్‌హౌస్‌ ఎదుట నిరసన నిర్వహించిన సమయంలో, BRS నాయకురాలిగా పేర్కొన్న శ్రీమతి పావని గౌడ్ మరియు ఇతరులు పసుపు నీరు, పాలు చల్లి ప్రాంతాన్ని “శుద్ధి” చేసినట్లు, దళిత నిరసనకారులను అవమానకర పదజాలంతో దూషించినట్లు ఆరోపించారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు కోరారు.
S.R. No.3680 of 2026లో శ్రీమతి ఇందిరా శోభన్ చేసిన ఫిర్యాదులో, తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో జరిగిన నిరసన కార్యక్రమంలో కొంతమంది BRS ఎమ్మెల్యేలు నల్ల టీ-షర్టులు తొలగించి, శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధుల్లో ఉన్న మహిళా పోలీసు సిబ్బంది సమక్షంలో అర్ధనగ్నంగా నిలబడినట్లు ఆరోపించారు. ఈ ప్రవర్తన మహిళా పోలీసు సిబ్బందికి ఇబ్బంది, మానసిక వేదన, అవమానాన్ని కలిగించడంతో పాటు వారి గౌరవం, భద్రతపై ప్రభావం చూపిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంఘటనపై విచారణ జరిపి, CCTV మరియు ఇతర వీడియో దృశ్యాలను పరిశీలించి, బాధ్యులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారు కోరారు.
రికార్డులో ఉన్న అంశాలను పరిశీలించిన అనంతరం, రెండు కేసుల్లోనూ తెలంగాణ రాష్ట్ర డీజీపీ, హైదరాబాద్ నుంచి నివేదికలు కోరుతూ గౌరవనీయ చైర్‌పర్సన్ ఆదేశాలు జారీ చేశారు. తదుపరి నివేదిక కోసం రెండు కేసులను 09.10.2026కు వాయిదా వేశారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మరికల్ జిల్లా పరిషత్ పాఠశాలలో మట్టి వినాయక విగ్రహాలు తయారు చేసిన విద్యార్థులు_

*పర్యావరణ పరిరక్షణలో భాగంగా మరికల్ జిల్లా పరిషత్ పాఠశాలలో మట్టి వినాయక విగ్రహాలు తయారు చేసిన విద్యార్థులు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 11:

వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల పరిధిలోని మరికల్  గ్రామ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మట్టి వినాయక ప్రతిమలు వివిధ ఆకారాలలో చూడముచ్చటగా తయారు చేశారు.మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయురాలు సర్వమంగళ బహుమతులు అందజేశారు.సీనియర్స్ లో మొదటి బహుమతి వైష్ణవి రెండో బహుమతి నితిన్ జూనియర్స్ లో మొదటి బహుమతి నరేష్ రెండో బహుమతి కార్తీక్ అందుకొన్నారు. గ్రామంలో మన ఇండ్లలో మట్టి వినాయకులను ప్రతిష్టించి భక్తి శ్రద్దలతో పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శైలజ వెంకటయ్య మల్లయ్య శివప్రసాద్ అంజిలయ్య రాజశేఖర్ హన్మయ్య శశిధర్ పాండురంగాచారి శ్రీలక్ష్మి రమాదేవి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 17 న పబ్లిక్ గార్డెన్ లో ఘనంగా ప్రజా పాలనా దినోత్సవం - తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు_

*ఈనెల 17 న పబ్లిక్ గార్డెన్ లో ఘనంగా ప్రజా పాలనా దినోత్సవం - తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 11:

ఈనెల 17 వతేదీన నాంపల్లి లోని పబ్లిక్ గార్డెన్ లో నిర్వహించే  తెలంగాణా ప్రజా పాలన దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు  చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. ప్రజాపాలన దినోత్సవం నిర్వహణా ఏర్పాట్లపై గురువారం డా.బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేష్ రంజన్, వికాస్ రాజ్, అహ్మద్ నదీమ్,  ముఖ్య కార్యదర్శులు  నవీన్ మిట్టల్, క్రిస్టినా చొంగ్తూ, శిఖా గోయల్, హైదాబాద్ సి.పీ సజ్జనార్, ఆర్టీసీ ఎండి నాగి రెడ్డి, సమాచార శాఖ స్పెషల్  కమిషనర్ ముకుంద రెడ్డి తదితర సీనియర్ అధికారులు హాజయ్యారు.ఈ సందర్భంగా సి.ఎస్ మాట్లాడుతూ, ప్రజా పాలనా దినోత్సవాన్ని పబ్లిక్ గార్డెన్ లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 17 న ఉదయం అసెంబ్లీ ఎదురుగా గల అమరవీరుల స్థూపం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి నివాళులు అర్పించిన అనంతరం పబ్లిక్ గార్డెన్ కు వస్తారని తెలిపారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపంవద్ద,  పబ్లిక్ గార్డెన్ లో సంబంధిత అధికారులు తగు ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. నగరంలోని పలు ప్రధాన భవనాలకు , చారిత్రక కట్టడాలకు విద్యుత్ దీపాల అలంకరణ చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణ కు గానూ ఈనెల 15 న  పూర్తి డ్రెస్ రిహార్సల్స్ ను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రజాపాలన దినోత్సవానికి వేయి మంది స్వయం సహాయక మహిళలతో పాటు  రెండు వేల మంది  హాజరవుతారని పేర్కొన్నారు.

సైబరాబాద్‌ పోలీస్‌ అసోసియేషన్‌కు నూతన కార్యవర్గం_

*సైబరాబాద్‌ పోలీస్‌ అసోసియేషన్‌కు నూతన కార్యవర్గం*

*నూతన సభ్యులకు సీపీ డా. రమేష్‌, IPS, అభినందనలు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 11:

సైబరాబాద్‌ పోలీస్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్షుడిగా ఎస్సై శ్రీనివాస్‌ (హెచ్‌సీ–3046), ఉపాధ్యక్షుడిగా ఇన్‌స్పెక్టర్‌ శ్రీకర్‌బాబు (19435) ఎన్నికయ్యారు. ఎస్సై/ఏఎస్సై కేటగిరీలో ప్రియదర్శిని (3251), హెడ్‌ కానిస్టేబుల్‌ కేటగిరీలో కార్తిక్‌ శ్రీనివాస్‌ (3276), పోలీస్‌ కానిస్టేబుల్‌ కేటగిరీలో రాజేందర్‌ (5180) వైస్‌ ప్రెసిడెంట్లుగా ఎన్నికయ్యారు.వివిధ పదవులకు మొత్తం 29 మంది సభ్యులు ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ డా. రమేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీ వారికి శుభాకాంక్షలు తెలిపారు. అసోసియేషన్‌ ద్వారా సిబ్బంది సంక్షేమం, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

Friday, September 11, 2026

మూసినది అభివృద్ధి పేరుతో వేలకోట్ల దోపిడీ_

https://www.facebook.com/share/p/19CxaEt42o/

*_మూసినది అభివృద్ధి పేరుతో వేలకోట్ల దోపిడీ... ప్రజాప్రయోజనాలకోసం కాదు ఈ అభివృద్ధి...మూసి పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న పేద మధ్యతరగతి కుటుంబాలు జాగృతం కావాలి... అప్పుడు కాళేశ్వరం... ఇప్పుడు మూసినది...Bplkm✍️_*
https://www.instagram.com/p/DdJbLK1qob0/?stkn=dmw0MTI0ZXk0MXdx
                 *****
https://x.com/Praja_Snklpm/status/2098315570903212443?t=vRradfzDt0R2AjdWULDd-A&s=08

*#SaveMusiNadi not #beautification...#publicvoice*

*#hyderabad #pollution #publichealth*

*@TelanganaCMO*
*@Bhatti_Mallu*
*@TelanganaCS @asadowaisi @INC_Ponguleti @Ponnam_INC @KTRBRS @N_RamchanderRao @HRF_Humanrights @bandarvirala @CitizensForHyd @SaveNalas_Tanks @MusiProject @PIBHyderabad @IPRTelangana @Narhariyarabotu @SitaramDhulipa1 @BplplH*

మహిళలు సమాజానికి, భవిష్యత్ తరాలకు నిజమైన స్ఫూర్తి మరియు శక్తి ప్రదాతలు అని నిరూపించిన డా. దీపా బానోత్_

*కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే పీహెచ్డీ సాధించిన దీపా బానోత్*

*మహిళలు సమాజానికి, భవిష్యత్ తరాలకు నిజమైన స్ఫూర్తి మరియు శక్తి ప్రదాతలు అని నిరూపించిన డా. దీపా బానోత్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 10:
 
కాప్రా ECILకూ చెందిన ఉస్మానియా యూనివర్సిటీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ పరిశోధక విద్యార్థిని శ్రీమతి డా. దీపా బానోత్ బిజినెస్ మేనేజ్‌మెంట్ పీహెచ్‌డీ పట్టా సాధించారు. ఇద్దరు పిల్లల తల్లిగా, గృహిణిగా కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే పరిశోధనను విజయవంతంగా పూర్తి చేసి డాక్టరేట్ పొందడం అభినందనీయం. డా.దీపా బానోత్ "తెలంగాణలో ఎంపిక చేసిన ప్రభుత్వ మరియు ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగుల సంతృప్తిపై తులనాత్మక అధ్యయనం (తెలంగాణ రాష్ట్రంలోని ఎంపిక చేసిన పబ్లిక్ మరియు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో ఉద్యోగుల సంతృప్తిపై తులనాత్మక అధ్యయనం)" అనే అంశంపై పరిశోధన జరిగింది. ఉన్నత విద్యా సంస్థల్లో ఉద్యోగుల సంతృప్తికి తగిన సూచనలను కూడా ప్రతిపాదించారు. ఈ పరిశోధనను డా. వి .సమున్నత గారి పర్యవేక్షణలో పూర్తి చేశారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ శ్రీరాములు, డీన్ ప్రొఫెసర్ జహంగీర్, డిపార్ట్‌మెంట్ హెడ్ ప్రొఫెసర్ విద్యాసాగర్ రావు, అధ్యాపకులు, పరిశోధకులు మరియు సిబ్బంది డా. దీపా బానోత్‌ను అభినందించారు. ఇద్దరు పిల్లల తల్లిగా కుటుంబ బాధ్యతలను (పెద్ద కుమారుడు MBBS మరియు చిన్న కుమారుడు ఇంజనీరింగ్) చదువుతున్న సమయంలోనూ కుటుంబ భాద్యతలు చూసుకుంటూ పీహెచ్‌డీ సాధించడం ద్వారా దీపా బానోత్ తన సంకల్పం, పట్టుదల, కృషితో కుటుంబ బాధ్యతలు ఉన్నా ఉన్నత లక్ష్యాలను సాధించినట్లు నిరూపించారు. ఈ సందర్భంగా డా. దీపా బానోత్ తన విజయానికి సహకరించిన తన భర్త శ్రీ రవి తేజకు, కుటుంబ సభ్యులకు మరియు తన పరిశోధన పర్యవేక్షకురాలు డా.వి. సమున్నతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పరిశోధన సమయంలో వారు అందించిన నిరంతర ప్రోత్సాహం, సహకారం తన పీహెచ్డీ ప్రయాణంలో కీలకమని ఆమె పేర్కొన్నారు.ఆమె సాధించిన ఈ విజయం కుటుంబ బాధ్యతలతో పాటు ఉన్నత విద్యను కొనసాగించాలని ఆకాంక్షించే మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.