Saturday, June 24, 2023

షాద్ న‌గ‌ర్‌లో ధ‌ర‌ణి దొంగ‌లు

షాద్ న‌గ‌ర్‌లో ధ‌ర‌ణి దొంగ‌లు

– రికార్డుల్లో పేరొచ్చిందని దోపిడీ
– అధికారుల స‌హకారంతో రూ.వందల కోట్ల భూస్కాములు
– 90 మంది వృద్ధుల ప్లాట్స్ కు టోక‌రా?
– చ‌క్రం తిప్పిన రెవెన్యూ అధికారులు!
– త‌క్కువ‌లో కొని.. ఎక్కువ లాభాలకు అమ్మకం
– త‌న్నుకు చావండి.. మేము సేఫ్ అంటున్న రియ‌ల్ట‌ర్స్
– డీటీసీపీ వ‌ర్సెస్ హెచ్ఎండీఏ లే అవుట్స్ ర‌గ‌డ‌

క్రైంబ్యూరో, తొలివెలుగు:హైద‌రాబాద్ శివార్ల‌లో ఎకరం భూమి ఎక్క‌డ చూసినా రూ.10 కోట్ల‌కు త‌క్కువ లేదు. అలాంటప్పుడు హైద‌రాబాద్-బెంగ‌ళూరు హైవేకి ఆనుకుని వున్న భూమిలో యజమానిగా తాతల పేరు ధరణిలో కనిపిస్తే ఈ త‌రం వాళ్లు ఊరుకుంటారా? ఎలాంటి పొజిష‌న్ లేకున్నా.. తాతలు చ‌నిపోయి ప‌దేళ్లు దాటినా.. ఆ భూమిని కొట్టేసేందుకు చ‌ట్టాల్లోని లొసుగుల‌ను వాడేస్తున్నారు. హెచ్‌ఎండీఏ అనుమ‌తులు అంటూ ఎల్పీ నెంబ‌ర్‌ తో అమ్మేసుకుని కోట్లు గ‌డిస్తూ ప‌రార్ అవుతున్నారు. ఇలా గ్రామ పంచాయతీ, డీటీసీపీ లే అవుట్స్ చేసి అమ్మిన ప్లాట్స్ కు ఇంకా రైతుబంధు తింటూ లిటిగేష‌న్ సృష్టిస్తున్నారు. దీనికి చక్కటి ఉదాహరణే షాద్ న‌గ‌ర్ ఫారుఖ్ న‌గ‌ర్ లోని 8 ఎక‌రాల లే అవుట్.

dharani thieves in shadhnagar

జరిగింది ఇదే..!

హైద‌రాబాద్-బెంగుళూరు హైవేకి ఆనుకుని ఉన్న కొత్తూరు శివారులోని తిమ్మాపూర్ స‌ర్వే నెంబ‌ర్ 97, 98లోని 10 ఎక‌రాల భూమి. దాన్ని అన్నీ లీగ‌ల్ గా చూసుకుని 6 ఎక‌రాలు డీటీసీపీ లే అవుట్ తో ప్లాట్స్ అమ్మ‌కాలను జ‌రిపాయి జ‌న‌ సాయి హౌసింగ్, సుప్ర‌జ హౌసింగ్. ఇందులోని రోడ్లు, పార్క్ ప్లేస్ అంతా తిమ్మాపూర్ గ్రామ పంచాయతీకి గిఫ్ట్ డీడ్ చేశారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, 2019 తర్వాత అసలు కథ మొదలైంది. త‌హసీల్దార్ ఆఫీస్‌ లో ప‌నిచేసే భాను, రిటైర్డ్ ఎమ్మార్వో వెంక‌ట్ రెడ్డి క‌లిసి ఆ భూమికి పట్టా పాసు బుక్ ఇచ్చి వివాదం సృష్టించారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఐపీఎస్‌ లు, ఓ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, పలువురు ప్రముఖులు ప్లాట్స్ తీసుకున్నారంటే ఆ భూమి విలువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి లే అవుట్‌ లోని భూమిలో ధరణి వచ్చాక మళ్లీ మార్పులు చోటు చేసుకున్నాయని అంటున్నారు ప్లాట్స్ కొన్నవారు. 2009లో మరణించిన కొండ అంజయ్య(గతంలో భూ యజమాని) పేరు ఇటీవల మళ్లీ తెరపైకి వచ్చింది. 2018 ఫిబ్ర‌వ‌రి 15న కొండయ్య వారసులు డెత్ సర్టిఫికేట్ సమర్పించి ఆయ‌న భార్య రాధమ్మ పేరు మీద 2019లో పాస్ బుక్స్ తీసుకున్నారు. ఆ త‌ర్వాత వెంట‌వెంట‌నే బొల్లినేని శ్రీవ‌ల్లి, ప‌త్తిపాటి శ్రీధ‌ర్ పేర్ల మీదకి ఆ భూమి వచ్చేసింది. సంజీవ‌ని పేరుతో క‌ల‌ర్ ఫుల్ బ్రౌచ‌ర్స్ వేయించి ఓపెన్ స్పేస్ అంతా అమ్మ‌కాలు జ‌రిపారు. రీ లే అవుట్ చేసి మూడు నెలల్లోనే రూ.25 కోట్లు దండుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

డీటీసీపీ వ‌ర్సెస్ హెచ్ఎండీఏ!

2005 నాటికి అమలులో ఉన్న చ‌ట్టానికి అనుకూలంగా లే అవుట్‌ తో ఉన్న భూమికి హెచ్ఎండీఏ మ‌ళ్లీ అనుమ‌తులు ఇవ్వ‌డంతో వివాదం మొదలైనట్టు తెలుస్తోంది. వృద్ధులైన ప్లాట్ ఓన‌ర్స్ న‌గ‌రంలోనే ఉండేవారు. దీంతో ఇష్టానుసారంగా సంజీవ‌ని ప్రాజెక్ట్స్ ఆ ప్లాట్స్ ను అమ్ముకున్నారని ఆరోపణలు వున్నాయి. రెండేళ్ల త‌ర్వాత ఇప్పుడిప్పుడే ప్లాట్ ఓన‌ర్స్ వెళ్లి చూడగా.. డీటీసీపీ లే అవుట్ ప్లాట్స్ ను భూ మాఫియా మింగేసిందని వాపోతున్నారు. హుటాహుటిన కోర్టుకు వెళ్లి అక్ర‌మ పాస్ బుక్స్ ను స‌స్పెండ్ చేయించారు. హెచ్ఎండీఏలో ఫిర్యాదు కూడా చేశారు. కానీ, అప్ప‌టికే రూ.25 కోట్లు తీసుకున్న రియల్టర్స్ మాత్రం.. తమకు సంబంధం లేదని మీరంతా కొట్టుకు చావండి అంటున్నారని కొత్తగా ప్లాట్స్ కొన్న వ్యక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హెచ్ఎండీఏ నుంచి అనుమ‌తులు తీసుకుంటే.. 200 నుంచి 500 గజాల వ‌ర‌కు అమ్మకాలు చేసి బిజినెస్ చేస్తారు. కానీ, త‌ప్పుడు స‌మాచారం ఇచ్చి పూర్తి అనుమ‌తులు అంటూ.. ఒక్కొక్క‌రికి 700 గ‌జాల నుంచి 2,500 గ‌జాల వ‌ర‌కు అమ్మేశారని అంటున్నారు. గతంలో కొనుగోలు చేసిన వారు.. తాజాగా కొనుగోలు చేసిన వారు కొట్టుకోని చావండని.. తాము, అధికారులు రెండేళ్ల‌లో రూ.25 కోట్లు వెనకేసుకున్నాం అంటూ బొల్లినేని శ్రీవ‌ల్లి, ప‌త్తిపాటి శ్రీధ‌ర్ నేరుగా చెబుతున్నారంటూ వారంతా వాపోతున్నారు. అక్ర‌మ పాస్ బుక్స్ ను స‌స్పెండ్ చేయించినా ధ‌న బ‌లం, ఎమ్మెల్యే అంజ‌య్య అండ‌దండ‌ల‌తో చుట్టూ ప్రహరీ గొడ‌లు నిర్మిస్తున్నార‌ని ప్లాట్ ఓన‌ర్స్ ఆరోపిస్తున్నారు.

 

హెచ్ఎండీఏ ఎం చేస్తోంది?

సైబ‌ర్ మోస‌గాళ్లు తాము చట్టానికి దొరక్కుండా ఉండేందుకు సిమ్ కార్డులు ఎలా మారుస్తారో.. అలాగే అక్ర‌మ‌ ప్రాజెక్ట్స్ చేసే రియ‌ల్ట‌ర్స్ కూడా తప్పుడు పత్రాలతో అప్లికేష‌న్స్ పెట్టి.. జ‌నాల‌ను మోసం చేస్తున్నారని ఆరోపణలు వున్నాయి. తాము చేసేందే క‌రెక్ట్ అంటూ పోలీసులు, పొలిటిష‌న్స్ ముందు క‌ల‌రింగ్ ఇస్తున్నారని చెబుతున్నారు. దోచుకుని.. త‌లా కొంత‌ ఇచ్చిన వారికే మ‌ద్ద‌తు ప‌లకడం కామ‌న్ గా మారిందని వాపోతున్నారు. అస‌లు రికార్డ్స్ ఏంటి? ఎవరెవరు ఏ ప్రాంతంలో పొజిష‌న్స్ లో ఉన్నారు? 2019లో వ్య‌వ‌సాయ భూమి అంటే ఎలా సాధ్య‌మో క‌నీసం గుర్తించ‌కపోవ‌డం… మున్సిపాలిటీ ఆథారిటీ అధికారులు ఇప్ప‌టికీ లేక‌పోవ‌డం న‌గ‌ర శివారులోని వారికి శాపంగా మారిందంటున్నారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ చేశామ‌ని చేతులు దులుపుకున్నారని చెబుతున్నారు.

రిటైర్డ్ ఎమ్మార్వో నిర్వ‌ాకంతోనే గొడ‌వ‌లు!

డీటీసీపీ లే అవుట్స్‌ లో భాగంగా 2005లో 6 ఎక‌రాలు నాలా కన్వ‌ర్ష‌న్ అయింది. గ్రామ పంచాయతీకి గిఫ్ట్ డీడ్ లు పూర్తి చేశారు. కానీ, మ‌ళ్లీ అదే ప్రాంతంలో 2019లో అక్కడ వ్య‌వ‌సాయం సాగు చేస్తున్న‌ట్లు అప్పటి తహసీల్దార్ పంచ‌నామా రిపోర్టు ఇచ్చినట్టు తెలుస్తోంది. మ‌ళ్లీ నాలా క‌న్వ‌ర్ష‌న్ చేశారని, ఒకే భూమికి రెండు సార్లు ఎలా చేశారో వారికే తెలియాలని గ్రామస్తులు అనుకుంటున్నారు. రిటైర్డ్ అయ్యే ముందు అడ్డ‌గోలు వ్య‌వ‌హారాలు చేసి.. కోట్లాది రూపాయ‌లు రియ‌ల్ట‌ర్స్ కి దొచిపెట్టేందుకు కార‌కులు అయ్యారంటూ ప్లాట్ ఓనర్స్ ఆరోపిస్తున్నారు.

No comments:

Post a Comment