*సర్వే ప్రాతిపదికనే.... టికెట్లు....!*
- *ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల సమావేశంలో రేవంత్*
*హైదరాబాద్...!*
కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు రానున్న ఆర్నెల్లు బాగా కష్టపడి పని చేయాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు.ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల శక్తిసామర్థ్యాలు, గెలుపు అవకాశాలు తదితర అంశాలతో కూడిన సర్వే ప్రాతిపదికనే టిక్కెట్లు కేటాయిస్తామని చెప్పారు. శనివారం హైదరాబాద్లోని ఇందిరాభవన్లో నిర్వహించిన టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల సమావేశంలో రేవంత్ మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ఆదేశాలకనుగు ణంగా పనిచేసిన వారిని తప్పకుండా గుర్తింపు ఉంటుందని వివరించారు. ఇందుకు కర్నాటకలో మంత్రి పదవి దక్కించుకున్న బోసురాజే ఒక ఉదాహరణ అని చెప్పారు. ఈ సందర్భంగా నాలుగు తీర్మానాలు చేసినట్టు తెలిపారు. ఎఐసీసీ కార్యదర్శులు బోసురాజు, నదీమ్ జావీద్లను అభినందిస్తూ… కొత్తగా నియమితులైన ఏఐసీసీ కార్యదర్శులకు స్వాగతం పలుకుతూ తీర్మానాలు చేసినట్టు తెలిపారు. బోయిన్పల్లిలోని రాజీవ్గాంధీ నాలెడ్జ్ సెంటర్ శంకుస్థాపనకు సోనియాగాంధీని ఆహ్వానించాలని సభ మరో తీర్మానాన్ని ఆమోదించిందన్నారు. మరోవైపు సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క పాదయాత్ర 1000 కి.మీ పూర్తయిన సందర్భంగా ఆయన్ను అభినందిస్తూ సమావేశంలో తీర్మానం చేసినట్టు రేవంత్ ఈ సందర్భంగా వివరించారు. పార్టీ ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రెటరీలు ఇంచార్జీలుగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి 15 రోజులకు ఒక నివేదిక పంపాలని కోరారు. అందరం కలిసికట్టుగా పని చేస్తేనే విజయం తధ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు.
వాస్తవాలను ప్రజలకు వివరించండి :
రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్రావు ఠాక్రే
సీఎం కేసీఆర్ ప్రజలకు చెబుతున్న అబద్ధాలను ప్రజలకు వివరించాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్రావు ఠాక్రే పిలుపునిచ్చారు. నాయకులు క్షేత్ర స్థాయిలో గట్టిగా పని చేయాలన్నారు. 'కేసీఆర్ రోజూ ప్రజలకు అబద్ధాలు చెబుతూ ప్రచారం చేస్తున్నారు. తనకు పేపర్, ఛానల్స్ ఉన్నాయి. తాను రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్టు, ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారు' అని ఎద్దేవా చేశారు. ఇవన్నీ పచ్చి అబద్దాలనీ, వాటిని అవగాహన చేసుకుని వాస్తవాలనుజనంలోకి తీసుకెళ్లాలని కోరారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్కుమార్గౌడ్ మాట్లాడుతూ ఈనెలాఖారులోపు మండల కమిటీలను పూర్తి చేయాలన్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. డిజిటల్ మెంబర్ షిప్ ఉన్న ప్రతి ఒక్కరిని కలవాలన్నారు. రాష్ట్రానికి కొత్తగా ఏఐసీసీ కార్యదర్శులు విష్ణునాథన్, మన్సూర్ అలీ ఇంచార్జులుగా వచ్చారని తెలిపారు.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment