Wednesday, June 21, 2023

UAPA లాంటి చట్టాలను దుర్వినియోగం చేస్తుండ్రు

భీమ కోరెగవ్ కేసులో దేశ స్థాయిలో ప్రశ్నించే గొంతులను పట్టుకుంటే, ములుగు UAPA కేసు రాష్ట్ర స్థాయిలో అదే పని చేయడానికి ప్రయత్నిస్తోంది. 

హరగోపాల్ అంటే ఫేమస్ వ్యక్తి కాబట్టి, ముఖ్యమంత్రి ఆయన మీద కేసుని తీసేయండి అంటే తీసేసారు.  అది UAPA కేసు కాబట్టి మీడియా దృష్టిని ఆకర్షించింది, కొంత మంది బయట పడ్డారు. 

ముఖ్యమంత్రి గారు చెప్పగానే, ములుగు పోలీసులకు ఆ కొంతమంది మీద ఆధారాలు లేవు అని అప్పటికి అప్పుడు తెలుసుకొని, కోర్టుకు వాళ్ళ పేర్లు కొట్టెయ్యమని చెప్పారు.  

కారణం లేకుండా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయరాదు అని చెబుతున్న వ్యవస్థ అడ్డుపడలేకపోయింది. పోలీసులు అధికార పార్టీ నాయకులు చెప్పినట్టు విని, ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేస్తారు అని సినిమాలలో చూపించిన విధంగా జరిగింది. 

 ఎప్పుడో పోయిన సంవత్సరం పెట్టిన కేసు గురించి ఇప్పటి దాకా నిందితులకు కూడా తెలియదు. విచారణ మొదలు అవ్వలేదు. ప్రజా ఉద్యమాల కోణం లో ఆలోచిస్తే, అవసరం అయినప్పుడు హరగోపాల్ గారిని జైల్ లోకి తోయడం కోసం పేపర్ వర్క్ సిద్దం చేసుకున్నారు అనుకోవచ్చు. అది తప్పు అని చెప్పడానికి పెద్దగా చర్చ అవసరం లేదు. 

ఒకవేళ,  152 మీద ఏటువంటి  రాజకీయ వొత్తిడి లేకుండా, వారు రాజద్రోహం చేస్తారు, చేయబోతున్నారు అని నమ్మి కేసు పెడితే, సంవత్సరం వరకు విచారణ మొదలు అవ్వక పోవడం ఏంటి?

ములుగు పోలీసులు జూన్ 17, 2023 రోజు ఇచ్చిన స్టేట్మెంట్ లో, మావోయిస్టు లీడర్స్ మీద, మావోయిస్టు సానుభూతి పరుల మీద, అక్కడ దొరికిన విప్లవ సాహిత్యం లో ఉన్న మనుష్యుల పేర్ల ఆధారంగా కేసులు పెట్టడం జరిగింది అని చెప్పారు. క్రైమ్ చేసిన వారి మీద, అనుమానం ఉన్న వారి మీద కేసులు పెట్టాలి కానీ, నక్సల్స్ దగ్గర దొరికిన పుస్తకాలలో రాసి ఉన్న పేర్లు అని, వారికి సానుభూతిపరులు అని కేసు పెట్టడం ఏమిటో? ఆ పుస్తకాలో  కార్ల్  మార్క్స్  పేరు , మజుందార్ పేరు కూడా ఉండే ఉంటాయి, వారి మీద కూడా కేసులు బుక్ అయ్యాయా?

ఇక్కడ అందరు భయపడాల్సిన విషయం ఏమిటంటే,   దాదాపు సంవత్సరం పాటు తెలియకపోవడం. అంటే ఎవరి మీద ఎక్కడ ఏమి కేసు ఉందో తెలియదు, కాబట్టి సరైన సమయం చూసి ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చు.  

ఒక పద్దతి, ఒక నియమం లేకుండా జరిగే పనుల వల్ల, ప్రజలకు వ్యవస్థ పట్ల నమ్మకం పోయే అవకాశం ఎక్కువ. అలా నమ్మకం పోయిన రోజున, తాము నిర్బంధానికి గురికాకుండా ఉండాలంటే, అధికార పార్టీ మనుష్యులతో  సత్సంబంధాలు ఉంచుకోవల్సిన పరిస్థితి వచ్చిన రోజు, మానవ హక్కుల మాట పక్కన పెడితే, అసలు వ్యవస్థ నే  కూలిపోయినట్టు భావించాలి. 

UAPA లాంటి చట్టాలు భారత దేశం లో కొత్త కాదు.  ప్రభుత్వాన్ని విమర్శించే వారిని, వ్యతిరేకించే వారిని అదుపులో పెట్టడానికి POTA,UAPA లు ఉంటాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తులను , సంఘ విద్రోహ వ్యక్తులుగా చిత్రీకరించడం అనేది కూడా కొత్తది కాదు.  అయితే, ఇలా ప్రశ్నించే వారు, విమర్శించే వారు తక్కువ సంఖ్య లో  ఉండటం వలన ఇలాంటి నల్ల  చట్టాలతో వారి నోరుని నొక్కెయ్యడం తేలిక. అలాకాకుండా ప్రతి వ్యక్తి , ప్రభుత్వ చట్టాలు , విధానాలతో తన జీవితం, తన చుట్టూ ఉన్న సంఘ్ ఎలా మారచ్చో అర్థం చేసుకున్న రోజు, ప్రభుత్వాల ఆలోచనా విధానం మారుతుంది, ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది, మానవ హక్కులు కాపాడబడతాయి.  

Courtesy by :
సంజీవ్
మానవ హక్కుల వేదిక.

No comments:

Post a Comment