Tuesday, March 16, 2021

ఉద్యోగ సంఘాల‌కు షాక్..అత్యుత్సాహంపై ఈసీ ఆగ్ర‌హం

ఉద్యోగ సంఘాల‌కు షాక్..అత్యుత్సాహంపై ఈసీ ఆగ్ర‌హం

హైదరాబాద్ : 17/03/2021

మ్మెల్సీ ఎన్నికల కోడ్ అమ‌ల్లో ఉన్న విష‌యాన్ని మ‌రిచిపోయి అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించిన ఉద్యోగ సంఘాల నేత‌ల‌‌పై ఎన్నికల సంఘం కొర‌డా ఝ‌లిపించింది. పీఆర్సీపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారంటూ మీడియా ముఖంగా ప్ర‌క‌ట‌న చేసి ఉద్యోగులు, ఉపాధ్యాయుల‌ను ప్ర‌లోభ‌పెట్టడంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఎన్నిక‌ల‌ను కోడ్‌ను ఉల్ల‌ఘించిన మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు అంటూ ఉద్యోగ సంఘాల నేత‌ల‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. 24 గంటల్లోగా సంతకాలు చేసి, లిఖితపూర్వక సంజాయిషీ ఇవ్వాలని ఎన్నిక‌ల సంఘం స్పష్టం చేసింది.

ఈ నెల 9న ముఖ్య‌మంత్రితో భేటీ అనంత‌రం ఉద్యోగ‌, ఉపాధ్యాయ సంఘాలు మీడియా ముందు చ‌ర్చ‌ల సారాంశాన్ని వివ‌రించాయి. ముఖ్య‌మంత్రి ఏపీ కంటే ఎక్కువే పీఆర్సీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ప్ర‌క‌టించారు. దీంతో వాటిని ఆధారంగా చూపుతూ.. కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీలో ఎన్నికల కమిషన్‌కు, రాష్ట్రంలో ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశాల‌తో.. రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ఈ మేర‌కు ప‌లువురు ఉద్యోగ సంఘాల నేత‌ల‌కు షోకాజ్ నోటీసులు జారీచేసింది.

టీఎన్జీవోల సంఘం పూర్వ అధ్యక్షుడు కె.రవీందర్‌రెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు, టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌, టీజీవోల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మమత, సత్యనారాయణ, పీఆర్‌టీయూ అధ్యక్ష, కార్యదర్శులు పి.శ్రీపాల్‌రెడ్డి, బి.కమలాకర్‌రావుకు షోకాజ్‌ నోటీసులు అందాయి. 24 గంట‌ల్లో స‌మాధానం ఇవ్వాల‌ని నోటీసుల్లో ఉండ‌టంటో.. అంద‌రూ వివ‌రణ ఇచ్చారు. అయితే వారు ఏమ‌ని జ‌వాబు ఇచ్చారో తెలియ‌లేదు.

@తొలివెలుగు మీడియా సౌజన్యంతో 

No comments:

Post a Comment