Thursday, March 11, 2021

ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటువేసేముందు ఇవి తెలుసుకోవాలి

హైదరాబాద్ : 11/03/2021
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే ముందు ఇవి తెలుసుకోండి..
తెలంగాణ‌లో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో కొత్తగా ఎంతోమంది ఓటర్లుగా నమోదయ్యారు. గట్టిపోటీ నెలకొన్నందువల్ల రెండో ప్రాధాన్యత ఓటు కీలకమవుతుందనే అంచనాలున్నాయి. కాబట్టి ఓటు ఎలా వేయాలి, ప్రాధాన్యతలను ఎలా ఇచ్చుకుంటూ వెళ్లాలి, కౌంటింగ్‌ ప్రక్రియ ఎలా ఉంటుందనేది ఒక‌సారి తెలుసుకుందాం...


1. బ్యాలెట్‌ పేపర్‌పై అభ్యర్థుల పేర్లు మాత్రమే ఉంటాయి. రాజకీయ పార్టీల తరఫున పోటీచేస్తున్నా... వారి పేర్ల పక్కన పార్టీ గుర్తులు ఉండవు. పార్టీల అభ్యర్థులు గెలిస్తే వారికిచ్చే ధ్రువపత్రంలో ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారనేది రాస్తారు.

2. ప్రాధాన్యత ఓట్లు వేయాల్సి ఉంటుంది. తాము ఎవరికైతే ఓటు వేయదలచుకున్నారో వారి పేరు పక్కన ఉన్న గడిలో 1 అంకె వేయాలి. టిక్‌ చేయకూడదు. అలాగే ఇతరత్రా మరే పద్ధతిలోనూ ఓటును మార్క్‌ చేసినా అది చెల్లదు. అంకె (నెంబర్‌) మాత్రమే వేయాలి. అక్షరాల్లో రాసినా ఓటు చెల్లకుండా పోతుంది.

3. పోటీలో ఎంత మంది అభ్యర్థులు ఉంటే... ఓటరు అన్ని ప్రాధాన్యత ఓట్లు వేయవచ్చు అంటే ఉదాహరణకు ఈసారి హైదరాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గంలో 93 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరికి తమ ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయవచ్చు... అంటే 1, 2, 3, 4.... ఇలా అభ్యర్థుల పేర్ల పక్కన తాము వారికిచ్చే ప్రాధాన్యతను అంకె రూపంలో వేయవచ్చు. అలా 93 వరకూ ప్రాధాన్యత ఇవ్వొచ్చు.

4. మొదటి ప్రాధాన్యత (నంబర్‌ 1) ఇవ్వకుండా... మీరెన్ని ప్రాధాన్యతలు ఇచ్చినా ఆ ఓటు చెల్లదు.

5. ఒక్కరికే తొలి ప్రాధాన్యత ఓటు వేసి ఆపేయవచ్చు లేదా తాము ఎన్ని అనుకుంటే అన్ని పాధాన్యత ఓట్లు వేసి (ఉ దాహరణకు 10 వరకు మాత్రమే వేసి) ఆపేయవ చ్చు. అయితే ప్రాధ్యానతను ఇచ్చే క్రమంలో వరుస తప్పకూడదు. ఉదాహరణకు మొదటి ప్రాధాన్యతకు 1 ఇచ్చి తర్వాత క్రమం తప్పి 3, 4, 5 వేస్తూ పోయారనుకోండి... అప్పుడు ద్వితీయ ప్రాధాన్య త ఓట్లను లెక్కించాల్సిన అవసరం వస్తే మీ ఓటు చెల్లదు. మొదటి ప్రాధాన్యత వరకే మీ ఓటు ను పరిగణనలోని తీసుకొని... తర్వాత పక్కన పెట్టేస్తారు.

6. ఒకే నంబరును ఇద్దరు అభ్యర్థులకు ఇచ్చినా...ఓటు చెల్లకుండా పోతుంది.

7. బ్యాలెట్‌ పేపరుపై అంకెలు వేయడానికి పోలింగ్‌ స్టేషన్‌లో ఇచ్చే స్కెచ్‌ పెన్‌నే వాడాలి.

8.బ్యాలెట్‌ పేపర్‌పై పేర్లు రాయడం, సంతకం చేయడం, వేలిముద్ర వేయడం... చేయకూడదు. అంకెలతో ఓటు ను మార్క్‌ చేయడం తప్పితే బ్యాలెట్‌పై ఏం రాసినా... దాన్ని చెల్లని ఓటుగా పరిగణిస్తారు.

9. విధి నిర్వహణలో భాగంగా ఇతర ప్రదేశా ల్లో ఉంటే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా కూడా ఓటు వేయవచ్చు. దీనికి నిర్ణీత‌ పద్ధతి ఉంటుంది. అదీకృత అధికారి అటెస్టేషన్‌ అవసరం.

Q న్యూస్ తీన్మార్ మల్లన్న సౌజన్యంతో

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment