Wednesday, August 17, 2022

సమాజంలో విద్వేషం పెచ్చరిల్లుతే కోలుకోవడం చాలా కష్టం...... CM KCR

*సమాజంలో విద్వేషం  పెచ్చరిల్లుతే కోలుకోవడం చాలా కష్టం...... CM KCR*

హైదరాబాద్‌: పరిపాలన ప్రజలకు ఎంత దగ్గరకు వస్తే అంత చక్కగా పనులు జరుగుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. మేడ్చల్‌-మల్కాజిగిరి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(కలెక్టరేట్‌)ను శామీర్‌పేట అంతాయిపల్లి వద్ద సీఎం కేసీఆర్‌ ప్రారంభిచారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ... మేడ్చల్‌ జిల్లా అవుతుందని ఎవరూ ఊహించలేదని, పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తెలంగాణ ఏర్పాటు వల్లే ఇది సాధ్యమైందని సీఎం వివరించారు.

''రాష్ట్రంలో కొత్తగా 10లక్షల పింఛన్లు అందిస్తున్నాం. అందరికీ కొత్త కార్డులు ఇస్తున్నాం. 24 గంటలు కరెంటు ఇస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే. హైదరాబాద్‌లో కరెంటు పోదు.. దేశ రాజధాని దిల్లీలో 24గంటలు కరెంటు రాదు. మెదడు రంగరించి.. హృదయంతో ఆలోచిస్తేనే మంచి పనులు చేయగలుగుతాం. మేడ్చల్‌ జిల్లా ఎమ్మెల్యేలకు గతంలో రూ. 5కోట్ల చొప్పున నిధులు కేటాయించాం.. వాటికి అదనంగా మరో రూ.10కోట్లు చొప్పున మంజూరు చేస్తున్నా. తెలంగాణ ధనిక రాష్ట్రమని ఉద్యమ సమయంలోనే చెప్పా. తెలంగాణ ఏర్పడినప్పుడు తలసరి ఆదాయం రూ.లక్ష ఉండేది. ఈరోజు రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.2,78,500. దేశంలోనే ఇది అత్యధికం. ఇవాళ మన జీఎస్‌డీపీ రూ.11.55లక్షల కోట్లు. బారతదేశంలో అద్భుతమైన రాష్ట్రంగా తెలంగాణ ఉంది. అవినీతి రహిత పాలన వల్లే ఇది సాధ్యమైంది. దేశంలోనే అత్యధిక వేతనం పొందుతున్న ఉద్యోగులు తెలంగాణ ఉద్యోగులు. పేద బిడ్డ పెళ్లి జరిగితే రూ.లక్ష సాయం చేస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే.

గతంలో ముసలివాళ్లను ఇంట్లో నుంచి వెళ్లగొట్టేవారు. ఆసరా పింఛను పుణ్యమా అని.. అత్తలు, అమ్మలకు డిమాండ్‌ పెరిగింది. వృద్ధుల దగ్గర ఇవాళ రూ.50.. 60వేలు నిల్వ ఉంటున్నాయి. ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులకు, బీడీ కార్మికులకు, కిడ్నీ బాధితులకు పింఛన్లు అందిస్తున్నాం. మిషన్‌ భగీరథ ద్వారా నీటి కొరత తీర్చుకున్నాం. కరోనా రాకుంటే మరో 500 గురుకులాలు ఏర్పాటు చేసే వాళ్లం. గతంలో ముంబయి, దుబాయికి వలస వెళ్లేవారు. రాష్ట్రంలో ఎవరూ ఉపవాసం ఉండే పరిస్థితి లేదు. దాదాపు 12 రాష్ట్రాల నుంచి పేదలు తెలంగాణకు వచ్చి బతుకుతున్నారు. 60 ఏళ్ల కింద తెలంగాణ సమాజం నిద్రాణమై ఉండేది. అందుకే 58 ఏళ్లు గోస పడ్డాం. దేశంలో జరిగే పరిణామాలపై గ్రామాల్లో, బస్తీల్లో చర్చ జరగాలి. టీవీలు, పేపర్లలో వార్తలు చూసి వదిలేయెద్దు... ఆలోచించండి. చైతన్యవంతమైన సమాజం ఉంటేనే ముందుకు పురోగమిస్తాం. భారతదేశాన్ని కులం, మతం పేరుతో విడదీసే ప్రయత్నం జరుగుతోంది. సమాజంలో విద్వేషం పెచ్చరిల్లితే కోలుకోవడం చాలా కష్టం. చైనా మాదిరిగా అందరూ కులమత రహితంగా ముందుకు సాగాలి. జాతీయ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాలి. నీచ రాజకీయాల కోసం ఎంతకైనా తెగించే వాళ్లు ఉంటారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం పొరపాటు చేసినా గోస పడతాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 58 ఏళ్లు దగా పడ్డాం.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. మన వనరులు కాపాడుకొని భవిష్యత్‌ తరాలకు అందించాలి'' అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

No comments:

Post a Comment