Wednesday, August 24, 2022

విద్యార్థి వీసాకు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు... అమెరికా వెసులుబాటు

*విద్యార్థి వీసాకు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు*


*ఒకసారి తిరస్కరణకు గురైనవారికి అమెరికా వెసులుబాటు*

*ఇంటర్వ్యూలకు మొదలైన స్లాట్ల కేటాయింపు*

*హైదరాబాద్‌.....*
తమ దేశంలో చదువుకోవాలనుకునే భారత విద్యార్థులకు అమెరికా శుభవార్త చెప్పింది. విద్యార్థి వీసా(ఎఫ్‌-1) దరఖాస్తు ఒకసారి తిరస్కరణకు గురైనా అదే విద్యా సంవత్సరంలో మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.అమెరికాలో విద్యా సంవత్సరం ఇటీవల ప్రారంభం అయింది. వీసాలకు ఒత్తిడి తగ్గటంతో తిరస్కారానికి గురైన విద్యార్థులకు మరో అవకాశం ఇవ్వాలని అమెరికా నిర్ణయించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో గడిచిన రెండు మూడేళ్లలో పరిమిత సంఖ్యలోనే విద్యార్థులకు వీసాలు మంజూరు చేశారు. కొవిడ్‌ విజృంభణతో అమెరికా విద్యా సంస్థల్లో సైతం చేరే దేశీ విద్యార్థుల సంఖ్యా తగ్గింది. పరిస్థితులు సద్దుమణగడంతో యూఎస్‌ వెళ్లేందుకు ఆసక్తి చూపే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో తొలిసారి విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికే ప్రాధాన్యం ఇవ్వాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. ఒకదఫా విద్యార్థి వీసా తిరస్కారానికి గురైన పక్షంలో ఆ ఏడాదిలో మళ్లీ దరఖాస్తు చేసుకునే విషయంలో పరిమితులు విధించింది. అర్హులైన వారి అవకాశాలకు ఇబ్బందులు కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. తాజాగా దానిని సడలించింది. కరోనా ముందు వరకు దేశవ్యాప్తంగా ఏటా 50 నుంచి 60 వేల వరకు ఎఫ్‌-1 వీసాలను భారతీయ విద్యార్థులకు జారీ చేసేవారు. ఒకదశలో ఆ సంఖ్య 62 వేలు సైతం దాటినట్లు అమెరికా రాయబార కార్యాలయం ప్రతినిధి ఒకరు ఇటీవల స్పష్టం చేశారు.

అత్యవసర అపాయింట్‌మెంట్‌

తిరస్కారానికి గురైన విద్యార్థులు మరోదఫా వీసా ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు ఈ నెలలో యూఎస్‌ కొన్ని స్లాట్లు విడుదల చేసింది. ఇప్పటికీ స్లాట్లు లభించని విద్యార్థులు అత్యవసర అపాయింట్‌మెంట్‌ వెసులుబాటునూ ఉపయోగించుకోవచ్చని ప్రకటించింది.

*ఇంటర్వ్యూ అధికారి మారతారు*
తిరస్కరణకు గురైన విద్యార్థి వీసా(ఎఫ్‌-1) దరఖాస్తుదారులు ఎవరైనా మరోదఫా ఇంటర్వ్యూకు దరఖాస్తు చేసుకోవచ్చు. మళ్లీ దరఖాస్తు చేసుకున్నప్పుడు మునుపటి అధికారి కాకుండా మరొకరు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ నెలలో ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా సుమారు 15 వేల వరకు విద్యార్థి వీసా స్లాట్లు విడుదల చేశాం.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

No comments:

Post a Comment