*అధికారమనే మత్తులో*
*మునిగిపోయారు.... కేజ్రీవాల్ పై.... అన్నా హజారే ఫైర్*
దిల్లీ: ఆప్ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికార మత్తులో ఉన్నారని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే ఘాటు వ్యాఖ్యలు చేశారు.దిల్లీ మద్యం పాలసీ పై విమర్శలు ఎక్కుపెడుతూ తాజాగా ఆయన కేజ్రీవాల్‌కు ఓ లేఖ రాశారు. 'మద్యం మాదిరే.. అధికారం కూడా మత్తు కలిగిస్తుంది. మీరూ ఆ మత్తులో మునిగిపోయినట్లు కనిపిస్తోంది' అంటూ తీవ్రంగా స్పందించారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ సైతం.. ఏ ఇతర పార్టీలకు భిన్నంగా లేదని వ్యాఖ్యానించారు. ఇది చాలా బాధకరమన్నారు. 'టీం అన్నా' ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఉంటే.. ఇప్పుడు ఇటువంటి తప్పుడు ఎక్సైజ్ విధానాలు ఎక్కడా వచ్చేవి కాదన్నారు.
'మీరు సీఎం అయిన తర్వాత మొదటిసారి రాస్తున్న లేఖ ఇది. ఎందుకంటే.. దిల్లీ ప్రభుత్వ మద్యం పాలసీపై ఇటీవల వెలువడిన వార్తాకథనాలపై కలత చెందా. గతంలో మీ 'స్వరాజ్' పుస్తకంలో మద్యం విధానాలపై ఆదర్శప్రాయ విషయాలు పొందుపరిచారు. దానికి నాతో ఉపోద్ఘాతం రాయించారు. స్థానికుల ఆమోదం లేకుండా మద్యం దుకాణాలు తెరవకూడదని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. కానీ, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఆదర్శాలను మరిచిపోయారు. మీ మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోయిందని తెలుస్తోంది. బలమైన లోక్‌పాల్, లోకాయుక్తాలను తీసుకురావడాన్ని పక్కనబెట్టి.. ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు వ్యతిరేకమైన మద్యం పాలసీని తీసుకువచ్చారు' అని విమర్శించారు.
మద్యం పాలసీలో మహారాష్ట్రతోపాటు తన గ్రామమైన రాలేగావ్ సిద్ధిలను ఆదర్శంగా పేర్కొన్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వంపైనా ఇలాంటే ఆశలే పెట్టుకున్నట్లు.. కానీ, ఇలా చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 'ఇతర పార్టీల మాదిరే దిల్లీలోనూ జనాలు.. అధికారం కోసం డబ్బు, డబ్బు కోసం అధికారమన్న వలయంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. ఒక పెద్ద ఉద్యమం నుంచి ఆవిర్భవించిన పార్టీకి ఇది తగదు' అని లేఖలో రాసుకొచ్చారు. అన్నా హజారే ఆధ్వర్యంలో 2011-12 సమయంలో దేశంలో పెద్దఎత్తున అవినీతి వ్యతిరేక ఉద్యమం జరిగిన విషయం తెలిసిందే. అందులో కేజ్రీవాల్ సైతం పాల్గొన్నారు. అయితే.. అన్నాహజారే పలు సందర్భాల్లో ఆప్‌పై విమర్శలు గుప్పించారు.
*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం
No comments:
Post a Comment