*నేర నిర్ధారణ జరిగిన ప్రజాప్రతినిధులపై.... జీవితకాల నిషేధం*
*పిల్ విచారణకు సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ సమ్మతి....!*
దిల్లీ: నేర సంబంధ కేసుల్లో శిక్షపడిన చట్టసభల సభ్యులను అనర్హులుగా ప్రకటించడంతో పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలన్న పిల్‌ను విచారణకు చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించిందినేర నిరూపణ జరిగిన వ్యక్తులను శిక్షించడంలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల మధ్య తీవ్ర తారతమ్యత ఉంటుందన్న పిటిషనర్ వాదనలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసు విచారణకు తేదీని నిర్ణయిస్తామని తెలిపింది. జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ హిమా కోహ్లి ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. ఒక పోలీస్ కానిస్టేబుల్‌కు నేర సంబంధిత కేసులో శిక్ష పడితే అతను శాశ్వతంగా ఉద్యోగాన్ని కోల్పోతాడని, అదే ఒక ప్రజాప్రతినిధి శిక్ష పూర్తయిన ఆరేళ్ల తర్వాత మళ్లీ చట్టసభలకు ఎన్నికవ్వడానికి అర్హుడవుతారని పిటిషనర్ అశ్వినీ ఉపాధ్యాయ పేర్కొన్నారు. ఇందుకు అవకాశం కల్పిస్తున్న ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(1) చట్టబద్ధతనూ పిటిషనర్ ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల సత్వర విచారణకు దేశంలో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలన్న పిటిషన్ కూడా సర్వోన్నత న్యాయస్థానం పరిశీలనలో ఉన్న విషయం తెలిసిందే
*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం
No comments:
Post a Comment