CJI NV Ramana: ఆ విషయంపై సరైన దృష్టి సారించలేకపోయా.. సారీ!
ధర్మాసనం నుంచి చివరిసారి మాట్లాడిన జస్టిస్ ఎన్.వి.రమణ
ఈనాడు, దిల్లీ: కేసుల పెండింగే ఇప్పుడు న్యాయవ్యవస్థ ముందున్న ప్రధాన సవాల్ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. కేసుల లిస్టింగ్, పోస్టింగ్‌ల అంశంపై తాను తగినంత దృష్టి సారించలేకపోయానని, అందుకు సారీ చెబుతున్నానని తెలిపారు. శుక్రవారం పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా ఆయన చివరిసారి ధర్మాసనంపై నుంచి మాట్లాడారు. ‘‘నేను ఈ స్థాయికి చేరడానికి నా జీవన ప్రస్థానంలో ప్రతి ఒక్కరూ సాయం చేశారు. ఈ గొప్ప వ్యవస్థలో 22 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు భాగస్వామిగా ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నా. అత్యంత సంతృప్తితో పదవీ విరమణ చేస్తున్నా. భారతీయ న్యాయవ్యవస్థ సమయానుకూలంగా, ప్రజాస్వామ్య పరిస్థితులకు తగ్గట్టు ఎదుగుతూ వచ్చింది. అందువల్ల దాని తీరును ఒక తీర్పును బట్టి అంచనావేయడానికి వీల్లేదు. ఈ వ్యవస్థ గొప్పతనాన్ని న్యాయమూర్తులు, న్యాయవాదులు కలిసి రక్షించారు. వ్యవస్థ విశ్వసనీయతను కాపాడుకోలేకపోతే ఇక్కడివారు ప్రజల నుంచి గౌరవ మర్యాదలను పొందలేరు. లాయర్ల అప్రమత్తత, భాగస్వామ్యంతోనే న్యాయవ్యవస్థ బలోపేతం సాధ్యమవుతుంది. మీ సహకారం వల్లే ఈ దేశ న్యాయవ్యవస్థలో మార్పు సాధ్యమైంది’’ అని పేర్కొన్నారు. తన పదవీ కాలమంతా సంక్లిష్టంగా సాగిందని, అయినప్పటికీ అన్నివర్గాలూ సహకరించాయని జస్టిస్ ఎన్.వి.రమణ తెలిపారు. ‘‘రోజువారీ పనితీరును సంస్కరించడానికి ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడమే మార్గం. కృత్రిమ మేధ ద్వారా పరిష్కారాలు కనుక్కోవాలి. మేం కొన్ని విధానాలను అభివృద్ధి చేసినప్పటికీ పలు సమస్యల కారణంగా వాటిని కొనసాగించలేకపోయాం. కొవిడ్ సమయంలో రోజువారీగా కోర్టులను నడపడమే పెద్ద సమస్య అయింది. మిగతా వాణిజ్య సంస్థల్లా మేం మార్కెట్ నుంచి నేరుగా సాంకేతిక పరికరాలు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. నేను సీజేఐగా పనిచేసిన 16 నెలల్లో కొవిడ్ కారణంగా పూర్తిస్థాయి విచారణలు 55 రోజులే జరిగాయి. నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.
No comments:
Post a Comment