*9 నుండి 21 వ తేదీ వరకు అన్ని థియేటర్లలో 'గాంధీ' మూవీని స్పెషల్ షో..*
*ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఐదవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులందరికీ ఉచితం.*
*వివిధ శాఖలకు జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఆదేశాలు.*
రంగారెడ్డి జిల్లా:స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించనున్న నేపథ్యంలో, ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అమోయ్ కుమార్ అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్ కోర్టుహాల్ లో వజ్రోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్ అమోయ్ కుమార్ జిల్లా అధికారులతో సమీక్ష జరిపారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వజ్రోత్సవాల్లో భాగంగా నేటి నుండి 22వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని వివరించారు.తొలి రోజున ముఖ్యమంత్రి హైదరాబాద్ లో ఉత్సవాలు ప్రారంభిస్తారని,9న జిల్లా స్థాయిలో నిర్వహించే సమావేశానికి మండల స్థాయి ముఖ్య అధికారులు హాజరు కావాల్సి ఉంటుందన్నారు.ఈ నెల 9 నుండి 21 వ తేదీ వరకు అన్ని థియేటర్లలో 'గాంధీ' మూవీని స్పెషల్ షోగా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి రోజు ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు ప్రదర్శించబడే గాంధీ మూవీకి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఐదవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఉచితంగా ప్రవేశం కల్పించాలన్నారు.థియేటర్ల సంఖ్యకు అనుగుణంగా, ఆయా పాఠశాలల వారీగా విద్యార్థులను థియేటర్లలో గాంధీ మూవీని చూపించాలని, ఈ సందర్భంగా విద్యార్థులకు ఏ చిన్న ఇబ్బంది కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, 10వ తేదీన నియోజకవర్గాల స్థాయిలో ప్రతి గ్రామ పంచాయతీ, వార్డు పరిధిలో వన మహోత్సవం కార్యక్రమం చేపట్టి ఒకే చోట కనీసం 750 చొప్పున ఆకర్షణీయమైన మొక్కలు నాటాలని ఆదేశించారు. ఆ ప్రాంతాన్ని ఫ్రీడమ్ పార్క్ గా సంబోధించడం జరుగుతుందన్నారు. 11న మున్సిపల్, మండల స్థాయిలో ఫ్రీడమ్ రన్ నిర్వహించాలని, 12న జాతీయ సమైక్యతా రక్షాబంధన్, 13న ఎన్ సి సి, ఎన్ ఎస్ ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఉద్యోగులతో ర్యాలీలు నిర్వహించి మైదానాల్లో త్రివర్ణ బెలూన్లను ఎగుర వేయాలన్నారు. 14న జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో జానపద కళాకారుల ప్రదర్శనలు, బాణాసంచా కాల్చడం, 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, 16న అన్ని ప్రాంతాల్లో నిర్ణీత సమయంలో సామూహిక జాతీయ గీతాలాపన, కవి సమ్మేళనం, 17న జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం, 18 ఉద్యోగులు, యువతకు ఫ్రీడమ్ కప్ పేరిట క్రీడా పోటీల నిర్వహణ, 19న అనాధ, వృద్ధాశ్రమాలు, ఆసుపత్రులు, జైళ్లలో పండ్ల పంపిణీ, 20న స్వయం సహాయక సంఘాలు, మహిళలకు రంగోలి పోటీలు నిర్వహించడం జరుగుతుందని, 22న హైదరాబాద్ లోని ఎల్.బీ స్టేడియంలో ముగింపు సంబరాలు ఉంటాయని కలెక్టర్ వెల్లడించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అన్ని స్థాయిలలో అధికారులు ఈ ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమాలను అనుసరిస్తూ వాటి నిర్వహణ కోసం పకడ్బందీ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. 15వ తేదీన ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేసేలా ఇంటింటికి జెండాలు పంపిణీ చేయాలని ఆదేశించారు.రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిక్ జైన్, హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్ఓ హరిప్రియ, హైదరాబాద్ డిఆర్ఓ సూర్యలత, జిల్లా విద్యాధికారులు, పోలీస్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు
*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం
No comments:
Post a Comment