Thursday, February 25, 2021

సోష‌ల్ మీడియాకు కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు ప్ర‌క‌టించిన కేంద్రం

హైదరాబాద్ : 25/02/2021

*సోష‌ల్ మీడియాకు కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు ప్ర‌క‌టించిన కేంద్రం*
సోష‌ల్ మీడియాకు కేంద్ర ప్ర‌భుత్వం కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది.టెక్ కంపెనీల‌పై ఆధిప‌త్యం కోసం కేంద్ర ప్ర‌భుత్వం కొత్త డిజిట‌ల్ ముసాయిదాను త‌యారు చేసింది.ఇంటర్నెట్ ఆధారిత‌, ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ల‌కు కొత్త నియ‌మావ‌ళిని కేంద్రం రిలీజ్ చేసింది.దీనికి సంబంధించిన ఇవాళ కేంద్ర ఐటీశాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ కొన్ని విష‌యాల‌ను వెల్ల‌డించారు. సోష‌ల్ మీడియా దుర్వినియోగంపై విస్తృత స్థాయిలో చ‌ర్చించామ‌ని మంత్రి తెలిపారు.  డిజిట‌ల్ కాంటెంట్ విష‌యంలో 2018 డిసెంబ‌ర్‌లో ముసాయిదా త‌యారు చేశామ‌ని,  దీంట్లో రెండు క్యాట‌గిరీలో ఉంటాయ‌న్నారు.  అనుచిత వ్యాఖ్య‌లు చేస్తూ ట్వీట్ లేదా సందేశం పోస్టు చేసిన వారి తొలి వ్య‌క్తి స‌మాచారాన్ని కోర్టు ఆదేశం లేదా ప్ర‌భుత్వ ఆదేశం ప్ర‌కారం సోష‌ల్ మీడియా సంస్థ‌లు బ‌హిర్గతం చేయాల‌ని మంత్రి ర‌విశంక‌ర్ తెలిపారు. దేశ సార్వ‌భౌమ‌త్వం, స‌మ‌గ్ర‌త‌, భ‌ద్ర‌త‌, శాంతిభ‌ద్ర‌త‌లు, విదేశీ వ్య‌వ‌హారాలు, అత్యాచారం, అస‌భ్య కాంటెంట్‌ను ప్ర‌చారం చేసేవారి విష‌యంలోనే ఈ చ‌ర్య‌లు వ‌ర్తిస్తాయ‌ని మంత్రి వెల్ల‌డించారు.

*24 గంట‌ల్లో తొల‌గించాలి..*

సోష‌ల్ మీడియా దుర్వినియోగంపై ఫిర్యాదు ప‌రిష్కార వ్య‌వ‌స్థ‌ను కూడా రూపొందిస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు.  గ్రీవియ‌న్స్ ఆఫీస‌ర్ స‌దురు స‌మ‌స్య‌ను 24 గంట‌ల్లో రిజిస్ట‌ర్ చేసి.. 15 రోజుల్లో ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తార‌ని మంత్రి ర‌విశంక‌ర్ చెప్పారు.  మ‌హిళ‌ల గౌర‌వానికి సంబంధించిన అంశంలో ఎటువంటి అస‌భ్య‌క‌ర‌మైన ఫోటోల‌ను వాడ‌రాదు.  ఆడ‌వారిని త‌ప్పుగా చిత్రీక‌రిస్తూ ఏవైనా ఫోటోల‌ను అప్‌లోడ్ చేస్తే.. వారు ఫిర్యాదు చేసిన 24 గంట‌ల్లోనే ఆ ఫోటోల‌ను, సందేశాల‌ను తొల‌గించాల‌ని మంత్రి తెలిపారు.  మ‌హిళ‌ల ప‌ట్ల గౌర‌వం వ‌ల్ల ఈ నియ‌మాన్ని తీర్చిదిద్దినట్లు మంత్రి చెప్పారు.

*ఓటీటీపై నిఘా*

ఓటీటీ ఫ్లాట్‌పామ్‌ల‌కు సంబంధించి మూడు విధానాల‌ను అవ‌లంబించ‌నున్న‌ట్లు కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ తెలిపారు.  ఓటీటీతో పాటు డిజిట‌ల్ న్యూస్ మీడియా సంస్థ‌లు త‌మ వివ‌రాల‌ను వెల్ల‌డించాల్సి ఉంటుంద‌న్నారు. రిజిస్ట్రేష‌న్ల‌ను త‌ప్ప‌నిస‌రి చేయ‌డం లేద‌ని, కానీ స‌మాచారాన్ని సేక‌రిస్తున్నామ‌ని మంత్రి తెలిపారు. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ల‌తో పాటు డిజిట‌ల్ పోర్ట‌ల్స్ కోసం ఫిర్యాదు ప‌రిష్కార వ్య‌వ‌స్థ ఉండాల‌న్నారు. ఓటీటీల‌కు స్వ‌యం నియంత్రిత వ్య‌వ‌స్థ ఉండాల‌ని,  సుప్రీం మాజీ జడ్జి లేదా హైకోర్టు జ‌డ్జి లేదా ప్ర‌ముఖ వ్య‌క్తి ఎవ‌రైనా ఆ బాధ్య‌త‌లు చూసుకోవాల‌న్నారు.

@నమస్తే తెలంగాణ మీడియా (ట్విట్టర్)

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/


No comments:

Post a Comment