*టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత*
ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా ఆయన ఆదివారం తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు మృతి చెందారు.ఆయన మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
కోట శ్రీనివాసరావు ప్రస్థానం తెలుగు సినీ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. సుదీర్ఘ నటనా జీవితంలో విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. జూలై 10, 1942న కృష్ణా జిల్లా కంకిపాడులో కోట సీతారామాంజనేయులుకి జన్మించారు. సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తూనే, రంగస్థలంపై అనేక నాటకాల్లో నటించి విశేష అనుభవాన్ని సంపాదించారు. రంగస్థల నటుడిగా ఆయనకు మంచి పేరు వచ్చింది.
1978లో చిరంజీవి తొలి చిత్రమైన 'ప్రాణం ఖరీదు'తో కోట శ్రీనివాసరావుగారు వెండితెర అరంగేట్రం చేశారు. రావు గోపాలరావు తర్వాత తెలుగు విలనిజానికి సరికొత్త రూపం చూపించిన నటుడు కోట శ్రీనివాసరావు. 1985లో విడుదలైన 'ప్రతిఘటన' సినిమాలో కసాయి పాత్రలో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా ఆయన కెరీర్‌కు ఒక మైలురాయిగా నిలిచింది.
*తమదైన మార్క్ నటనతో*
అహంకారి', 'గణేష్', 'శత్రువు', 'శివ', 'వందేమాతరం' వంటి అనేక చిత్రాలలో ప్రతినాయకుడిగా నటించి, తమదైన మార్క్ నటనతో ప్రేక్షకులను భయపెట్టారు. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు కోట శ్రీనివాసరావు లోని హాస్య నటుడిని వెలికి తీశాయి. 'ఆహా నా పెళ్ళంట' సినిమాలో పిసినారి లక్ష్మీపతి పాత్ర, 'జంబలకిడి పంబ' వంటి చిత్రాల్లో ఆయన హాస్య నటన తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాత్రలు ఆయనకు హాస్యనటుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చాయి.
కేవలం విలన్‌గా, హాస్యనటుడిగానే కాకుండా, సహాయ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా వందల సినిమాల్లో నటించి మెప్పించారు. తండ్రి, బాబాయ్, పెద్దమనిషి, రాజకీయ నాయకుడు, పిసినిగొట్టు, ఆదరించే తాతయ్య వంటి ఎన్నో విభిన్న పాత్రల్లో ఇట్టే ఒదిగిపోయారు. 'అత్తారింటికి దారేది', 'దూకుడు', 'సర్కార్', 'బొమ్మరిల్లు', 'అతడు', 'ఠాగూర్', 'ఇడియట్', 'స్టూడెంట్ నంబర్ 1' వంటి చిత్రాల్లో ఆయన పాత్రలు గుర్తుండిపోయాయి. తెలుగులోని వివిధ మాండలికాలను (రాయలసీమ, తెలంగాణ, శ్రీకాకుళం, గోదావరి) అనర్గళంగా మాట్లాడగల సామర్థ్యం ఆయన ప్రత్యేకత. పాత్రకు తగ్గట్టు యాసను పలికించి సహజత్వాన్ని తీసుకొచ్చేవారు.
2015లో భారత ప్రభుత్వం నుండి భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం 'పద్మశ్రీ' అందుకున్నారు. ప్రతినాయకుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్, సహాయ నటుడు విభాగాల్లో తొమ్మిది రాష్ట్ర నంది అవార్డులు గెలుచుకున్నారు. 2012లో 'కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రానికి గానూ SIIMA ( సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు ) అవార్డును అందుకున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా నటించి మొత్తం 750కి పైగా సినిమాల్లో తన నటనా ప్రతిభను చాటారు.
కోట శ్రీనివాసరావు 1999 నుండి 2004 వరకు ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయవాడ తూర్పు నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు.
*గంతల నాగరాజు(GNR)*
No comments:
Post a Comment