మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నీడలో..!
# రూ.500 కోట్ల స్థలం..నెలకు రూ.58 వేలకే.!
# హార్టికల్చర్ వర్సిటీలో అద్దె బాగోతం
# 'అద్దె' కింద రహస్యంగా అగ్రిమెంట్!
# స్థలం బదలాయింపులో వర్సిటీ అధికారుల పాత్ర..
# గత ప్రభుత్వ పెద్దల హస్తం.?
(అనంచిన్ని వెంకటేశ్వరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)
ఐదెకరాల భూమి.. విలువ రూ.500 కోట్లకు పైనే. హైదరాబాద్ శివారులో ఉన్న ఇంతటి విలువైన భూమిని అద్దె పేరుతో అప్పనంగా అప్పగించేసింది గత సర్కారు. ఓ ప్రైవేటు సంస్థతో తగ్గువకే రెంటల్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. లీజుకు ఇచ్చేందుకు నిబంధనలు ఒప్పుకోకపోవడంతో 'రెంట్' అంటూ కొత్త విధానానికి తెరలేపింది. అత్యంత రహస్యంగా నడిపిన ఈ అద్దె బాగోతం 'తెలంగాణవాచ్' తాజా పరిశోధనలో వెలుగులోకి వచ్చింది. కోట్లు విలువ చేసే వర్సిటీ భూములను ప్రైవేటు సంస్థకు అప్పగించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకోసం ఏకంగా వర్సిటీకి కొత్త జిల్లాలో కొత్త భవనాలు నిర్మించి మరీ ఈ బరితెగింపుకు నిర్లజ్జగా తెరలేపారు. మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నీడలోనే ఇదంతా జరిగింది. సిఐడి దర్యాప్తు చేస్తే మొత్తం బాగోతం బయటకు వస్తుంది.
నెలకు రూ.58 వేలు.!:
హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ వర్సిటీకి 55 ఎకరాల భూమి ఉంది. ఇవి శంషాబాద్ హైవేక్ దగ్గర్లోనే ఉన్నాయి. హార్టికల్చర్ వర్సిటీని రాజేంద్రనగర్ నుంచి సిద్దిపేట జిల్లా ములుగులో కొత్తగా కట్టిన భవనంలోకి షిఫ్ట్ చేశారు. దీంతో చాలా కాలంగా రాజేంద్రనగర్ లో వర్సిటీ రీసెర్చ్ కార్యకలాపాలు పెద్దగా జరగడం లేదు.
సర్వే చేస్తున్న క్రమంలో..:
హార్టికల్చర్ వర్సిటీ భూములను హైకోర్టు భవన నిర్మాణం కోసం తీసుకునేందుకు సర్వే చేస్తున్న క్రమంలో... అప్పటి గవర్నమెంట్ పెద్దలకు పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ రీసెర్చ్ స్టేషన్లకు సంబంధించి 5 ఎకరాల్లో ఉన్న ప్యాక్ హౌస్ బిల్డింగ్, భూములపై కన్ను పడింది. ఇక్కడ బహిరంగ మార్కెట్లో ఎకరం రూ.వంద కోట్ల వరకు పలుకుతున్నది. ఈ 5 ఎకరాల విలువ రూ.500 కోట్ల దాకా ఉంటుంది. 'ఆల్ నాచురల్ రూట్స్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్' అనే సంస్థతో అద్దె ప్రాతిపదికన పేరుతో 33 నెలలకు అగ్రిమెంట్ చేసుకుని ఈ భూమిని అప్పగించారు.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్యాక్ హౌస్, దాని చుట్టూ ఉన్న స్థలానికి నెలకు రూ.58,374 చొప్పున అద్దె చెల్లించేలా కట్టబెట్టారు.
లీజుకు ఇవ్వడం కుదరక..: లీజు ఇవ్వడం కుదరకపోవడంతోనే 'అద్దె' పేరుతో భూమిని అప్పగించారని తెలుస్తున్నది. 2022 ఆగస్టు 08న ఆల్ నాచురల్ సంస్థ ఎండీ అల్ల రాజు.. సదరు స్థలాన్ని లీజుకు ఇవ్వాలంటూ అప్పటి అగ్రికల్చర్ మంత్రికి ప్రతిపాదన పంపారు. దీన్ని 2022 ఆగస్టు 10న వర్సిటీ అధికారులకు పంపించారు.
నిబంధనలు ఒప్పుకోవని..:
అయితే స్టాఫ్, విద్యార్థులు వినియోగించే రీసెర్చ్ స్టేషన్ ను లీజుకు ఇవ్వడం సాధ్యంకాదని, ఇందుకు నిబంధనలు ఒప్పుకోవని కొత్త విధానానికి తెరలేపారు. 2022 డిసెంబర్ 17న ప్యాక్ హౌసు అద్దె కింద ఇచ్చేందుకు యూనివర్సిటీ బోర్డు మీటింగ్ లో 'అప్రూవల్' ఇచ్చారు. దీన్ని 33 నెలల వరకు అద్దె ప్రాతిపదికన ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ వ్యవహారం బయటికి పొక్కితే వివాదాస్పదమవుతుందని అత్యంత గోప్యంగా ఉంచారు. స్థలం బదలాయింపులో కొంతమంది వర్సిటీ అధికారులు కీలకపాత్ర పోషించినట్లు చర్చ సాగుతున్నది.
భారీ వెంచర్ ఉండటంతో..
హార్టికల్చర్ భూములకు పక్కనే ఒక రియల్ ఎస్టేట్ సంస్థ భారీ ఎత్తున వెంచర్ వేస్తున్నది. పెద్ద మాల్ కూడా వస్తున్నది. భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుందన్న కారణంతో ఈ స్థలాన్ని 'అద్దె' పేరుతో ముందు హస్తగతం చేసుకుని, భవిష్యత్తులో పెద్దఎత్తున వ్యాపారకార్యకలాపాలు నిర్వహించవచ్చని ప్లాన్ చేసినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో కీలకమైన మంత్రి నిరంజన్ రెడ్డి
ఆయన అనుచరులతో కలిసి ఈ స్థలాన్ని లీజుకు అప్పగించడానికి పూర్తిగా సహకరించినట్లు తెలుస్తున్నది.
పైకి అంతా లీగల్ గానే..అంటే.!:
వర్సిటీస్థలం వృథాగా ఉండకూడదనే ప్యాక్ హౌస్ బోర్డు నిర్ణయం జరిగింది. అంతా లీగల్ గానే జరిగింది. ఇప్పటి వరకు అక్కడ కార్యకలాపాలు జరగలేదు. హైకోర్టు నిర్మాణానికి యూనివర్శిటీ భూములను సేకరించే అంశంపై ఇప్పటి వరకు మాకు ఎలాంటి సమాచారంలేదు.
-నీరజ ప్రభాకర్, వీసీ, హార్టికల్చర్ వర్సిటీ
No comments:
Post a Comment