Sunday, June 7, 2026

_రాజ్యాంగం ఇంకా బతికే ఉందా? - చెన్‌బసమ్మ కుటుంబ సభ్యులు_

*న్యాయం కోసం ఎదురుచూసి కన్నుమూసిన వృద్ధురాలు*

*రాజ్యాంగం ఇంకా బతికే ఉందా? - చెన్‌బసమ్మ కుటుంబ సభ్యులు*

*మార్చ్ 17,2026 నాడు "మీడియా టుడే" లో "వృద్ధ మహిళ న్యాయ పోరాటం" వార్త కథనం కూడా వచ్చింది*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 6:

వికారాబాద్ జిల్లా, తాండూర్ పట్టణంకు చెందిన చెన్‌బసమ్మ మరణం అధికార యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనమా?. అనారోగ్యంతో బాధపడుతూ, తనకు సంబంధించిన ఆస్తి మరియు న్యాయ సమస్య పరిష్కారం కోసం సంవత్సరాల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి చివరకు పక్షవాతంతో మంచానికి పరిమితమైన 75 ఏళ్ల వృద్ధురాలు శ్రీమతి చెన్‌బసమ్మ గారు చివరకు 29-05-2026న కన్నుమూశారు.మార్చ్ 17,2026 నాడు "మీడియా టుడే" లో "75 ఏళ్ల వృద్దురాలు పక్షవాతంతో మంచాన పడ్డా సంవత్సరాలనుండి న్యాయ పోరాటం" వార్త కథనం కూడా వచ్చింది. అయినా అధికారులు స్పందించలేదు. ప్రభుత్వ అధికారిక మాధ్యామాల ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు ముఖ్యమంత్రి కార్యాలయం CMOHYD,వికారాబాద్ జిల్లా కలెక్టర్ కు, స్థానిక చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశవేశ్వరరెడ్డి కి, తాండూర్ నియోజకవర్గం శాసనసభ్యులు మనోహర్ రెడ్డి కి,తాండూర్ మున్సిపల్ చైర్మన్ కు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. ఇదేనా ప్రజాపాలన - ప్రగతి పాలన అని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.
ప్రశ్న ఏమిటంటే — తన జీవితకాలంలో న్యాయం కోసం ఎదురు చూసిన ఒక వృద్ధురాలికి న్యాయం చేయలేకపోతే, రాజ్యాంగం కల్పించిన హక్కులు సామాన్య ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి?
ప్రభుత్వ కార్యాలయాలు,జిల్లా కలెక్టర్ కార్యాలయం,రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ, ప్రజావాణి, ఉన్నతాధికారులు, ఇంకా అనేక వేదికల ద్వారా సమస్యను పలుమార్లు తెలియజేసినా పరిష్కారం దొరకకపోవడం బాధాకరం.అనేక ఫిర్యాదులు, పత్రాలు, వినతులు, ఆధారాలు సమర్పించినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో, చెన్‌బసమ్మ గారు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రతి సంవత్సరం మహిళా హక్కుల గురించి గొప్పగా మాట్లాడే సమాజం, ఒక వృద్ధ మహిళ న్యాయం కోసం ఎదురుచూస్తూ కన్నుమూసినప్పుడు ఎక్కడ ఉంది? ప్రజల హక్కులను కాపాడాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖలు ఈ పరిస్థితికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా?
"న్యాయం ఆలస్యమైతే అది కూడా అన్యాయమే" అనే సూత్రాన్ని ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తోంది.చెన్‌బసమ్మ గారు ఇక లేరు.కానీ ఆమె అడిగిన ప్రశ్నలు ఇంకా సమాధానం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాయి.
పేదలకు న్యాయం పొందే హక్కు ఉందా?వృద్ధుల సమస్యలు పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత కాదా?రాజ్యాంగం కల్పించిన హక్కులు కేవలం పుస్తకాలకే పరిమితమా?అధికారులు స్పందించకపోతే సామాన్యుడు ఎవరిని ఆశ్రయించాలి? కుటుంబ సభ్యుల విజ్ఞప్తి ఏమిటంటే, చెన్‌బసమ్మ గారు జీవించి ఉండగా పరిష్కారం కాలేకపోయిన ఈ సమస్యను ఇప్పటికైనా సంబంధిత అధికారులు పరిశీలించి న్యాయం చేయాలి.అదే "ఆమె ఆత్మకు నిజమైన శాంతి కలిగించే మార్గమని" వారు కోరుతున్నారు.
— కుటుంబ సభ్యులు

No comments:

Post a Comment