*మృగశిర కార్తె శుభ సందర్భంగా అన్నదాతలందరికీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 8:
వానాకాలం వ్యవసాయానికి శ్రీకారం చుట్టే మృగశిర కార్తె ప్రారంభమవుతున్న ఈ శుభ సందర్భంలో అన్నదాతలందరికీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యవసాయం పండుగగా, తొలకరి పలకరింపు రైతులు, రైతు కూలీల ఇళ్లల్లో ఆనందోత్సాహాలు నింపాలని ఆకాంక్షించారు. వాతావరణ శాఖ, రాష్ట్ర వ్యవసాయ శాఖ సూచనలను పరిగణలోకి తీసుకుని రైతులు పంటలకు సిద్ధం కావాలని సూచించారు. వాతావరణ పరిస్థితుల్లో వేగంగా వస్తున్న మార్పులు, కొన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ముందస్తు అంచనాలను దృష్టిలో పెట్టుకుని ఖరీఫ్ సాగుకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి రైతాంగాన్ని కోరారు.కొన్ని పరిమితమైన పంటల సాగుపైన దృష్టి సారించడం వల్ల పప్పుధాన్యాలు, వేరుశనగ, పెసలు, మినుములు, నువ్వులు వంటి పంటలను దిగుమతి చేసుకోవలసిన పరిస్థితులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.ఇలాంటి సమస్యలను అధిగమించడంతో పాటు వరుసగా ఒకే పంటను సాగు చేయడం వల్ల నేల సారం తగ్గి తెగుళ్ల సమస్యలు కూడా పెరుగుతున్నాయని, వ్యవసాయ శాఖ సూచనలకు అనుగుణంగా పంట మార్పిడి వల్ల నేల సారం పెరగడమే కాకుండా దీర్ఘకాలంలో అధిక దిగుబడులు అందించే పంటలపై దృష్టి సారించాలని సూచించారు.ఈ మృగశిర కార్తె అన్నదాతలకు శుభారంభం కావాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పుష్కలమైన పంటలు పండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
No comments:
Post a Comment