Thursday, June 25, 2026

_"ఊరు బడి మూతపడితే... అది కేవలం ఒక పాఠశాల మూతపడినట్టే కాదు, ఊరి భవిష్యత్తుకే తాళం వేసినట్టే"_

*నల్లగొండ జిల్లా ఊటుకూరు గ్రామానికి చెందిన వై. పురుషోత్తం రెడ్డి చేసిన పని గ్రామానికి ఆదర్శంగా నిలిచింది*

*ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న తన ఇద్దరు కుమారులను ఊటుకూరు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం అభినందనీయం*

*ఊటుకూరు ప్రభుత్వ పాఠశాలను కాపాడేందుకు సమాజం ముందుకు రావాలి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 24:

గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల కొరతతో మూతపడే పరిస్థితులు ఏర్పడటం ఆందోళన కలిగించే అంశమని సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఊటుకూరు గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుండటం గ్రామ ప్రజలను ఆలోచింపజేస్తోంది.
ప్రభుత్వ విద్యను కాపాడాలని వేదికలపై మాట్లాడేవారు చాలా మంది ఉన్నప్పటికీ, ఆ మాటలను ఆచరణలో చూపించే వారు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారని సామాజికవేత్తలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఊటుకూరు గ్రామానికి చెందిన వై. పురుషోత్తం రెడ్డి చేసిన పని గ్రామానికి ఆదర్శంగా నిలిచిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.ప్రజాసేవకు, తాను నమ్మిన రాజకీయాలకు కార్యాచరణే ప్రాణమని విశ్వసించే వై. పురుషోత్తం రెడ్డి, "ముందుగా మనం మారితేనే సమాజం మారుతుంది" అనే ఆలోచనతో ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న తన ఇద్దరు కుమారులను ఊటుకూరు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం విశేషమని పేర్కొంటున్నారు.ఇటీవల పాఠశాల పరిస్థితులను పరిశీలించిన సందర్భంగా, గత విద్యా సంవత్సరంలో మొత్తం 23 మంది విద్యార్థులు ఉండగా, వారిలో 10 మంది పై తరగతులకు వెళ్లిపోయిన తర్వాత కేవలం 13 మంది విద్యార్థులు మాత్రమే మిగిలినట్లు తెలిసింది. ఈ విద్యా సంవత్సరంలో వై. పురుషోత్తం రెడ్డి గారి ఇద్దరు కుమారులు, మరో బీసీ వర్గానికి చెందిన ఒక విద్యార్థి చేరడంతో ప్రస్తుతం మొత్తం 16 మంది విద్యార్థులు మాత్రమే పాఠశాలలో ఉన్నారు.అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు ఉన్న విద్యార్థులందరికీ ఒకే గదిలో బోధన కొనసాగుతోంది. పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్య తీవ్రంగా తగ్గిపోవడం ఆందోళనకరంగా మారింది.ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో ఊటుకూరు ప్రభుత్వ పాఠశాల మూతపడే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రభుత్వ పాఠశాల మూతపడటం అంటే కేవలం ఒక భవనం మూతపడటం కాదని, పేద పిల్లల విద్యా అవకాశాలు, గ్రామ భవిష్యత్తు, సామాజిక సమానత్వం దెబ్బతినడమేనని వారు పేర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో గ్రామంలోని ప్రజలు, మేధావులు, యువత, ప్రజాస్వామ్యవాదులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్, వార్డు సభ్యులు కలిసి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కోరుతున్నారు. ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను చైతన్యపరచడం, ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను వివరించడం, గ్రామంలోని పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు కృషి చేయడం ద్వారా మాత్రమే ఊరి బడిని కాపాడగలమని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ అనేది కేవలం విద్యాశాఖ బాధ్యత మాత్రమే కాదని, అది సమాజం మొత్తం బాధ్యత అని సామాజిక వర్గాలు పేర్కొంటున్నాయి. వై. పురుషోత్తం రెడ్డి చూపించిన ఆచరణను ఆదర్శంగా తీసుకుని మరింత మంది ముందుకు వస్తే ఊటుకూరు ప్రభుత్వ పాఠశాల మాత్రమే కాదు, గ్రామీణ ప్రభుత్వ విద్య కూడా బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

*సందేశం*

"ఊరు బడి మూతపడితే... అది కేవలం ఒక పాఠశాల మూతపడినట్టే కాదు, ఊరి భవిష్యత్తుకే తాళం వేసినట్టే."

"ఊరు బడి కోసం మాటలు కాదు... పిల్లల అడ్మిషన్‌లే నిజమైన మద్దతు."

No comments:

Post a Comment