Thursday, June 11, 2026

బ్రతికి ఉన్న మహిళను చనిపోయినట్టుగా చూపించి భూమి కాజేయాలన్న కుట్ర బట్టబయలు..!

*బ్రతికి ఉన్న మహిళను చనిపోయినట్టుగా చూపించి భూమి కాజేయాలన్న కుట్ర బట్టబయలు..!*

*ప్రజావాణిలో ఫిర్యాదు – విచారణకు ఆర్డీఓ ఆదేశాలు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 10:

నల్లగొండ జిల్లా శాలి గౌరారం మండలం ఇటుకులపాడు గ్రామానికి చెందిన గందం జ్యోతి భర్త అశోక్ తనకు పూర్వీకుల ఆస్తిలో రావలసిన మూడు ఎకరాల 10 గుంటల భూమిని అక్రమంగా కాజేయడానికి జరిగిన భారీ కుట్రపై న్యాయం కోరుతూ జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు వివరాల ప్రకారం, తాను బ్రతికి ఉండగానే చనిపోయినట్టుగా తప్పుడు పత్రాలు, ఫ్యామిలీ సర్టిఫికెట్ సృష్టించి, తన అన్న అయిన బొడ్డు విజయ్ (తండ్రి వీరమల్లు) కొందరు అధికారులతో కుమ్మక్కై అక్రమ పట్టా పొందినట్లు ఆరోపించారు. తనకు చట్టబద్ధంగా రావలసిన వాటా భూమిని దోచుకునేందుకు ఈ కుట్ర జరిగిందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ మేరకు గందం జ్యోతి ప్రజావాణి ఫిర్యాదు నంబర్: PV-B 172/2026, తేదీ: 04-06-2026 ద్వారా జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు. ఫిర్యాదును పరిశీలించిన నల్లగొండ జిల్లా ఆర్డీఓ వై. అశోక్ రెడ్డి గారు విచారణ జరిపి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శాలి గౌరారం తహసీల్దార్ (ఎంఆర్వో)కు ఆదేశాలు జారీ చేశారు.*ప్రశ్నలు మాత్రం మిగిలే ఉన్నాయి..*:ఒక మహిళ బ్రతికి ఉండగానే ఆమెను ప్రభుత్వ రికార్డుల్లో చనిపోయినట్టుగా చూపించేంత ధైర్యం ఎవరిచ్చారు? తప్పుడు ధ్రువపత్రాలు ఎలా జారీ అయ్యాయి? అక్రమ పట్టా పొందడానికి ఎవరు సహకరించారు? ప్రభుత్వ భూముల రికార్డులను తమ ఇష్టానుసారం మార్చుకునే మాఫియాలకు అధికార యంత్రాంగంలో అండదండలు ఉన్నాయా? ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, తప్పుడు పత్రాలు సృష్టించిన వారిపై, వాటికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే గందం జ్యోతికి చట్టబద్ధంగా రావలసిన భూమిని అప్పగించి న్యాయం చేయాలని కోరుతున్నారు.

No comments:

Post a Comment