*కొలువు తెచ్చిన గౌరవం*
*హైడ్రా ఉద్యోగంతో వచ్చిన ఆత్మవిశ్వాసం*
*హైడ్రా ఈగల్ టీమ్గా ప్రత్యేక గుర్తింపు*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, మే 29:
హైడ్రాలో ఉద్యోగం… ట్రాన్స్జెండర్ల జీవితాల్లో కొత్త వెలుగులు తెచ్చింది.కొలువు తెచ్చిన గౌరవం.. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇక వారు వెనక్కి చూడడంలేదు. విధులు ఎక్కడైనా.. ఎప్పుడైనా సిద్ధమంటున్నారు.చెరువులు, నాలాల కబ్జాలను తొలగించడంలో భాగస్వామ్యమౌతున్నారు. పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడడంలో ముందుంటున్నారు. మొత్తం 16 మంది ట్రాన్స్జెండర్లకు హైడ్రా అవకాశం కల్పించింది. ఇందులో ట్రాన్స్ ఉమెన్ 11 మంది ఉంటే.. ట్రాన్స్మెన్ ఐదుగురున్నారు.ఆక్రమణదారులు ఎంతటి వారైనా వెరవకుండా..విధులు నిర్వహించి ప్రజా ఆస్తులు కాపాడడంలో భాగస్వామ్యమౌతున్నారు. హైడ్రా (HYDRAA)లో మాకు దక్కిన ఉద్యోగం కేవలం ఉపాధి మాత్రమే కాదు.. మా జీవితాలకు కొత్త గుర్తింపు అని అంటున్నారు. హైడ్రా యూనీఫామ్ వేసుకోవడం గౌరవంగా భావిస్తున్నామని అంటున్నారు. "హైడ్రా ఈగల్ టీమ్" గా నామకరణం చేసి..విధుల్లో భాగస్వామ్యులను చేయడం ఎంతో సంతోషంగా ఉందని ట్రాన్స్జెండర్లు చెబుతున్నారు.హైడ్రాఈగల్ టీమ్గా సేవలు..కబ్జాదారులు ఎంతటి వారైనా.. హైడ్రా వెనుకడుగు వేయదు.హైడ్రా ఇచ్చిన ధైర్యంతో ఈగల్ టీమ్ పని చేస్తోంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం,ఐలాపూర్లో 862 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడడంలో ట్రాన్స్జెండర్లు చురుకైన పాత్ర పోషించారు. ఇటీవల మాదాపూర్ లో ఈదులకుంట కాపాడడంలో చురుకైన పాత్రపోషించారు. ప్రజలకు నచ్చజెప్పడం, మహిళలతో మాట్లాడి పరిస్థితిని సర్దిచెప్పడం, అధికారులు–ప్రజల మధ్య సమన్వయం చేయడం వంటి పనుల్లో వారు ప్రత్యేక పాత్ర పోషించారు. వారిలో సహనం ఎక్కువ.భావోద్వేగాలను అర్థం చేసుకునే గుణం ఉంది. అందుకే ఫీల్డ్లో మంచి ఫలితాలు సాధిస్తున్నారు అని హైడ్రా అధికారులు ప్రశంసిస్తున్నారు. హైడ్రాలో పనిచేస్తున్న చాలామంది ట్రాన్స్జెండర్లు ఇప్పుడు తమ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. నెల జీతం వస్తోంది. సమాజంలో గౌరవం పెరిగింది. ముఖ్యంగా “మేము కూడా పనికి పనికొచ్చే వాళ్లమే” అన్న నమ్మకం వారిలో బలపడింది.
➡️మా జీవితాల్లో వెలుగులు:
గాయత్రి -మా జీవితాల్లో డబ్బుకంటే గౌరవమే ముఖ్యమైంది.ఇప్పుడు హైడ్రా యూనిఫాం వేసుకుని బయటికి వెళ్తే గౌరవంగా ఉంది. అది మా జీవితంలో పెద్ద మార్పు. “అవకాశం ఇస్తే ట్రాన్స్జెండర్లు ఏ రంగంలోనైనా రాణిస్తారు.” హైడ్రాలో మా విధులు అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. హైడ్రాలో అధికారులతో పాటు.. ప్రతి ఒక్కరూ మాకు సహకరిస్తున్నారు. విధులు నిర్వర్తించడంలో సమానంగా చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి, హైడ్రా కమిషనర్కు ధన్యవాదాలు.
➡️హైడ్రాతో ప్రత్యేక గుర్తింపు: రుచిత -ప్రకృతిలో అందరూ భాగమే. ఆ ప్రకృతిని రక్షించడంలో మేము భాగస్వామ్యమయ్యాం. పార్కులు, చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడంలో మా వంతు పాత్ర పోషిస్తున్నాం. హైడ్రాలో పని చేయడంతో మాకు ప్రత్యేక గుర్తింపు లభించింది. హైడ్రా అంటే ప్రజలకు ఎంతో విశ్వాసం.. ఆ సంస్థలో మేము భాగస్వామ్యం అవ్వడంచాలా సంతోషంగా ఉంది.
➡️బాధ్యతగా వ్యవహరిస్తున్నాం: తాన్షీరాయ్ - బిక్షాటన చేసుకుంటూ జీవితాలు వెల్లదీసేవాల్లం. ట్రాన్స్జెండర్లంటే ఇంతకుముందు ఎక్కడికి వెళ్లినా ఎగతాళి చేసేవారు.పని అడిగితే తిరస్కరించేవారు. కానీ ఇప్పుడు యూనిఫాం వేసుకుని విధులకు వెళ్లినప్పుడు అందరూ గౌరవంగా మాట్లాడుతున్నారు.
No comments:
Post a Comment