*నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం విద్యుత్ శాఖ నిర్లక్ష్యం – రైతు నూక గణేష్‌కు భారీ నష్టం*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, మే 06:
నల్గొండ జిల్లా,శాలిగౌరారం మండలం, పెర్కకొండారం గ్రామానికి చెందిన కోళ్ళ ఫాం రైతు నూక గణేష్ గారు తీవ్ర అన్యాయానికి గురయ్యారు. గత ఆదివారం వచ్చిన ఈదురుగాలులకు కరెంటు స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. కానీ అడ్లూర్ పరిధిలో ఉన్న లైన్మెన్ నిర్లక్ష్యం, సంబంధిత విద్యుత్ అధికారుల స్పందన లోపం కారణంగా గంటలు కాదు... రోజులు గడిచినా కరెంటు పునరుద్ధరణ జరగలేదు.దీంతో కోళ్ల ఫామ్‌లో తాగునీరు అందక, సుమారు 320 కోళ్లు మృతి చెందడం అత్యంత దురదృష్టకరం మాత్రమే కాదు — ఇది అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. రైతు కష్టాన్ని అర్థం చేసుకోని వ్యవస్థ వైఫల్యం ఇది.
శాలిగౌరారం మండలం వ్యాప్తంగా పరిస్థితి ఇదే విధంగా ఉంది. లైన్మెన్లు తమ విధులు నిర్వర్తించకుండా, ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకుని పనులు చేయించడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో స్పందించే సామర్థ్యం పూర్తిగా దెబ్బతింది. గ్రామాల్లో కరెంటు సమస్యలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్నాయి.ఈ విషయంపై శాలిగౌరారం ఏఈ గారిని, నల్లగొండ డీఈ గారిని సంప్రదించినప్పటికీ సరైన స్పందన లేకపోవడం అత్యంత విచారకరం. బాధ్యతల నుండి తప్పించుకోవడం కాదు — ప్రజల సమస్యలపై స్పందించడం అధికారుల ప్రథమ కర్తవ్యం.
•ప్రజల డిమాండ్లు:
-కోళ్ళ మృతి చెందిన ఘటనపై తక్షణ విచారణ చేపట్టాలి.
-రైతు నూక గణేష్ గారికి పూర్తి నష్టపరిహారం వెంటనే అందించాలి.
-నిర్లక్ష్యం చేసిన ఏఈ, లైన్మెన్లపై కఠిన చర్యలు తీసుకోవాలి.
-మండలంలో విద్యుత్ వ్యవస్థను పునర్‌వ్యవస్థీకరించి, అత్యవసర సేవలను బలోపేతం చేయాలి.
ఇంకా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోకపోతే, ప్రజల తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడం తప్పదని హెచ్చరిస్తున్నాము.
“రైతు నష్టం – ప్రభుత్వ నిర్లక్ష్యం… ఇక సహించేది లేదు!”
No comments:
Post a Comment